సియోల్: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. గురువారం (అక్టోబర్ 29) సుమారు 10 స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తన తూర్పు తీరంలోని సముద్ర జలాల వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) వెల్లడించింది.
ఉత్తర కొరియా తూర్పు తీరంలోని వోన్సాన్ ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగాలపై నిఘాను బలోపేతం చేయడంతోపాటు, మరిన్ని క్షిపణి ప్రయోగాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తతను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా, జపాన్‌లతో పంచుకుంటున్నట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. మరోవైపు, ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి తమ దేశ ప్రత్యేక ఆర్థిక మండలి (ఈఈజెడ్) వెలుపల పడిపోయినట్లు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, జపాన్ ఎన్ని క్షిపణులను గుర్తించిందనే విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ స్పష్టం చేయలేదు.
ఉత్తర కొరియా గతంలో అక్టోబర్ 12న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఆ పరీక్ష ద్వారా క్షిపణిలోని కీలకమైన ఒక భాగానికి సాంకేతిక మెరుగుదల చేసిన ప్రక్రియ విజయవంతమైందో లేదో నిర్ధారించినట్లు అప్పట్లో ఉత్తర కొరియా ప్రకటించింది. తాజాగా సుమారు 10 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా మరోసారి దృష్టిని ఆకర్షించింది.
ఇదీ చదవండి: అయ్యప్ప భక్తులకు బీమా.. స్లాట్ బుకింగ్‌లో నామినీ అప్‌డేట్!


