తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం, మాళికాపురం దేవి ఆలయాలకు కొత్త ప్రధాన అర్చకులను (మేల్శాంతి) ఎంపిక చేశారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడిగా అరీక్కర సుబ్రమణ్యన్ శంకరన్ నంబూద్రి, మాళికాప్పురం ప్రధాన అర్చకుడిగా అయడత్ ఇల్లం ఎ దామోదరన్ నంబూద్రి నియమితులయ్యారు. సంప్రదాయబద్ధంగా లాటరీ పద్ధతి ద్వారా అర్చకుల ఎంపికను చేపట్టారు.
పందళం రాజభవనానికి చెందిన చిన్నారులు ఈ లక్కీ డ్రా చీటీలను తీశారు. శబరిమల ప్రత్యేక కమిషనర్ ఆర్. జయకృష్ణన్, దేవస్వం కమిషనర్ బి. సునీల్ కుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో అధికారికంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఏడాది తీర్థయాత్ర కాలానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడింది. దశాబ్దాల తర్వాత మహానవమి, విజయదశమి పర్వదినాల సమయంలో శబరిమల ఆలయం తెరుచుకోవడం ఒక అరుదైనదిగా నిలిచింది. ఈ కీలక ఘట్టాన్ని వీక్షించేందుకు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉన్నతాధికారులు, ప్రముఖులు, వేలాది మంది అయ్యప్ప భక్తులు సన్నిధానానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. తుల మాస విశేష పూజాదికాలు పూర్తయిన తర్వాత అక్టోబర్ 22న కొండపై ఉన్న ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఇదీ చదవండి: బెంగాల్ తొక్కిసలాట: వాతావరణ శాఖ వైఫల్యమే కారణం?


