ట్రంప్‌కు టాయిలెట్‌ పంచ్‌.. నార్వే దిమ్మతిరిగే కౌంటర్‌! | Norway hits back at Trumps insult with genius level toilet humour | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు టాయిలెట్‌ పంచ్‌.. నార్వే దిమ్మతిరిగే కౌంటర్‌!

Oct 29 2026 1:58 PM | Updated on Oct 29 2026 2:37 PM

Norway hits back at Trumps insult with genius level toilet humour

ఓస్లో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నార్వేపై చేసిన అవమానకర వ్యాఖ్యలకు ఆ దేశ పర్యాటక సంస్థ వినూత్నంగా బదులిచ్చింది. ట్రంప్‌ విమర్శలను తమకు అనుకూలమైన ప్రచారంగా మార్చుకుంటూ.. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన అద్భుతమైన టాయిలెట్లను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతేకాదు.. ట్రంప్‌ రాజకీయ నినాదాన్ని గుర్తుచేసేలా ‘మేక్‌ షిట్‌ హౌసెస్‌ గ్రేట్‌ ఎగైన్‌’ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించింది. ప్రస్తుతం ఈ ప్రచారం ఆసక్తికరంగా మారింది.

నోబెల్‌ దక్కలేదని నార్వేపై ఆగ్రహం
వచ్చే వారం జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు మిచిగాన్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌ నార్వేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు నోబెల్‌ శాంతి బహుమతి రాలేదన్న అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. ‘నార్వే పరిస్థితి దారుణంగా ఉంది. అది ఒక చెత్త దేశంగా మారింది’ అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆ దేశం నుంచి వలసదారులను స్వాగతించబోనని కూడా పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని దక్షిణాఫ్రికా న్యాయమూర్తి, హక్కుల పరిరక్షకురాలు నవీ పిళ్లైకి ప్రదానం చేశారు.

విమర్శలనే ప్రచారంగా మార్చిన నార్వే
ట్రంప్‌ వ్యాఖ్యలకు నార్వే పర్యాటక సంస్థ ‘విజిట్‌ నార్వే’ తనదైన శైలిలో స్పందించింది. ‘షిట్‌హౌస్‌ కంట్రీ’ అంటూ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. తమ దేశంలో ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన టాయిలెట్లు ఉన్నాయని పేర్కొంది. ‘ప్రపంచంలోని అత్యంత అందమైన టాయిలెట్లను చూడండి’ అంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి, ప్రకృతి అందాల మధ్య ఉన్న విశ్రాంతి గదుల చిత్రాలను పంచుకుంది. ట్రంప్‌ వ్యాఖ్యలను పర్యాటక ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

‘మేక్‌ షిట్‌ హౌసెస్‌ గ్రేట్‌ ఎగైన్‌’
ట్రంప్‌ రాజకీయ నినాదం ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ను గుర్తుచేస్తూ.. ‘మేక్‌ షిట్‌ హౌసెస్‌ గ్రేట్‌ ఎగైన్‌’ అంటూ నార్వే పర్యాటక సంస్థ వ్యంగ్యంగా పేర్కొంది. ఈ టాయిలెట్లు అత్యవసర సమయాల్లోనే కాకుండా.. ప్రత్యేకంగా చూడటానికి కూడా వెళ్లదగినవని చమత్కరించింది. కొండ దిగువన ఫియోర్డ్‌ అందాలను వీక్షించేలా ఉన్న టాయిలెట్లు, నది పక్కన నిర్మించిన విశ్రాంతి గదులు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఉన్న ఇతర నిర్మాణాల చిత్రాలను ప్రచారంలో ఉపయోగించింది.

బంగారు టాయిలెట్‌ ప్రస్తావనతో మరో పంచ్‌
నార్వేలోని సెంజా ద్వీపంలో ఉన్న ‘గోల్డెన్‌ లూ’ను కూడా పర్యాటక సంస్థ ప్రస్తావించింది. బంగారు పూతతో కూడిన టాయిలెట్‌ సీటును కొనలేని సాధారణ ప్రజలకు ఇది మరో ఆకర్షణగా ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా కళాకారుడు మౌరిజియో కాటెలాన్‌ రూపొందించిన ‘అమెరికా’ అనే 18 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు టాయిలెట్‌ శిల్పాన్ని గుర్తుచేసింది. 2017లో ఆ కళాఖండాన్ని అమెరికా అధ్యక్ష భవనానికి అందించేందుకు ప్రతిపాదించినప్పటికీ.. ట్రంప్‌ దానిని సొంతం చేసుకోలేదు, అక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ కళాఖండం 2025 నవంబరులో సోథెబీస్‌ వేలంలో 12.1 మిలియన్‌ డాలర్లకు అమ్ముడైంది.

ట్రంప్‌ వ్యాఖ్యలపై నార్వే మంత్రి ఏమన్నారంటే..
ట్రంప్‌ వ్యాఖ్యలపై నార్వే విదేశాంగ మంత్రి ఎస్పెన్‌ బార్త్‌ ఐడె స్పందించారు. నోబెల్‌ శాంతి బహుమతి ఎంపికలో తమ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. నోబెల్‌ కమిటీ స్వతంత్రంగా పనిచేస్తుందనే విషయం ట్రంప్‌కు బాగా తెలుసని, ఈ విషయాన్ని ఇప్పటికే ఆయనకు గుర్తుచేశామని పేర్కొన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలు తమ దేశంలో పెద్దగా ప్రభావం చూపలేదన్న సంకేతాలను నార్వే ప్రభుత్వం ఇచ్చింది.

ఇదీ చదవండి: 10 క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement