ట్రంప్‌పై మాక్రాన్ ధ్వజం
సహించబోమంటూ హెచ్చరిక
పారిస్: ఫ్రాన్స్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులకు కొందరు దేశాధినేతలు ఉద్దేశపూర్వకంగా ఆజ్యం పోసేలా ప్రవర్తిస్తున్నారంటూ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును తీవ్రంగా ఖండించారు. ఆయన ‘మూర్ఖపు’వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ‘అట్లాంటిక్‌కు ఆవల ఉన్న విదేశీ నేతలు మా దేశంలోని అస్థిరతను స్వార్థ రాజకీయ ఎజెండాకు అనువుగా మలచుకోజూస్తున్నారు’అంటూ ఆక్షేపించారు.
ఫ్రాన్స్‌లో వెల్లువెత్తుతున్న ఆందోళనలకు ముస్లిం వలసదారులే ప్రధాన కారణమని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అంతేగాక, ‘పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే మీ సరిహద్దులను మూసేసుకోండి’అంటూ సలహా కూడా ఇచ్చారు! బుధవారం ఖతర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాక్రాన్ ట్రంప్ వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తూర్పారబట్టారు.
‘‘ఫ్రా న్స్‌లో, ముఖ్యంగా గత వారాంతంలో రాజధాని నగరం పారిస్‌లో జరిగిన అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసకాండ, లూటీలకు సంబంధించి కొన్ని దేశాలు పనిగట్టుకుని మరీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ విషయమై పలువురు దేశాధినేతలు చేసిన మూర్ఖపు వ్యాఖ్యలు ఏమాత్రమూ సహించరానివి!’’అంటూ ఆక్షేపించారు.
ఈ మాట లు ట్రంప్‌ను ఉద్దేశించినవా అని విలేకరులు ప్రశ్నించగా అవునంటూ విస్పష్టంగా బదులిచ్చారు. ‘‘కొందరు దేశాధినేతలు మరీ చౌకబారుగా ప్రవర్తిస్తున్నారు. (మధ్యంతర) ఎన్నికల్లో లబ్ధి కోసం ఫ్రాన్స్ అల్లర్లను ప్రచారాస్త్రంగా మలచుకోజూస్తున్నారు. ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్‌ను బాహాటంగా ఇందుకు వాడుకుంటున్నారు’’అంటూ కడిగి పారేశారు!
ఫ్రాన్స్‌లో కర్ఫ్యూ
→ నిరసనలపై ఇక ఉక్కుపాదమే!
→ మరిన్ని బలగాల మోహరింపు
→ స్థానిక సంస్థలకు ఫుల్ పవర్స్
యూరప్‌ను అల్లాడిస్తున్న ఆందోళనల జ్వాల ఫ్రాన్స్‌లో పతాక స్థాయికి చేరుతోంది. గత శని, ఆదివారాల్లో ఏకంగా 5 లక్షల మందికి పైగా జనం వీధుల్లోకి వచ్చి నిరసనలతో హోరెత్తించడం తెలిసిందే. దాంతో వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ఆదివారం నుంచే కఠిన చర్యలకు దిగుతోంది. వాటిలో భాగంగా భారీ సంఖ్యలో అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఏకంగా కర్ఫ్యూ విధించాలని కూడా బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది! ఇందులో భాగంగా రాజధాని నగరం పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం దాకా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
దక్షిణాది నగరమైన నైస్‌లో ప్రత్యేకించి యువతకు వర్తించేలా కర్ఫ్యూ నిబంధనలను అమలు చేయనున్నట్టు మేయర్ ప్రకటించారు. పరిస్థితి తీవ్రతను బట్టి కర్ఫ్యూ విధించే విచక్షణాధికారాన్ని స్థానిక సంస్థలకు కట్టబెడుతూ ఇటీవలే ప్రధాని సెబాస్టియన్ లెకొర్నూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దీనికి తోడు, నిరసనలు ముమ్మరంగా సాగుతున్న ప్రాంతాల్లో బలగాల మోహరింపును కనీవినీ రగని స్థాయిలో భారీగా పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. చట్టాలకు తూట్లు పొడిచే విధ్వంసక శక్తులు చెప్పినట్టల్లా ఆడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రధాని కుండబద్దలు కొట్టారు.


