గోరఖ్‌పూర్ (యూపీ): ఒక ఆవు మరణం కాస్తా ఏకంగా 450 మందికి యాంటీ రేబిస్ టీకాలివ్వాల్సిన పరిస్థితికి దారితీసింది! అది వీధికుక్క కాటుతో మరణించి ఉంటుందన్న అనుమానాలే అందుకు కారణం! దాంతో దుర్గా పూజను పురస్కరించుకుని సదరు ఆవు పాల నుంచి తయారు చేసిన ప్రసాదం తిన్నవారంతా బెంబేలెత్తిపోయారు. వారందరినీ పేరుపేరునా గుర్తించి మరీ టీకా ఇచ్చినట్టు అధికారులు గురువారం వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో దాదీ ఖాస్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. టీకాల కోసం బుధవారం గ్రామంలో ప్రత్యేక క్యాంపే ఏర్పాటు చేయాల్సి వచ్చింది! ‘‘ఆవు రెండు రోజుల పాటు నలతగా కనిపించింది. మంగళవారానికల్లా పరిస్థితి విషమించడంతో పశువైద్యున్ని సంప్రదించాం. అప్పటికే అది కుక్కలా మొరుగుతూ అసాధారణంగా ప్రవర్తించసాగింది. సాయంత్రానికల్లా మరణించింది’’అని యజమాని నవామీ యాదవ్ చెప్పుకొచ్చాడు. అన్నట్టూ, సదరు ఆవు పాలు రెండు దుకాణాలకు, పలు నివాసాలకు కూడా సరఫరా అయినట్టు తేలడం కొసమెరుపు!


