breaking news
voice mail
-
కిమ్ నార్త్ కొరియా మిషన్ ఫోన్లో వింత మెసేజ్!
అదొక దేశానికి చెందిన కీలక దౌత్య కార్యాలయపు ఫోన్ నంబర్. ఆ నెంబర్‌కు కాల్ చేయగానే.. అవతలి నుంచి వచ్చిన మెసేజ్ విని ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా అధికారిక సమాచారం లేదంటే స్వాగత సందేశం వినిపించాల్సిన చోట.. ఊహించని మాటలు వినిపించాయి. తొలిసారి విన్నవారికి అసలు ఇది ఆ కార్యాలయ అధికారిక సందేశమేనా? లేక ఎవరో కావాలనే మార్చేశారా? అనే అనుమానం కలిగింది. ఇంతకీ ఆ ఫోన్లో ఏం వినిపిస్తోంది? అసలు ఈ వింత మెసేజ్ వెనుక ఎవరున్నారు?అమెరికా గడ్డపై ఉత్తర కొరియాకు ఉన్న ఏకైక దౌత్య కేంద్రం.. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో ఉన్న ఆ దేశ శాశ్వత మిషన్. ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో ఈ కార్యాలయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. యూఎన్ సభ్యదేశాల అధికారిక డైరెక్టరీలో ఈ మిషన్ ఫోన్ నంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు వినిపించే వాయిస్మెయిల్నే తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యవహారానికి కేంద్రంగా మారింది.ఏం వినిపించిందంటే..తాజాగా ఆ నంబర్‌కు ఫోన్ చేసినప్పుడు వాయిస్మెయిల్లో సాధారణ కార్యాలయ సందేశానికి బదులు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడే సందేశం వినిపించింది. అందులో ఉత్తర కొరియాలోని ఆహార కొరత, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ కిమ్‌పై సెటైర్లు వేసినట్లు సీక్రెట్ ఆడియోలో ఉంది. చివర్లో సందేశాలు స్వీకరించే మెయిల్‌బాక్స్ నిండిపోయిందని ఆటోమేటెడ్ వాయిస్ చెబుతోంది.అంటే.. ఎవరో ఆ మిషన్ ఫోన్ వాయిస్‌మెయిల్ గ్రీటింగ్ను మార్చి, దాన్ని కిమ్‌ను ఎగతాళి చేసే సందేశంగా మార్చినట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ సందేశాన్ని ఎవరు పెట్టారు?.మిషన్ సిబ్బందికే షాక్ఈ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు సదరు మిషన్‌ను సంప్రదించగా.. ఈ నంబర్ తమది కాదన్నట్లుగా అక్కడి ఓ సిబ్బంది స్పందించడం మరింత ఆసక్తి రేపింది. ఈ నంబర్‌కు సంబంధించిన వాయిస్‌మెయిల్ గురించి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసి, ‘‘ఇది మా నంబర్ కాదు’’ అని చెప్పి తలుపు మూసేశారని సమాచారం.అయితే విచిత్రమేమిటంటే.. కొన్ని రోజుల తర్వాత ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించినప్పుడు ఆయన ప్రసంగ పత్రం మొదటి పేజీలో ఇదే ఫోన్ నంబర్ కనిపించింది. అంటే నంబర్ మాత్రం ఉత్తర కొరియా మిషన్దేనన్న విషయం స్పష్టమవుతోంది. కానీ వాయిస్ మెయిల్‌ను ఎవరు మార్చారన్నదే మిస్టరీగా మిగిలింది.ఎలా మార్చగలిగారు?ఇది వినగానే పెద్ద సైబర్ దాడి జరిగిందేమో అనిపించొచ్చు. కానీ సైబర్ భద్రతా నిపుణుల ప్రకారం.. ఇలాంటి వాయిస్‌మెయిల్ వ్యవస్థల్లో భద్రత బలహీనంగా ఉంటే వాటిని మార్చడం అంత కష్టమైన పని కాకపోవచ్చు. కొన్ని ఫోన్ వ్యవస్థల్లో వాయిస్‌మెయిల్ పాస్వర్డ్లు సులభంగా ఊహించగలిగే నాలుగు అంకెల కోడ్లుగా ఉండొచ్చు. వాటిని ఆటోమేటెడ్ కాల్స్‌తో కూడా ప్రయత్నించి యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఏదైనా దేశం చేసిన అత్యంత క్లిష్టమైన సైబర్ ఆపరేషనే అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఒక వ్యక్తి చేసిన చిలిపి పని కావొచ్చు!. ఎవరో కావాలనే రాజకీయ వ్యంగ్యంగా వాయిస్ మెయిల్‌ను మార్చేసి ఉండొచ్చు!!. అసలు ఎవరు చేశారన్నది మాత్రం తెలియరాలేదు.ఇది ఇప్పుడే మొదలైందా?కాదు. ఈ నంబర్ వాయిస్‌మెయిల్ గతంలో కూడా ఇదే తరహాలో ఉండేదా? అనే విషయాన్ని పరిశీలించినప్పుడు మరో ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2023 నవంబర్‌లో ఈ నంబర్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. అప్పట్లో సాధారణ వాయిస్‌మెయిల్ సందేశమే వినిపించిందని చెప్పాడు. అంటే ప్రస్తుత వ్యంగ్య సందేశం ఆ తర్వాత ఎప్పుడో మార్చి ఉండే అవకాశం ఉంది.ఒకప్పుడు కీలక దౌత్య మార్గంన్యూయార్క్లోని ఉత్తర కొరియా మిషన్‌కు గతంలో మరింత ప్రాధాన్యం ఉండేది. అమెరికా–ఉత్తర కొరియా మధ్య నేరుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఈ మిషన్ ఒక అనధికారిక కమ్యూనికేషన్ మార్గంగా పనిచేసేది. 1990లలో ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై జరిగిన కీలక చర్చల్లోనూ ఈ ‘న్యూయార్క్ ఛానల్’ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతం అమెరికా–ఉత్తర కొరియా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉత్తర కొరియా రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. దీంతో న్యూయార్క్‌లోని ఈ దౌత్య మార్గం గతంతో పోలిస్తే అంత క్రియాశీలంగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అదే మిషన్ ఫోన్లో కిమ్‌ను ఎగతాళి చేస్తూ ఓ వింత సందేశం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
మెయిల్స్ సృష్టించి.. అమెరికన్లకు టోకరా!
సాక్షి, హైదరాబాద్: ముంబై ముఠా అమెరికావాసుల్ని లక్ష్యంగా చేసుకుంది... ఆ దేశంతోపాటు ఇక్కడి అనేక నగరాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది... ముఠాసభ్యులు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారుల అవతారం ఎత్తారు... పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయంటూ వాయిస్ మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో అమెరికన్లను బెదిరించారు... కొన్ని గిఫ్ట్‌కార్డ్స్ కొనాలంటూ వారి డెబిట్ కార్డుల వివరాలు తెలుసుకుని నిండా ముంచారు... ఈ పంథాలో రూ.కోట్లలో టోకరా వేసిన ఈ ఘరానా ముఠాను గతవారం ముంబై పోలీసులు పట్టుకున్నారు. వీరికి ఆ డేటా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌తోపాటు హైదరాబాద్ నుంచీ అందిందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తుతోపాటు నగరంలో ఉన్న ఏజెంట్లను పట్టుకోవడానికి ముంబై నుంచి ప్రత్యేక బృందం సిటీకి రానుంది. అప్పులపాలై తప్పుదారి... ముంబైకి చెందిన ఈ గ్యాంగ్ సూత్రధారి యోగేశ్ శర్మ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పాడు. ఆరు నెలల క్రితం అక్కడి వెస్ట్ గోరేగావ్‌లో ఉన్న ఛావ్ల్ ప్రాంతంలోని భవనంలో కొంతభాగాన్ని అద్దెకు తీసుకున్నాడు. అందులో బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నష్టాలు చవి చూశాడు. తర్వాత మరొకరితో కలసి అందులోనే ఆయుర్వేద ఉత్పత్తుల్ని విదేశీయులకు విక్రయించడానికి ఓ కాల్ సెంటర్ ప్రారంభించాడు. ఇదీ ఆశించిన స్థాయిలో సఫలం కాలేదు. ఫలితంగా నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి మోసాల బాటపట్టాడు. ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభిషేక్ సాలియన్, నయీమ్ ఖాన్, ఆసిఫ్, ప్రదీప్‌కుమార్‌లతో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. యోగేష్ అమెరికాతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్, హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తుల నుంచి అమెరికా జాతీయులకు చెందిన సోషల్ సెక్యూరిటీ నంబర్ల (ఎస్ఎస్ఎన్) డేటాను సంగ్రహించాడు. దీని ఆధారంగా ఈ ముఠా సభ్యులు అమెరికాకు చెందిన ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారుల అవతారమెత్తారు. వాయిస్ మెయిల్స్ సృష్టించి... ఆ డేటా ఆధారంగా ఒక్కో నిందితుడు వాయిస్ మెయిల్స్ సృష్టించి వెయ్యిమందికి పంపేవారు. ఐఆర్ఎస్ అధికారులమంటూ పరిచయం చేసుకుని పన్ను చెల్లింపులో కొన్ని అవకతవకలు జరిగాయని, దానికి సంబంధించి జరిమానాలు చెల్లించాల్సి ఉందని బెదిరించేవారు. అమెరికా ఐఆర్ఎస్ విభాగం కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుందని, దీని ప్రకారం జరిమానా మొత్తం నుంచి 25 శాతం వెచ్చించి ఆయా సంస్థల గిఫ్ట్‌కార్డ్స్ కొనాల్సి ఉంటుందని వారి డెబిట్‌కార్డుల డేటా సంగ్రహించేవారు. ఇతర రహస్య వివరాలు అమెరికన్ల నుంచి తెలుసుకుని వారి ఖాతాల్లోని డబ్బును వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్ల ఖాతాల్లోకి మళ్లించి మోసం చేసేవారు. ఆపై ఫోన్ నంబర్లు మార్చేసి అందుబాటులో లేకుండాపోయేవారు. గడిచిన 45 రోజులుగా ఈ పంథాలో అనేకమంది అమెరికన్ల నుంచి రూ.కోట్లు కాజేశారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టి గురువారం ఈ ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. విచారణలో హైదరాబాద్ లింకులు బయటకురాడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు దర్యాప్తుతోపాటు డేటా అందించిన ఏజెంట్లను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపారు. ముంబై ముఠాకు సహకరించిన హైదరాబాదీలు ఎవరనే విషయంపై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. -
వావ్ వాట్సాప్.. మరో రెండు కొత్త ఫీచర్లా!
న్యూఢిల్లీ : ఎంతో కాలంగా సాగుతున్న పుకార్లకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెక్ పెట్టింది. ఆఖరికి తన యాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లకు స్థానం కల్పించేసింది. వాయిస్ మెయిల్, కాల్ బ్యాక్ ఫీచర్లను యాప్స్ తాజా బీటా వెర్షన్ లో కంపెనీ యాడ్ చేసింది. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కంపెనీ ఇంకా వీటిని ఆవిష్కరించలేదు. వాట్సాప్ ప్రత్యేక ఆండ్రాయిడ్ బీటా వెర్షెన్ 2.16.189 కాల్ లాగ్ సెక్షన్ కింద యాప్ లో ఈ రెండు కొత్త ఫీచర్లను జోడించింది. వాట్సాప్ కాల్ ను యూజర్లు అటెండ్ చేయని పక్షంలో, కాల్ చేసిన వ్యక్తికి వాయిస్ మెయిల్, కాల్ బ్యాక్ ఆప్షన్లు డిస్ ప్లే అయ్యేలా వాట్సాప్ ఈ ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే అవతలి వైపు యూజర్లకు ఈ ప్రత్యేక వెర్షన్ ని కలిగి ఉండాల్సినవసరం లేదు. కాల్ బ్యాక్ ఆప్షన్ తో యూజర్లు ఇతర వ్యక్తులకు వెంటనే మళ్లీ కాల్ చేసే సౌకర్యం కలిగిస్తోంది. అదేవిధంగా వాయిస్ మెయిల్ ఫీచర్ తో రెగ్యులర్ వాయిస్ మెసేజ్ లను రిసీవర్లకు పంపించుకోవచ్చు. వాయిస్ మెయిల్ ను రికార్డు చేసి, దాన్నినొక్కి పట్టుకుంటే చాలు యూజర్ల వాయిస్ మెసేజ్, పంపించాలనుకున్న వ్యక్తులకు వెళ్లిపోతోంది. ప్రస్తుతం వాట్సాప్ తాజా బీటా వెర్షన్ లోకి చేర్చిన ఈ కొత్త ఫీచర్లను ఆసక్తి కలిగినవారు ఏపీకేమిర్రర్ వెబ్ సైట్ నుంచి యాప్స్ ఏపీకే ఫైల్ ను మాన్యువల్ గా డౌన్ లోడ్ చేసుకొని, ఇన్ స్టాల్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్ ప్లే లేదా కంపెనీ సొంత వెబ్ సైట్ లో ఈ ప్రత్యేక వెర్షన్ ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవు. చాలాకాలంగా ఈ రెండు కొత్త ఫీచర్లు కేవలం వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇటీవలే వాట్సాప్ యూజర్లకు మెసేజ్ టెస్టింగ్ లో కొత్తదనం కోసం కొత్త ఫాంట్ ను సైతం కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
‘చంద్ర’ డ్రామా
సాక్షి, ఒంగోలు : ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా కార్యకర్తలు, పార్టీ నాయకుల ఫోన్ నంబర్లకు వాయిస్ మెయిల్ చేసి అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు అభిప్రాయాలు సేకరించడం మాటున దాగున్న అంతరార్థం తమకు ఎరుకేనంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇన్నాళ్లూ కష్టపడిన వారిని పక్కకు తప్పించి.. ఇప్పటికిప్పుడు పార్టీకి భారీగా ఫండ్నిచ్చే వారికి సీట్లు కట్టబెట్టేందుకు బాబు అభిప్రాయసేకరణ పేరిట డ్రామా ఆడుతున్నారని చెబుతున్నారు. జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా, ఏఒక్క చోటా అసెంబ్లీ అభ్యర్థి పేరును ఖరారు చేసి ప్రచారం చేసుకోవాల్సిందిగా అధినేత హామీనివ్వకపోవడంతో.... పార్టీ సీనియర్లు, ఆశావహులు డైలామాలో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని గతంలోనే పలికిన చంద్రబాబు నేడు, ప్రయోగాల ప్రణాళిక అమలు చేస్తాననడంపై పార్టీ సీనియర్లు మదనపడుతున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయం లేక ఆందోళన చెందుతున్న పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరి మరింత ఇబ్బందికరంగా మారుతుందనే భయం తలెత్తుతోంది. పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు.. ‘మీ ఊరు, మీ అభివృద్ధి, మీకు నచ్చిన వ్యక్తే.. నాకూ నచ్చుతాడు..’ అని చెబుతూ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణతోనే తమ పార్టీ ఎన్నికల అభ్యర్థులను ఎంపికచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు మాటల్ని నేత బీర చందమేనంటున్నాయి ఆపార్టీ వర్గాలు. ఒంగోలు లోక్‌సభ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనేది ఇప్పటికీ తేలని అంశమైంది. బాపట్ల లోక్‌సభను ఆశించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి దేవానంద్ విషయంలో బాబు ఏనిర్ణయం తీసుకోలేదు. ఒంగోలు అసెంబ్లీ స్థానానికి కిందటి ఎన్నికల్లో పోటీచేసి ఓడిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మరోమారు టికెట్ ఆశిస్తుండగా, అక్కడ అతని ప్రాధాన్యతను తగ్గించే వ్యూహాలు నడుస్తున్నాయి. ఈవిషయంలో దామచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కరణం బలరాంను చంద్రబాబు ప్రోత్సహిస్తూనే.. అతనికీ అద్దంకి సీటును ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. కనిగిరిలో కూడా తాజాగా మాజీ ఎమ్మెల్యే ఇరిగినేని తిరుపతినాయుడు టీడీపీలోకి రావడంతో.. అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న కదిరి బాబురావును ఏవిధంగా పక్కకు తప్పించాలనే ప్రణాళిక నడుస్తోందని తెలిసింది. గిద్దలూరుకు సాయికల్పనారెడ్డి పేరును కాదని, ఆమె కొడుకు అభిషేక్‌రెడ్డికి సీటు కేటాయింపుపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. తల్లీకొడుకులకు చెరోవిధంగా చెబుతూనే... అక్కడ్నే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేరు చంద్రబాబు మదిలో ఉందని సమాచారం. దర్శిలో శిద్దా రాఘవరావుదీ అదే పరిస్థితిగా ఉంది. అతనికీ చివరి వరకు సీటు ఖరారవుతుందా..? లేదా..? అనేది చెప్పలేమని పార్టీ వర్గాల అభిప్రాయం. చీరాలలో పోతుల సునీత మినహా సంతనూతలపాడు, యర్రగొండపాలెం, పర్చూరు స్థానాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటున్న వారికి చంద్రబాబు ఆఖరున చెంపచెళ్లమనిపించే ప్రమాదం పొంచి ఉందనేది పార్టీ సీనియర్ల అభిప్రాయం. పర్చూరు విషయంలో ఏలూరు సాంబశివరావు దగ్గర్నుంచి పార్టీకి భారీగా ఫండ్ తీసుకున్నట్లు.. ఆయన నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరికి బినామీగా ఉన్నందున సీటు విషయంలో గట్టెక్కవచ్చనేది ‘ఏలూరి’ అనుచరుల వాదన. ప్రయోగాలతో తప్పని పతనం: ఎన్నికలొచ్చిన ప్రతీసారీ ఏదోరకంగా ప్రయోగాల పేరిట పార్టీ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి.. భారీగా డబ్బు ఖర్చుపెట్టించడం.. ఆఖరికి సీటు లేదనడం ఆనవాయితీగా వస్తున్నదేనని జిల్లా పార్టీశ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. గడచిన ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక, రాజ్యసభ సీట్ల కేటాయింపు తీరు.. తాజాగా చంద్రబాబు ప్రకటించిన అభిప్రాయసేకరణ ప్రయోగంతో పోల్చుకుంటూ పార్టీవర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పొలిట్‌బ్యూరో సభ్యుల్ని విడివిడిగా పిలిచి మాట్లాడేక్రమంలో.. చంద్రబాబు తన మదిలోని మాటను ఇతరుల అభిప్రాయంగా వినిపించి.. ఏకాభిప్రాయానికి తేవడం అందరికీ తెలిసిందే. సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరులు పార్టీని ఆర్థికంగా ఆదుకుంటున్నారని బాబు జిల్లా నేతలకు సందర్భానుసారం చెబుతూనే ఉన్నారు. వారందర్నీ రాజ్యసభకు పంపిన తీరుపై అప్పట్లో నేతల రాద్ధాంతాన్ని జిల్లా శ్రేణులు గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. నియోజకవర్గాల్లో నమ్మకం కోల్పోయిన టీడీపీ తాజాగా ప్రయోగాల పేరుతో మరింత పతనం దిశగా అడుగులేస్తుందని.. రానున్న ఎన్నికల్లో ఆపార్టీ ఘోరపరాభవం చవిచూస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


