బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ జీషన్ అలీతోపాటు ముగ్గురు వ్యోమగాములతో కూడిన మానవసహిత వ్యోమ నౌకను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. మానవ సహిత వ్యోమనౌక ’షెంజౌ–24లో అంతరిక్షానికి వెళ్లిన తొలి పాకిస్థానీగా జీషన్ అలీ రికార్డు సృష్టించారు.
చైనా వాయువ్య ప్రాంతంలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి షెంజౌ–24 వ్యోమనౌక ’లాంగ్ మార్చ్–2ఎఫ్’ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతమైందని అధికారులు కొద్ది నిమిషాల్లోనే ప్రకటించారు. మిషన్ కమాండర్ టాంగ్ హాంగ్‌బో, ఫ్లైట్ ఇంజనీర్ వు యిలతో కలిసి ప్రయాణిస్తున్న అలీ, చైనా సొంత అంతరిక్ష కేంద్రమైన ’టియాంగాంగ్’లో అడుగుపెట్టనున్నారు. ప్రయోగించిన మూడు గంటల్లోపే ఈ వ్యోమనౌక టియాంగాంగ్‌తో అనుసంధానం కానుంది.
జీషన్ అలీ కంటే ముందు నమీరా సలీమ్ అనే మహిళ పారిశ్రామికవేత్త వర్జిన్ గలాక్టిక్ ద్వారా అంతరిక్షానికి వెళ్లి ఆ ఘనత సాధించిన మొదటి పాకిస్థానీగా గుర్తింపు పొందారు. అయితే నమీరా సాధారణ పౌరురాలు. జీషన్ అలీ ప్రభుత్వం తరఫున చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి పాకిస్థానీ అన్నది గమనార్హం. పాక్ వ్యోమగామి జీషన్ అలీ వారం రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. అనంతరం ’షెంజౌ–23’ వ్యోమనౌకలో తిరిగి రానున్నారు.
చైనా వ్యోమగాములు మాత్రం ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. చైనా వ్యోమగాములు అంతరిక్ష కేంద్రం నిర్వహణ, జీవ శాస్త్రాలు, మెటీరియల్స్ సైన్స్, అంతరిక్ష వైద్యం, మైక్రోగ్రావిటీ ఫిజిక్స్ వంటి 90కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాల్లో సైన్యం కూడా జోక్యం చేసుకుంటోందన్న కారణంగా అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కార్యకలాపాల నుంచి చైనాను దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఫలితంగా చైనా సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది.


