కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాని వల్ల కలిగే ముప్పులపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్లు, విమానాలు, ఔషధాల మాదిరిగానే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/సూపర్ ఇంటెలిజెన్స్ పైనా కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని స్పష్టం చేశారు. అపారమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరని పేర్కొన్నారు.
ఏఐ/ఎస్‌ఐపై నియంత్రణలతో అన్ని ప్రమాదాలనూ పూర్తిగా తొలగించలేమని బిల్‌గేట్స్ అంగీకరించారు. అయితే, చెడు ఉద్దేశాలతో వ్యవహరించే వ్యక్తులు ఈ మోడళ్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూనే, దాని వల్ల కలిగే ముప్పులను తగ్గించేందుకు సమతుల్య విధానం అవసరమని అభిప్రాయపడ్డారు.
అది అతిశయోక్తేనా?
ఏఐ/ఎస్‌ఐ వల్ల మానవాళి మొత్తం అంతమయ్యే ప్రమాదం ఉందన్న వాదనలపైనా గేట్స్ స్పందించారు. ఈ తరహా భయాలను కొన్ని సందర్భాల్లో అతిగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. అయితే, దాని వల్ల జరిగే ప్రమాదాలను పూర్తిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. కార్లు, విమానాలు, ఔషధాల కంటే ఏఐతో ముడిపడిన ప్రమాదాలు మరింత తీవ్రమైనవిగా ఉండొచ్చని హెచ్చరించారు. నియంత్రణ కోల్పోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని, పరిశ్రమలోని సంస్థలు సైతం ఈ ముప్పులపై అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ టెక్నాలజీ అభివృద్ధిని పూర్తిగా అడ్డుకోకుండా.. భద్రతకు ప్రాధాన్యమిచ్చే మధ్యేమార్గాన్ని అనుసరించాలని సూచించారు.
అలాగే.. సీఎన్‌ఎన్ జర్నలిస్ట్ జేక్ టాపర్‌తో ఆదివారం ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వ్యక్తుల వల్ల బయోటెర్రరిజం (జీవాయుధాల ద్వారా ఉగ్రదాడులు) ముప్పు పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన మాత్రం వ్యక్తం చేశారు.
పాలకుల పర్యవేక్షణ అవసరం
మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా ఏఐ/ఎస్‌ఐ నియంత్రణలపై ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ కంటే వాషింగ్ మెషీన్లు, పాల ఉత్పత్తులపై కూడా ఎక్కువ భద్రతా నిబంధనలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ సాంకేతికత ఒక సాధనంగానే కాకుండా, ఆయుధంలా కూడా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా భద్రతా ప్రమాణాల రూపకల్పనను ఆలస్యం చేయకూడదని అన్నారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం కృతిమ మేధ మోడళ్లను గుడ్డిగా నమ్మకూడదని ఇటీవల సూచించారు. అవి మరింత శక్తిమంతంగా మారుతూ వ్యక్తిగత సమాచారాన్ని పొందగలుగుతున్న నేపథ్యంలో, వాటిలో లోపాలు లేదంటే భద్రతాపరమైన సమస్యలు తలెత్తవచ్చని అప్రమత్తం చేశారు. ముందునుంచే ప్రమాదాలను నియంత్రించే ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు.
టెక్ దిగ్గజాల మధ్య భిన్నాభిప్రాయాలు
ఏఐ/ఎస్‌ఐ నియంత్రణల విషయంలో టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థలు బలమైన భద్రతా నిబంధనలకు మద్దతు ఇస్తుండగా, మెటా, ఎన్విడియా వంటి సంస్థలు నియంత్రణలపై భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూపర్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిపై అతిగా నియంత్రణలు విధిస్తే, ఈ రంగంలో చైనా అమెరికాను అధిగమించే అవకాశం ఉందని గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే, దాని దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రజల భద్రతను కాపాడటం ప్రపంచ దేశాల ముందున్న కీలక సవాలుగా మారింది.
ఇదీ చదవండి: శభాష్.. స్కూల్స్‌లో ఇక డిజిటల్ పాఠాలు రద్దు


