కళ్లెదుటే స్నేహితురాలి జలసమాధి.. వైరల్‌గా చివరి క్షణాలు! | Indonesian Waterfall Tragedy, 25 Year Old Woman Falls To Death While Bathing, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

కళ్లెదుటే స్నేహితురాలి జలసమాధి.. వైరల్‌గా చివరి క్షణాలు!

Oct 17 2026 10:42 AM | Updated on Oct 17 2026 11:15 AM

Woman Swept Away by Strong Currents at Indonesian Waterfall Video Viral

జలపాతం అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడుపుతున్న ఓ యువతికి ఊహించని ప్రమాదం ఎదురైంది. నీటిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఎత్తు నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కళ్లముందే జరిగిన ప్రమాదాన్ని చూసిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌ లిమాపులుహ్‌ కోటా ప్రాంతంలోని రోబో హరౌ జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. పదంగ్‌ పరియామన్‌కు చెందిన విండీ రహ్మా పుత్రి (25) గురువారం (అక్టోబర్‌ 15) మధ్యాహ్నం జలపాతం వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఎత్తు నుంచి కిందపడింది. ఆమెను కాపాడేందుకు ఓ స్నేహితురాలు ప్రయత్నించినప్పటికీ.. చేతులు పట్టు తప్పి ఆమె కిందకు జారిపోయింది. 

సాయంత్రం నుంచి గాలింపు
గురువారం మధ్యాహ్నా సమయంలో ప్రమాదం జరిగింది. అయితే తోటి స్నేహితుల ఆందోళనల నడుమ.. సాయంత్రం 5.27 గంటలకు అధికారులకు సమాచారం అందడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితురాలి కోసం సుమారు 570 మీటర్ల పరిధిలో గాలింపు చేపట్టాయి. చివరకు శుక్రవారం (అక్టోబర్‌ 16) ఉదయం 10.45 గంటలకు ఆమె మృతదేహాన్ని గుర్తించి వెలికితీశాయి. ఈ విషయాన్ని పదంగ్‌ క్లాస్‌-ఏ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ కార్యాలయ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ ధ్రువీకరించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

వైరల్‌గా ప్రమాద దృశ్యాలు..
యువతి జారిపడి కిందకు పడిపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమె స్నేహితుల పరిస్థితిని ఊహించలేకపోతున్నామని పలువురు వ్యాఖ్యానించారు. యువతి కుటుంబానికి సంతాపం తెలిపారు.

జలపాతాల వద్ద అందమైన దృశ్యాల కోసం వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. నిటారుగా ఉండే కొండ అంచులు, జారుడుగా ఉండే రాళ్లు, నీటి ప్రవాహాల సమీపంలో చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారవచ్చు. 

ఇదీ చదవండి: ఇరాన్‌పై అత్యంత భారీ బాంబు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement