కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట ఏర్పడి 19 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఉత్తర కోల్కతాలోని ముక్తారాం బాబు స్ట్రీట్లో ఉన్న చోర్బగాన్ సర్వజనీన్ దుర్గా పూజా పండల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో శనివారం సాయంత్రం ఊహించని విధంగా అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షం, చూస్తుండగానే కుండపోతగా మారి సుమారు ఒక గంట పాటు కొనసాగింది. ఈ వర్షం చోర్బగాన్ పూజా పండల్కు వచ్చిన వారికి ఇబ్బందులు సృష్టించింది.
తొలుత తేలికపాటి చిరుజల్లులతో ప్రారంభమైనప్పటికీ, వెంటనే వర్షం తీవ్రరూపం దాల్చడంతో తలదాచుకునేందుకు జనం మండపం లోపలికి పరుగులు తీశారు. అయితే, వర్షం తగ్గుముఖం పట్టే వరకు వేచి చూస్తున్న జనంతో మండపం లోపల, వెలుపల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది, అదే సమయంలో వర్షం మరింత జోరందుకుంది.
వాతావరణ శాఖ శనివారం వరకు అక్కడక్కడా వర్షాలు పడతాయని అంచనా వేసినప్పటికీ, అది కేవలం తేలికపాటి చిరుజల్లులకే పరిమితమవుతుందని భావించింది. అయితే రుతుపవనాల తిరోగమనం కారణంగా ఇంతి భారీ వర్షం సంభవించిందని, దీనివల్ల విడతలవారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హెచ్.ఆర్. బిశ్వాస్ తెలిపారు.
రుతుపవనాల ఉపసంహరణ ఇప్పటికే ప్రారంభమైనందున ఆదివారం నుంచి వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ, శనివారం కోల్కతాలో రెండుసార్లు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం పడిన వర్షం కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ, సాయంత్రం పడిన వర్షం మాత్రం ఏకధాటిగా ఎక్కువ సేపు కొనసాగింది. వర్షం కారణంగా నేల తడిగా, బురదమయంగా మారడంతో నడిచేందుకు పట్టు దొరక్క జనం జారిపడ్డారని, దీంతో తొక్కిసలాట జరిగిందని వాతావరణ శాఖ అధికారి ఒకరు వివరించారు.
వర్షం చాలా తీవ్రమైనది కాకపోయినా, 45 నిమిషాలకు పైగా నిరంతరాయంగా కురిసిందని, ఒకవేళ వర్షం త్వరగా ఆగిపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజున ఈ వర్షం పండుగ ఉత్సాహాన్ని నీరుగార్చింది. మళ్లీ వర్షం పడుతుందేమోనని భక్తులు ఆందోళన చెందగా, ఆదివారం నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని, అక్టోబర్ 21 (విజయదశమి) వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం దాదాపు శూన్యమని, ఇకపై ఇలాంటి వర్షం పునరావృతం కాదని వాతావరణ విభాగం తెలిపింది.
ఇదీ చదవండి: 19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి


