ట్రంప్ ఆమోదంతో అమెరికా మిలటరీ ప్రయత్నాలు
వాషింగ్టన్: ఇరాన్‌లోని ఇంధన మౌలికవనరులు, అణు కేంద్రాలే లక్ష్యంగా అతి భారీ దాడులకు అమెరికా మిలటరీ సన్నాహాలు చేస్తోంది. అమెరికా పొదిలో ఉన్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పిలుచుకునే అతిపెద్ద నాన్–న్యూక్లియర్ బాంబును వేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే అనుమతి కూడా ఇచ్చినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
యుద్ధం ఎటూ తేలకపోవడం, హార్మూజ్‌ను ఇరాన్ దిగ్బంధించడం, చమురు ధరలకు భారీగా రెక్కలు రావడం వంటి పరిణామాలు అధ్యక్షుడు ట్రంప్‌నకు కొరుకుడు పడని నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మధ్యంతర ఎన్నికలు నవంబర్ 3వ తేదీన ముగిశాక, ఈ బాంబును పిక్‌యాక్స్ పర్వతం అడుగున ఇరాన్ అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్న అణుకేంద్రంపైనా దాడులు చేస్తామని ట్రంప్ గురువారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం గమనార్హం.
దాడులకు అతిపెద్ద బాంబును వాడుతామని చెప్పిన ఆయన..అణుబాంబును ప్రయోగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అయితే, అమెరికా–ఇరాన్‌ల మధ్య 8 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారీ బంబు సీబీయూ–43/బీ మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ బాంబ్(ఎంఓఏబీ)ని ప్రయోగించడం వల్ల మరింత ముదిరే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఎంవోఏబీ బరువు సుమారు 9.8 టన్నులు. మొదటిసారిగా దీనిని 2017లో అఫ్గానిస్తాన్‌లోని ఐఎస్ సొరంగంపై వేశారు. అయితే, ఇరాన్ అణుకేంద్రంపై బీవోఎంబీ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇచ్చే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.


