రోబోట్ కుక్కలు.. వైమానిక దాడులు.. ఆ ముఠాల ఆట కట్టించగలవా? | New Military Tactics to Curb Gang in Haiti | Sakshi
Sakshi News home page

రోబోట్ కుక్కలు.. వైమానిక దాడులు.. ఆ ముఠాల ఆట కట్టించగలవా?

Nov 26 2026 7:35 PM | Updated on Nov 26 2026 7:38 PM

New Military Tactics to Curb Gang in Haiti

గ్యాంగ్‌ల పీచమణిచేందుకు అనేక దేశాలు అనేక రకాల వ్యూహాలను అమలు చేస్తుంటాయి. అలాగే, కరేబియన్ దేశమైన హైతీలో గ్యాంగ్‌ల హింసను అరికట్టేందుకు సరికొత్త సైనిక వ్యూహాలు తెరపైకి వచ్చాయి. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే నేతృత్వంలో సైనిక బలగాల మోహరింపు, ఆయుధాలతో కూడిన రోబోట్ కుక్కల వినియోగం, వైమానిక దాడులు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ చర్యలు హైతీకి శాశ్వత శాంతిని తీసుకురాగలవా? వాటి చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గ్యాంగ్‌ల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బుకెలే ప్రభుత్వం సైనిక చర్యలను వేగవంతం చేసింది. భద్రతా కార్యకలాపాల్లో సైనిక బలగాలతో పాటు ఆధునిక రోబోటిక్ పరికరాలను ఉపయోగిస్తోంది. మరోవైపు గ్యాంగ్‌ల స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు ప్రచురిస్తోంది. ఈ చర్యలకు హైతీలో కొంతమంది ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ, వాటి విధానాలపై విమర్శలు కూడా వస్తున్నాయి.

హైతీలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది?
హైతీ రాజధాని పోర్ట్-ఔ-ప్రిన్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో సాయుధ ముఠాలు రహదారులు, నివాస ప్రాంతాలు, కీలక వాణిజ్య మార్గాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2026 జూలై నుంచి సెప్టెంబర్ వరకు గ్యాంగ్ హింస, ఇతర హింసాత్మక ఘటనలు, భద్రతా బలగాల చర్యల్లో కనీసం 1,167 మంది మరణించారు. మరో 459 మంది గాయపడ్డారు.

సైనిక చర్యలపై మానవ హక్కుల ఆందోళనలు
గ్యాంగ్‌లపై దాడులు నిర్వహించడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు అనుగుణంగా సైనిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేస్తోంది.

గ్యాంగ్‌లను బలహీనపరిచిన తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ నియంత్రణను పునరుద్ధరించడం, పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం, రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం కూడా కీలకం. అందువల్ల బుకెలే ప్రయోగం తక్షణ భద్రతను కల్పించినా, హైతీ సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారంగా నిలుస్తుందా అనేది వేచి చూడాలి.

తాజా పరిణామాలు
అక్టోబర్ 2026లో హైతీకి సుమారు 1,000 మంది సైనికులను పంపిన ఎల్ సాల్వడార్.. నవంబర్ నాటికి తన బలగాల సంఖ్యను 2,000కు పైగా పెంచింది. అక్టోబర్ 18న ఐక్యరాజ్యసమితి మద్దతుతో పనిచేస్తున్న భద్రతా మిషన్‌కు చెందిన నలుగురు ఎల్ సాల్వడార్ సిబ్బంది అదృశ్యం కావడంతో ఈ మోహరింపు వేగవంతమైంది. నవంబర్ 20న పేలుడు పదార్థాల నిర్వహణలో ముగ్గురు ఎల్ సాల్వడార్ సైనికులు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement