అమెరికా దౌత్యవేత్త పర్యటన నేపథ్యంలో విడుదల
మాస్కో: ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరిపేందుకు అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్ మాస్కో పర్యటన నేపథ్యంలో రష్యా బుధవారం అమెరికన్ బందీ స్టెఫెన్ హుబ్బార్డ్‌ను విడుదల చేసింది. ఉక్రెయిన్ తరఫున యుద్ధంలో పాల్గొంటున్నాడన్న ఆరోపణలపై ఈ ఉపాధ్యాయుడిని రష్యా బంధించిన విషయం తెలిసిందే. ఆసక్తికరంగా హుబ్బార్డ్ విడుదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక రోజు ముందే జోస్యం చెప్పారు.
పుతిన్‌తో తాను చాలాసేపు మాట్లాడానని, అమెరికాలోని మిషిగన్‌కు చెందిన హుబ్బార్డ్‌ను విడుదల చేయమని కోరానని చెప్పడం విశేషం. రష్యా రెండు నెలల్లో విడుదల చేసిన అమెరికన్ బందీల్లో హుబ్బార్డ్ రెండో వ్యక్తి. అయితే ఇతడి విడుదలకు విట్‌కాఫ్ పర్యటన ఒక్కటే కారణం కాకపోవచ్చునని నిపుణుల అంచనా. ఉక్రెయిన్‌తో అమెరికా సంబంధాలు క్రమేపీ దెబ్బతింటున్న నేపథ్యంలో ట్రంప్ రష్యాకు అనుకూలంగా పలు నిర్ణయాలు తీసుకోవడం కూడా కారణమంటున్నారు.
ఉదాహరణకు గత శుక్రవారం రష్యాపై ఆంక్షలను ఎత్తివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. హుబ్బార్డ్ విడుదలపై అమెరికా దౌత్యవేత్త విట్‌కాఫ్ రష్యాకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీ కారణంగా అతడు తన కుటుంబానికి దగ్గరవుతున్నాడు’’అని అన్నారు. దీనికి పుతిన్ కూడా స్పందిస్తూ విడుదలైన తరువాత హుబ్బార్డ్ సెయింట్ పీటర్స్‌బెర్గ్ విమానాశ్రయం పుల్‌కోవో వద్ద ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదికి ఐదేళ్లు పూర్తి చేసుకోనున్న రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధం విరమణ కోసం విట్‌కాఫ్ చాలాకాలంగా విఫల ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.


