‘గర్బా’ నుంచి మైసూరు వరకు.. పండగ సంబరాలెన్నో.. | Navratri 2026 11 Must Visit Destinations Across India | Sakshi
Sakshi News home page

‘గర్బా’ నుంచి మైసూరు వరకు.. పండగ సంబరాలెన్నో..

Oct 12 2026 7:16 AM | Updated on Oct 12 2026 7:16 AM

Navratri 2026 11 Must Visit Destinations Across India

భక్తి పారవశ్యం.. సంప్రదాయ నృత్యాలు.. రంగురంగుల వేడుకలు.. సంగీత హోరు.. ఇలా నవరాత్రి పండగ దేశవ్యాప్తంగా విభిన్న సంస్కృతులకు అద్దం పడుతుంది. గుజరాత్‌లో గర్బా, దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ వైభవం కనువిందు చేస్తుంది. కర్ణాటకలో రాజసం ఉట్టిపడే మైసూరు దసరా, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను ఆకట్టుకుంటాయి. 2026 నవరాత్రి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండగ సంబరాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం థామస్ కుక్ ఇండియా, ఎస్‌ఓటీసీ ట్రావెల్ సంస్థలు 11 ప్రత్యేక గమ్యస్థానాలను సూచించాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

అహ్మదాబాద్‌.. గర్బా వేడుకలకు కేంద్రం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నవరాత్రి సంబరాలకు ప్రసిద్ధి చెందింది. నగరమంతా సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేసే ప్రజలు, ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలు, భారీ గర్బా వేడుకలతో పండగ వాతావరణం నెలకొంటుంది. సంప్రదాయ సామూహిక నృత్యాల నుంచి భారీ స్థాయిలో నిర్వహించే కార్యక్రమాల వరకు పర్యాటకులకు ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. పగటిపూట పాత నగరంలోని చారిత్రక ప్రాంతాలు, అందమైన హవేలీలు, సబర్మతి ఆశ్రమం, అడాలజ్ మెట్ల బావిని సందర్శించవచ్చు. కాలికో వస్త్ర మ్యూజియాన్ని చూడటంతో పాటు ఫాఫ్డా-జిలేబీ, ఖాఖ్రా, గుజరాతీ సంప్రదాయ భోజనాన్ని రుచి చూడవచ్చు. ఇక వడోదరలో సంప్రదాయ గర్బాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌, బరోడా మ్యూజియం, ఈఎంఈ ఆలయ సందర్శనతో పర్యటనను మరింత ఆసక్తికరంగా మార్చుకోవచ్చు.

హిమాచల్‌ప్రదేశ్‌.. ఆధ్యాత్మిక యాత్రకు..
హిమాచల్‌ప్రదేశ్‌లో నవరాత్రులు భక్తిశ్రద్ధలతో సాగుతాయి. కాంగ్రా, చింత్‌పూర్ణి, నైనా దేవి ఆలయాలను ఈ సందర్భంగా అందంగా అలంకరిస్తారు. హిమాలయ పర్వతాల ప్రకృతి అందాల మధ్య దేవీ దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఈ ప్రాంతం ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. కాంగ్రా కోట, చాముండా దేవి ఆలయాన్ని సందర్శించవచ్చు. పర్యటనను మరికొంత పొడిగించాలనుకునేవారు ధర్మశాల, మెక్‌లియోడ్ గంజ్ ప్రాంతాలకు వెళ్లవచ్చు. అక్కడి పర్వత దృశ్యాలు, బౌద్ధ మఠాలు, కేఫ్‌లు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

కోల్‌కతా.. దుర్గాపూజ వైభవానికి చిరునామా
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నవరాత్రి వేడుకలు దుర్గాపూజతో ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. కళాత్మకంగా రూపొందించిన పూజా మండపాలు, అందంగా అలంకరించిన దుర్గామాత విగ్రహాలు, సంప్రదాయ ధాక్ వాయిద్యాల నడుమ నగరమంతా పండగ కళ కనిపిస్తుంది. సాయంత్రం వివిధ మండపాలను సందర్శించడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. పగటిపూట విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన కుమార్టులిని సందర్శించవచ్చు. విక్టోరియా మెమోరియల్‌, భారతీయ మ్యూజియాన్ని చూడటంతో పాటు ఉత్తర కోల్‌కతాలోని చారిత్రక ప్రాంతాల్లో విహరించవచ్చు. హుగ్లీ నదీ తీరంలో సమయం గడపడం, దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయాన్ని సందర్శించడం, మిష్టి దోయ్‌, సందేశ్ వంటి బెంగాలీ తీపి వంటకాలను రుచి చూడటం పర్యటనకు అదనపు ఆకర్షణలు.

కచ్‌, రాజ్‌కోట్‌, ద్వారక.. గుజరాత్‌లో..
కచ్‌ ప్రాంతంలో నవరాత్రి జానపద కళలు, సంగీతం, నృత్యాలు, సంప్రదాయ హస్తకళలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెల్లని రణ్‌ ప్రాంతంలో సూర్యోదయం లేదా సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. భుజోడి, నిరోనా గ్రామాల్లో చేనేత, ఎంబ్రాయిడరీ, రోగన్ చిత్రకళ వంటి సంప్రదాయ కళారూపాలను పరిచయం చేసుకోవచ్చు. భుజ్‌లోని ప్రాగ్ మహల్‌, ఐనా మహల్‌ కూడా సందర్శించదగిన ప్రాంతాలు. ఇక సౌరాష్ట్రలోని రాజ్‌కోట్‌లో గర్బా, డాండియా వేడుకలు కుటుంబాలు, స్థానిక సమాజాలను ఒక్కచోటకు చేరుస్తాయి. కబా గాంధీ నో డేలో, వాట్సన్ మ్యూజియం, జూబ్లీ గార్డెన్ సందర్శించవచ్చు. ద్వారకలో ద్వారకాధీశ ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, బెట్ ద్వారక, రుక్మిణీదేవి ఆలయాలను దర్శించుకోవచ్చు. సముద్రతీరంలో సాయంత్రం విహరించడంతో పాటు స్థానిక మార్కెట్లలో సంప్రదాయ వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

భావ్‌నగర్‌, ఢిల్లీ.. రామ్‌లీలా వేడుకలకు..
గుజరాత్‌లోని భావ్‌నగర్‌ ప్రశాంతమైన వాతావరణంలో నవరాత్రి వేడుకలను ఆస్వాదించాలనుకునేవారికి అనువైన ప్రాంతం. నీలంబాగ్ ప్యాలెస్‌, తఖ్తేశ్వర్ ఆలయం, బార్టన్ మ్యూజియం, గాంధీ స్మృతి సందర్శించవచ్చు. సమీపంలోని వెలావదర్ బ్లాక్‌బక్ జాతీయ ఉద్యానవనంలో వన్యప్రాణులను చూసే అవకాశం ఉంటుంది. గుజరాతీ, కథియావాడీ వంటకాలు ఈ ప్రాంత పర్యటనకు ప్రత్యేకతను జోడిస్తాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో గర్బా, డాండియా కార్యక్రమాలతో పాటు రామ్‌లీలా వేడుకలు జరుగుతాయి. ఎర్రకోట, హుమాయూన్ సమాధి, కుతుబ్ మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు. పాత ఢిల్లీలోని రద్దీ మార్కెట్లు, వీధి ఆహారం, ఢిల్లీ హాట్‌లోని హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించవచ్చు. అక్షరధామ్ ఆలయ సందర్శనతో పర్యటనను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చు.

మైసూరు, ముంబయి.. రాజసం నుంచి..
కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు రాజసానికి ప్రతీకగా నిలుస్తాయి. విద్యుద్దీపాలతో వెలిగిపోయే మైసూరు ప్యాలెస్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ప్రదర్శనలు, భారీ ఊరేగింపు పండగకు ప్రత్యేక ఆకర్షణలు. చాముండి కొండపై ఉన్న చాముండేశ్వరి ఆలయం, దేవరాజ మార్కెట్‌, మైసూరు ఇసుక శిల్పాల మ్యూజియాన్ని సందర్శించవచ్చు. కరంజి సరస్సు వద్ద విహరించడంతో పాటు సమీపంలోని శ్రీరంగపట్నానికి వెళ్లవచ్చు. మైసూరు పాక్‌, దక్షిణ భారత సంప్రదాయ వంటకాలను రుచి చూడవచ్చు. మహారాష్ట్రలోని ముంబయిలో నవరాత్రి వేడుకలు నగరంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తాయి. భారీ గర్బా, దాండియా కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రాంతాల్లోనూ పండగ సంబరాలు జరుగుతాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా, ఫోర్ట్‌, కాలా ఘోడా చారిత్రక ప్రాంతాలు, ఎలిఫెంటా గుహలను సందర్శించవచ్చు. కొలాబా కాజ్‌వే, లింకింగ్ రోడ్‌లో షాపింగ్ చేయడంతో పాటు మెరైన్ డ్రైవ్‌లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. ఇలా ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతతో నవరాత్రి పర్యటనను మరపురాని అనుభవంగా మార్చుకోవచ్చు.

ఇదీ చదవండి: ధ్రువ్ రాఠీ వివాదం: విదేశీయులు భారత్‌లో నిరసనలు తెలుపవచ్చా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement