లండన్: తరగతి గదుల్లో ల్యాప్‌టాప్‌ల వినియోగం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోందని భావించిన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రసిద్ధ ‘వించెస్టర్ కాలేజ్’ కీలక నిర్ణయం తీసుకుంది. 1382లో ఏర్పాటైన ఈ పురాతన బోర్డింగ్ పాఠశాల, డిజిటల్ పరికరాలను పక్కనబెట్టి తిరిగి సాంప్రదాయ పెన్ను, పుస్తకాల పద్ధతిలోనే బోధన, హోంవర్క్ కొనసాగించాలని నిర్ణయించింది. కేవలం స్మార్ట్‌ఫోన్లను నిషేధించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని, ల్యాప్‌టాప్‌లు కూడా విద్యార్థుల దృష్టిని మరల్చి తీవ్రమైన పరధ్యానానికి గురిచేస్తున్నాయని పాఠశాల హెడ్ ఎలిజబెత్ స్టోన్ తెలిపారు.
ఈ సరికొత్త విధానం ప్రకారం, పాఠ్యాంశాల బోధనకు కంప్యూటర్ అత్యవసరం అని ఉపాధ్యాయులు భావిస్తేనే వాటిని తరగతుల్లో అనుమతిస్తారు. 9 నుంచి 10 ఏళ్లు, అలాగే 13 నుంచి 15 ఏళ్ల లోపు వయసున్న విద్యార్థులు తమ హోంవర్క్‌ను కచ్చితంగా పెన్నుతో పుస్తకంపైనే పూర్తి చేయాలనే నిబంధన విధించారు. దీనితో పాటు, క్యాంపస్‌లో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లకు బదులుగా కేవలం సాధారణ ఫీచర్ ఫోన్లను (బ్రిక్ ఫోన్లు) మాత్రమే వాడటానికి అనుమతి ఇచ్చారు.
అయితే సాంకేతికతను పూర్తిగా పాఠశాల నుంచి తొలగించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), త్రీడీ మ్యాథమెటికల్ మోడలింగ్, భాషా అభ్యాసాల వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం ఇప్పటికీ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. అలాగే ప్రత్యేక విద్యా అవసరాలు , అభ్యాస సమస్యలు ఉన్న విద్యార్థులకు సైతం అవసరమైన మేర కంప్యూటర్ల వినియోగానికి వెసులుబాటు కల్పించారు.
ఇదీ చదవండి: గురుద్వారాలో కేజ్రీవాల్ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు


