సాక్షి, కామారెడ్డి జిల్లా: ఏజెంట్ చేతిలో మోసపోయి, అధిక వేతనం ఆశతో రష్యా సైన్యంలో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్‌ఖాన్(43) మృతి చెందినట్లు అతడి సహచరుల ద్వారా తెలుస్తోంది. వివరాలు.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన మహ్మద్ అఫ్జల్‌ఖాన్ మరో నలుగురితో కలిసి ఉపాధి నిమిత్తం ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లాడు.
మాస్కోలో ఆరు నెలలపాటు మెకానికల్ ఫీల్డ్ హెల్పర్ విభాగంలో పనిచేశారు. పని ముగిసిందని స్వదేశం వెళ్లిపోవాలని ఏజెంట్ గంగాధర్ చేతులెత్తేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు రష్యన్ ఆర్మీలో గార్డెనింగ్ పనులకోసం చేరాడు. అయితే ఆ ఆర్మీలో సైనికులుగా చేర్చుకుని ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఉంచారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో మరణించిన వారిలో అప్జల్‌ఖాన్ ఉన్నట్టు సమాచారం.
ఈ విషయాన్ని అతడి సహచరుడు సిర్సు అశోక్ తన భార్యకు వాయిస్ మెస్సేజ్ ద్వారా తెలిపాడు. తాను తప్పించుకుని తిరిగి పట్టుబడగా బేడీలు వేసి చిత్రహింసలు పెడ్తున్నారని ఆ మెస్సేజ్‌లో ఉంది. తన కుమారుడిని స్వదేశానికి రప్పించాలనే ఉద్దేశంతో అఫ్జల్‌ఖాన్ తండ్రి అనేక ప్రయత్నాలు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: నక్కజిత్తుల మస్క్.. అడ్డంగా బుక్కయ్యాడుగా!


