యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై వరుస దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌతీలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ఆదేశాల మేరకే హౌతీలు సౌదీ అరేబియాపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు చమురు ధరలను భారీగా పెంచి అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. హౌతీల దాడులను తాను మర్చిపోనని, ఎన్నికల అనంతరం అమెరికా నుంచి తగిన తీవ్ర పరిణామాలు ఉంటాయని 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.
“హౌతీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏడాది కిందట మనం తీవ్రస్థాయిలో బాంబుల వర్షం కురిపించినప్పుడు వారు పాఠం నేర్చుకున్నారనుకున్నాను. వారి విజ్ఞప్తి మేరకే అప్పట్లో దాడులు ఆపాం. చాలా కాలం ప్రశాంతంగా ఉన్న వారు, ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి దాడులకు తెగబడుతున్నారు” అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు.
సౌదీలో భారీ ప్రాణనష్టం
అక్టోబర్ 10న సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఈ భీకర దాడుల్లో హైదరాబాద్ వాసి సహా మొత్తం 13 మంది మృతి చెందగా, 300 మందికిపైగా గాయపడ్డారు.
సౌదీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
హౌతీలు మళ్లీ దాడులు ప్రారంభించడంతో, హార్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు, గ్యాస్ రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ ఏడాది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ 3.3% క్షీణించవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.


