కరోలినా: అమెరికాలోని అణు పరిశోధన కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని అమెరికా ఇంధన శాఖకు చెందిన సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీలో బుధవారం (అక్టోబర్ 28) సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రేడియోధార్మిక పదార్థాలు విడుదలయ్యాయన్న ఆందోళన వ్యక్తమైంది. దీంతో పరిసర ప్రాంతాల్లో రైలు, నదీ, విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు. సాయంత్రం 5.40 గంటలకు కొద్ది నిమిషాల ముందు ప్రయోగశాలలోని ఒక గదిలో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ అగ్నిప్రమాదం కారణంగా రేడియోధార్మిక పదార్థాలు విడుదలైనట్లు ‘డబ్ల్యూఆర్డీడబ్ల్యూ’ వెల్లడించింది.
ఉద్యోగులను లోపలే ఉండాలని ఆదేశాలు
ప్రయోగశాలలోని ఏరియా ఏ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు సుమారు 30 నిమిషాలపాటు అక్కడే సురక్షిత ప్రాంతాల్లో ఉండిపోయారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే చర్యల్లో లేదా కార్యకలాపాల నిలిపివేతలో పాల్గొనని ఇతర ఉద్యోగులను కూడా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భవనాల లోపలే ఉండాలని అధికారులు సూచించారు. ఈ విషయాన్ని సవన్నా రివర్ సైట్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలోని రైలు, నదీ, విమాన రాకపోకలపై ఆంక్షలు విధించడంతోపాటు, కేంద్రంలోకి కొత్తగా ప్రవేశించే వాహనాలు, వ్యక్తుల రాకపోకలను కూడా నిలిపివేశారు.
రెండు గంటల్లో అదుపులోకి మంటలు
అగ్నిప్రమాదం జరిగిన రెండు గంటలలోపే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రభావిత భవనం వెలుపల రేడియోధార్మిక కాలుష్యం వ్యాపించినట్లు ఎలాంటి సమాచారం లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితులను అధికారులు పర్యవేక్షించారు. రేడియోధార్మిక పదార్థాల విడుదలపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ, భవనం వెలుపల కాలుష్యం ఉన్నట్లు నిర్ధారణ కాలేదని నివేదిక పేర్కొంది.
నాలుగు గంటల తర్వాత ఆంక్షల ఎత్తివేత
సవన్నా రివర్ సైట్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. అత్యవసర పరిస్థితిని రాత్రి 9.45 గంటలకు ముగిసినట్లు ప్రకటించారు. అగ్నిప్రమాదం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితి ప్రారంభమైన సుమారు నాలుగు గంటల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యలను ఉపసంహరించడంతోపాటు, కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలపై విధించిన ఆంక్షలు ఎత్తివేశారు.
సవన్నా రివర్ సైట్ ఎందుకు కీలకం?
దక్షిణ కరోలినాలోని పలు కౌంటర్లలో విస్తరించి ఉన్న సవన్నా రివర్ సైట్ సుమారు 310 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న అమెరికా ఇంధన శాఖకు చెందిన సముదాయం. ఇందులోనే సవన్నా రివర్ నేషనల్ లాబొరేటరీ ఉంది. అణు సంబంధిత పర్యావరణ శుద్ధి, కాలుష్య నివారణ, వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాలపై ఈ ప్రయోగశాల పరిశోధనలు నిర్వహిస్తుంది. పర్యావరణ శుద్ధి కార్యక్రమాలతోపాటు జాతీయ భద్రత, అణు విజ్ఞాన రంగాల్లోనూ ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదీ చదవండి: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు!


