పాకిస్తాన్‌ పాఠశాలలో విషాదం | School Roof Collapses in Pakistan and kills at least 34 children and teacher | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ పాఠశాలలో విషాదం

Oct 16 2026 4:27 AM | Updated on Oct 16 2026 4:27 AM

School Roof Collapses in Pakistan and kills at least 34 children and teacher

పైకప్పు కూలిన స్కూల్‌ భవనం, చిన్నారుల మృదేహాల వద్ద కుటుంబీకులు

పెషావర్‌లో కుప్పకూలిన ప్రైవేట్‌ పాఠశాల పైకప్పు  

34 మంది చిన్నారులు,  ఒక టీచర్‌ మృతి  

20 మంది విద్యార్థులకు గాయాలు  

నాణ్యత లేని నిర్మాణమే కారణమని అధికారుల ప్రకటన  

పెషావర్‌: పాకిస్తాన్‌లోని ఖైబర్‌ పఖ్తూంఖ్వా రాజధాని పెషావర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ పాఠశాల పైకప్పు కుప్పకూలడంతో 34 మంది చిన్నారులు, ఒక టీచర్‌ విగత జీవులుగా మారిపోయారు. 20 మంది గాయపడ్డారు. విద్యార్థులతో కళకళలాడిన తరగతి గదులు ఒక్కసారిగా మృత్యుదిబ్బలుగా మారడం తీవ్ర విషాదం సృష్టించింది. పెషావర్‌ సిటీలో రద్దీగా ఉండే దిర్‌ కాలనీలో గురువారం ఈ దుర్ఘటన జరిగిందని పోలీస్‌ అధికారి మియాన్‌ సయీద్‌ తెలిపారు. అల్‌–ఖైర్‌ స్కూల్‌ పై అంతస్తులోని తరగతి గదుల్లో 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడు పైకప్పు హఠాత్తుగా కూలిపోయిందని చెప్పారు. 

ఈ విద్యా సంస్థను నిర్వహిస్తున్న ట్రస్టు యజమానిని అరెస్టు చేశామని వెల్లడించారు. మూడు అంతస్తుల ఈ భవనానం పైకప్పును అత్యంత నాసిరకంగా నిర్మించారని పేర్కొన్నారు. పెషావర్‌లోని లేడీ రీడింగ్‌ హాస్పిటల్‌కు 32 మంది పిల్లలు, ఒక టీచర్‌ మృతదేహాలను తరలించారు. రెండు మృతదేహాలను నసీరుల్లా ఖాన్‌ బాబర్‌ మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించారు. 

గాయపడిన 20 మంది పిల్లలను కూడా లేడీ రీడింగ్‌ హాస్పిటల్‌లో చేర్పించినట్లు అధికారులు చెప్పారు. వారిలో చాలామందికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్‌ చేశారని, తలకు తీవ్ర గాయాలైన ముగ్గురు పిల్లలకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో మరణించిన లేదా గాయపడిన పిల్లలందరూ 13 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారేనని తెలియజేశారు. ఈ భవనం ఇరుకైన వీధిలో ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్లు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ రక్షించినట్లు పెషావర్‌ డిప్యూటీ కమిషనర్‌ అఫాక్‌ వజీర్‌ ప్రకటించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement