ఒక్క సీటుతో తలకిందులైన లెక్కలు.. న్యూజిలాండ్‌లో ఉత్కంఠ! | New Zealand Coalition Majority Crisis | Sakshi
Sakshi News home page

ఒక్క సీటుతో తలకిందులైన లెక్కలు.. న్యూజిలాండ్‌లో ఉత్కంఠ!

Nov 27 2026 11:02 AM | Updated on Nov 27 2026 11:11 AM

New Zealand Coalition Majority Crisis

ఎన్నికల ఫలితాలు న్యూజిలాండ్‌ రాజకీయాల్లో ఉత్కంఠ రేపాయి. ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే మరో పార్టీ మద్దతు తప్పనిసరి అయింది. ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ నేతృత్వంలోని అధికార కూటమి పార్లమెంటులో మెజారిటీకి ఒక్క సీటు దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు కీలకంగా మారాయి.

న్యూజిలాండ్‌ పార్లమెంటులో మొత్తం 130 స్థానాలు ఉండగా.. అధికార నేషనల్‌ పార్టీకి 40 సీట్లు వచ్చాయి. కూటమి భాగస్వాములైన ఏసీటీ పార్టీకి 13, న్యూజిలాండ్‌ ఫస్ట్‌ పార్టీకి 12 స్థానాలు దక్కాయి. దీంతో కూటమి బలం 65 సీట్లకు చేరింది. మెజారిటీకి ఒక్క సీటు తక్కువగా ఉండటంతో ఆపర్చునిటీ పార్టీ మద్దతు అవసరమైంది. ఆ పార్టీతో ఒప్పందం కుదరకపోతే మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సి రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు, లేబర్‌ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేదని అధికారిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. లేబర్‌ పార్టీ 36 స్థానాలు గెలుచుకోగా, గ్రీన్స్‌ పార్టీకి 17, మావోరీ ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే టె పాతి మావోరీ పార్టీకి ఐదు సీట్లు వచ్చాయి. ఆపర్చునిటీ పార్టీ మద్దతు ఇచ్చినా ఈ కూటమికి మెజారిటీ సాధ్యం కాదని ఫలితాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ మాట్లాడుతూ.. చర్చలు కొంత సవాలుగా ఉండవచ్చని, ఒప్పందం కుదరడానికి సమయం పడుతుందని తెలిపారు. తొందరపడి కుదుర్చుకున్న ఒప్పందం విఫలమైనా, ప్రజలను మళ్లీ ఎన్నికలకు పంపినా వారు హర్షించరని వ్యాఖ్యానించారు. మరోవైపు, లేబర్‌ పార్టీ నాయకుడు క్రిస్‌ హిప్కిన్స్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ అద్భుతమైన ఎన్నికల ప్రచారం నిర్వహించిందన్నారు. మార్పు కోరుకున్నవారి సంఖ్య ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని భావించినవారి కంటే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

ఆపర్చునిటీ పార్టీకి ఏడు స్థానాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ నాయకురాలు క్యూలే వాంగ్‌ కీలకంగా మారారు. నేషనల్‌ పార్టీతో చర్చలు జరుపుతామని, అయితే అన్ని అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అన్ని పార్టీల బాధ్యత అని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో అమల్లో ఉన్న మిక్స్‌డ్‌ మెంబర్‌ ప్రొపోర్షనల్‌ ఎన్నికల విధానంలో ఓటర్లు రెండు ఓట్లు వేస్తారని, ఒకటి రాజకీయ పార్టీకి, మరొకటి నియోజకవర్గ అభ్యర్థికి కేటాయిస్తారని ఎన్నికల అధికారులు వివరించారు.

నవంబర్‌ 7న పోలింగ్‌ ముగిసిన తర్వాత వెల్లడైన ప్రాథమిక ఫలితాల్లో అధికార కూటమికి స్వల్ప ఆధిక్యం కనిపించింది. అయితే విదేశాల్లో ఉన్నవారు, తమ నియోజకవర్గానికి వెలుపల ఉన్నవారు వేసిన ప్రత్యేక ఓట్ల లెక్కింపు అనంతరం కూటమికి రెండు స్థానాలు తగ్గాయి. ఈ ప్రత్యేక ఓట్లు సాధారణంగా వామపక్ష పార్టీలకు అనుకూలంగా ఉంటాయని ఎన్నికల విశ్లేషణలు చెబుతున్నాయి. నేషనల్‌ పార్టీ తక్కువ పన్నులు, చౌకైన విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంపు, రక్షణ రంగానికి ప్రాధాన్యం వంటి హామీలతో ప్రచారం చేసింది.

అయితే, ఈ ఎన్నికల్లో జీవన వ్యయం, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా మారాయని ఓటర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరగడం, ఉద్యోగ అవకాశాలు తగ్గడం, రాజకీయ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లడం ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు పేర్కొన్నారు. హెలెన్‌ క్లార్క్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వేలో సగానికి పైగా ప్రజలు న్యూజిలాండ్‌ను అవకాశాల దేశంగా చూడటం లేదని తేలింది. దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేవారి సంఖ్య రికార్డు స్థాయికి చేరిందని, మాజీ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌ సహా పలువురు ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: మరిన్ని అణ్వాయుధాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement