గురుద్వారాలో కేజ్రీవాల్ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు | Delhi Sikh Gurudwara Committee files complaint against Kejriwal | Sakshi
Sakshi News home page

గురుద్వారాలో కేజ్రీవాల్ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

Oct 12 2026 7:35 AM | Updated on Oct 12 2026 7:35 AM

Delhi Sikh Gurudwara Committee files complaint against Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారా బంగ్లా సాహిబ్ పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ నేతలపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల సమయంలో గురుద్వారాలో కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని, సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే వీడియోలను ప్రచారం చేశారని కమిటీ పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఢిల్లీలో నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలకు వెళ్లే ప్రయత్నంలో ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు గురుద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించారని డీఎస్‌జీఎంసీ ఆరోపించింది. పవిత్రమైన గురుద్వారా ప్రాంగణంలో రాజకీయ నినాదాలు చేస్తూ ప్రార్థనా స్థలం పవిత్రతను, మర్యాదను ఉల్లంఘించారని కమిటీ తమ ఫిర్యాదులో పేర్కొంది. పూజా స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిక్కు సంగత్  మతపరమైన మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేసింది. నిరసనకారులు పెద్ద సంఖ్యలో గురుద్వారా వద్ద గుమిగూడగా, వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు పోలీసులు బూట్లతో గురుద్వారా లోపలికి ప్రవేశించారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పష్టతనిచ్చారు. భక్తులు బూట్లు విడిచే ప్రాంతానికి వెళ్లే సాధారణ మార్గంలో మాత్రమే సిబ్బంది నడిచారని, లోపలి పవిత్ర ప్రదేశంలోకి బూట్లతో వెళ్లలేదని స్పష్టం చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే దురుద్దేశంతోనే ఈ వీడియోలను తప్పుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ‘గర్బా’ నుంచి మైసూరు వరకు.. పండగ సంబరాలెన్నో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement