భారత్‌లో వ్యాపార గుత్తాధిపత్యాలపై గళమెత్తిన టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు అమెరికాలో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఆలస్యం కావడానికి కొందరు సంపన్న వ్యాపారవేత్తలే కారణమంటూ ఆరోపించిన మస్క్.. రిలయన్స్, బీజేపీ మధ్య సంబంధాలపై విమర్శలు గుప్పించారు. అయితే, అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో కొనసాగేందుకు భారీగా రాజకీయ విరాళాలు అందించడంపై ఇప్పుడు ఆయనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సెనేటర్ బెర్నీ శాండర్స్ మస్క్‌పై తీవ్రంగా స్పందించారు.
అమెరికాలో రాజకీయాల కోసం మస్క్ ఖర్చు చేస్తున్న భారీ మొత్తాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు కాంగ్రెస్‌పై తమ పట్టును కొనసాగించేందుకు మస్క్ సుమారు 36.6 కోట్ల డాలర్లు ఖర్చు చేసినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఇందులో జూలై నుంచి అందించిన విరాళాలే కనీసం 27.6 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నాయి.
రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థులకు మద్దతిచ్చే సెనేట్ లీడర్‌షిప్ ఫండ్‌కు 15.8 కోట్ల డాలర్లు, తన రాజకీయ కమిటీ అమెరికా పీఏసీకి 7.6 కోట్ల డాలర్లు అందించినట్లు నివేదికలు తెలిపాయి. ఇతర రిపబ్లికన్ అనుకూల రాజకీయ కమిటీలకూ ఆయన నిధులు సమకూర్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా కూడా మస్క్ భారీగా ఖర్చు చేశారు.
‘సంపన్నుల గుప్పిట్లో రాజకీయాలా?’
మస్క్ విరాళాలపై అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ తీవ్రంగా స్పందించారు. 2024లో ట్రంప్ గెలుపు కోసం మస్క్ సుమారు 29 కోట్ల డాలర్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు కొనసాగేందుకు మరో 36.6 కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. సంపన్నులు తమ ఆర్థిక శక్తితో రాజకీయ వ్యవస్థపై అసాధారణ ప్రభావం చూపుతున్నారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారానికి కొద్దిమంది బిలియనీర్లు భారీగా నిధులు సమకూర్చే పరిస్థితి పెరిగితే.. సామాన్య ప్రజల సమస్యల కంటే సంపన్నుల ప్రయోజనాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందన్నది శాండర్స్ వాదన. రాజకీయ వ్యవస్థ కొద్దిమంది ధనవంతుల గుప్పిట్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మస్క్ విరాళాలను ప్రస్తావిస్తూ, సంపదను రాజకీయ అధికారాన్ని ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
స్టార్‌లింక్ ఎంట్రీతో మొదలైన వివాదం
ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న మస్క్‌కు భారత్ కీలక మార్కెట్. అయితే, దేశంలో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. కొందరు భారతీయ ‘ఒలిగార్క్’లు తమ వ్యాపార గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
‘ఒలిగార్క్’ అంటే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై అసాధారణ ప్రభావం చూపగల కొద్దిమంది సంపన్నులు లేదంటే శక్తిమంతుల సమూహం. భారత్‌లో అలాంటి వ్యాపారవేత్తలే పోటీని అడ్డుకుంటున్నారన్నది మస్క్ వాదన. స్టార్‌లింక్‌కు మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయం. అయితే, అనుమతుల ప్రక్రియలో జాప్యానికి వ్యాపార గుత్తాధిపత్యాలే కారణమన్న ఆరోపణ నిర్ధారణ కాలేదు.
‘ప్రధాని అంబానీనా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు
ఈ వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని లక్ష్యంగా చేసుకుని మస్క్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ‘భారత్‌కు అసలైన బాస్ అంబానీనా?’ అన్న అర్థం వచ్చేలా ప్రశ్నించడంతోపాటు ‘డియర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. భారత్‌లో టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లో వ్యాపార ప్రయోజనాలు, పోటీ, ప్రభుత్వ అనుమతులపై ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
భారత్‌లోనూ మస్క్‌కు కౌంటర్లు
మస్క్ వ్యాఖ్యలపై భారతీయుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఒక సంస్థకు మార్కెట్‌లో పోటీ చేసే అవకాశం ఉండాలని కోరడం వేరు.. తన వ్యాపారానికి అనుకూలంగా నిర్ణయాలు రావాలని కోరుతూ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలపై ఆరోపణలు చేయడం వేరన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వాలా వద్దా అన్నది నిబంధనలు, భద్రతా ప్రమాణాల ఆధారంగా నిర్ణయించాలే తప్ప, వ్యాపారవేత్తల మధ్య ఆరోపణలతో తేల్చకూడదని పలువురు పేర్కొన్నారు.
మస్క్ వాదనకే ఎదురుప్రశ్న!
ఇక్కడే మస్క్ వాదనపై విమర్శకులు ఎదురుప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తూ.. అమెరికాలో మాత్రం ఒక రాజకీయ పక్షం అధికారంలో కొనసాగేందుకు భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఇతరుల ఆర్థిక ప్రభావాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి.. తన సంపదతో రాజకీయాలపై ప్రభావం చూపడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్నను సీనియర్ పొలిటీషియన్ అయిన శాండర్స్ ముందుకు తెచ్చారు. మరి అమెరికాలో తన రాజకీయ విరాళాలపై వస్తున్న ప్రశ్నలకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ఏఐ విషయంలో అన్నీ అతి భయలేనా?


