పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. నవంబర్ 3 తర్వాత సైనిక దాడులకు దిగే అవకాశాలున్నాయన్న సంకేతాలతో పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఇరాన్‌పై దాడుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా.. అప్రమత్తంగా ఉండాలంటూ అమెరికా తన మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే చమురు కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలకూ ముప్పు తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్.. మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరు దౌత్యవేత్తలు వెల్లడించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇరాన్‌పై కొత్తగా దాడులు చేయాలా వద్దా? అనే విషయంలో ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆ దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత సైనిక చర్యకు ఆదేశాలు ఇచ్చే అంశాన్ని ట్రంప్ పలుమార్లు ప్రస్తావించిన నేపథ్యంలో తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పూర్తిస్థాయి సైనిక ఘర్షణలు ప్రారంభమవుతాయేమోనన్న ఆందోళన ప్రాంతీయ దేశాల్లో నెలకొంది. ఇరాన్‌పై అమెరికా చేపట్టే కొత్త సైనిక చర్యలు కొన్ని రోజులపాటు కొనసాగవచ్చని ప్రాంతీయ మిత్రదేశాలకు అమెరికా అధికారులు తెలిపినట్లు దౌత్యవేత్తలు వెల్లడించారు. అయితే, ఇరాన్‌తో పాటు దానికి మద్దతుగా ఉన్న సాయుధ బృందాలు ప్రతిదాడులకు దిగితే ఘర్షణలు మరింత కాలం కొనసాగవచ్చని ప్రాంతీయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా ఇంధన కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలపై దాడులు జరిగే అవకాశముందని అమెరికా అధికారులు మిత్రదేశాలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై వైట్‌హౌస్, ఇతర అమెరికా అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు, ఇరాన్‌పై దాడులకు అమెరికా సైన్యం ఎంత త్వరగా సిద్ధం కాగలదన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మరోవైపు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలకు ఇరాన్ మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అక్టోబర్ 28న ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. దౌత్యం విజయవంతం కావడానికి తమ దేశం ఇప్పటికీ అవకాశం ఇస్తోందని పేర్కొన్నారు. గత నెలలో ఇరాన్ ప్రతిపాదించిన కొన్ని అంశాలపై మధ్యవర్తులతో కలిసి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణకు తిరిగి రావడానికి ఆ ప్రతిపాదనను ప్రాతిపదికగా తీసుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని వెల్లడించారు. అయితే, ఆ ప్రతిపాదనను ట్రంప్ గతంలోనే తిరస్కరించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశాంగ శాఖ కూడా పిలుపునిచ్చింది. వివేకంతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు రాజకీయ పరిష్కారాల దిశగా ప్రయత్నించాలని ఇరు పక్షాలకు సూచించింది. పూర్తిస్థాయి సైనిక కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కాకుండా చూడాలని కోరింది.
ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన యుద్ధం ఇప్పటికే పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని చమురు మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలపై దాడులు చేపట్టారు. దీనికి ప్రతిగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌లో హౌతీల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ‘అణు కేంద్రం’లో అగ్నిప్రమాదం.. క్షణాల్లో అప్రమత్తం!


