హవుతీల దాడులతో ఎర్ర సముద్రం యుద్ధభూమిగా మారిన తరుణంలో ఎర్ర సముద్రపు దక్షిణ భాగంలో హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని ఎరిట్రియా, ఇథియోపియా లలో మరొక యుద్ధక్షేత్రం రూపుదిద్దుకుంటున్నది. ఎరిట్రియా– ఇథియోపియాలు పరస్పరం దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకొని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విషయాన్ని తీసుకొని వెళ్లటంతో మొత్తం వ్యవహారం పతాక స్థాయికి చేరుకున్నది. పైకి చూడటానికి ఇది రెండు చిన్న ఆఫ్రికన్ దేశాల దాయాదుల తగాదాలా కనపడి నప్పటికీ దీని ప్రభావం ఎర్ర సముద్రం, ఉత్తర ఆఫ్రికా తద్వారా ప్రపంచ జియో పొలిటికల్ ముఖచిత్రంపై పడటం ఖాయం.
ఇథియోపియా చుట్టూ యుద్ధ మేఘాలు
ఇథియోపియాలోని తిగ్రే ప్రాంతంలోని తిరుగుబాటుదారులకు ఎరిట్రియా మద్దతు ఇస్తున్నదని ఇథియోపియా ఆరోపణ. ఎరి ట్రియా స్వతంత్ర దేశంగా ఏర్పడటంతో ఇథియోపియాకు ఎర్ర సముద్రంలోకి ప్రవేశం లేదు. దీనితో ఇథియోపియా ‘లాండ్ లాక్డ్’ దేశంగా మారిపోయింది. ఎరిట్రియా లేదా సోమాలీ లాండ్ నుండి ఎర్ర సముద్రపు రేవు పట్టణాలను చేరుకోవటానికి ఇథియోపియా ప్రయత్నిస్తుంది. ఇదే ఇథియోపియాకు.. సోమాలియా, ఎరిట్రియా లతో వైరానికి కారణం. ఇక బ్లూనైల్ నదీజలాల విషయంలో ఈజిప్టుతో వివాదాలున్నాయి. వెరసి ఇథియోపియాకు వ్యతిరేకంగా ఎరిట్రియా, ఈజిప్టు, సోమాలియా, సూడాన్లు ఒక వేదిక మీదకు రావటానికి ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. ఇదే నిజమయితే ఎర్ర సముద్రానికి సమీపంలో మరొక యుద్ధ క్షేత్రం ఆవిర్భవించినట్లే.
ఇటలీ వలస పాలన సమయంలో 1890లో ఎరిట్రియా ఒక ప్రత్యేక ప్రాంతంగా రూపుదిద్దుకున్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటలీ ఓటమి తరువాత ఎరిట్రియా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. 1950లో ఐరాస జనరల్ అసెంబ్లీ ఇథియోపియాలో ఎరిట్రియాను ఒక స్వయంప్రతిపత్తిగల ప్రాంతంగా ఉంచాలని సూచించింది. 1952 ఒప్పందం ప్రకారం ఇథియోపియాలో భాగంగా ఉన్నప్పటికీ ఎరిట్రియాకు రక్షణ, విదేశీ వ్యవహారాలు మినహాయించి మిగిలిన అన్ని విషయాలలో స్వయంప్రతిపత్తిని కల్పించారు. కానీ ఇథియోపియా ఈ ఒప్పందాన్ని అతిక్రమించి 1962లో ఫెడరేషన్ రద్దుచేసి ఎరిట్రియాను విలీనం చేసుకున్నది. దీనితో ఎరిట్రియాలో సాయుధ తిరుగుబాటు ప్రారంభమయింది.
1991లో ఎరిట్రియా సాయుధ బలగాలు అస్మారాను తమ అధీనంలోకి తీసుకున్నాయి. 1993లో ఐరాస నిర్వహించిన రెఫరెండంలోఎరిట్రియా స్వతంత్రానికి ప్రజలు మద్దతునిచ్చారు. దీనితో 1993లో ఎరిట్రియా ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇంతటితో ఇథియో పియాకు ఎర్ర సముద్రంలోకి ప్రవేశం మూసుకుకొని పోయి లాండ్ లాక్డ్ దేశంగా మారిపోయింది. తదుపరి ఇరుదేశాల మధ్య సరి హద్దు యుద్ధాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. 2018లో ఇరు దేశాల అధ్యక్షులు శాంతి ప్రతిపాదనకు మద్దతు పలకటంతో కొంత ఆశ చిగురించింది. కానీ, ఈ ఆశ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.
అసాబ్ పోర్టు కోసం మొదలైన పోరు
చారిత్రికంగా ఇథియోపియా వాణిజ్యమంతా ఎర్ర సముద్ర తీరంలోని అసాబ్ రేవు పట్టణం గుండా జరుగుతుండేది. కాని ఎరిట్రియా స్వతంత్ర దేశంగా ఏర్పడటంతో అసాబ్ ఎరిట్రియా అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ ఇటీవల ఇథియోపియా అధ్య క్షుడు.. అసాబ్ పోర్టు ద్వారా వాణిజ్యాన్ని, దేశ మనుగడ అవసరం (నేషనల్ ఎగ్జిస్టెన్షియల్ రిక్వైర్మెంట్)గా అభివర్ణించాడు. ఇది సహజంగానే ఎరిట్రియాలో వ్యతిరేకతకు కారణమయింది. అసాబ్ పోర్టులో ఇథియోపియాను కాలుపెట్టనిస్తే క్రమంగా ఎరి ట్రియాను మళ్లీ ఇథియోపియా ఆక్రమిస్తుందని అనుమానాలు న్నాయి.
అక్టోబర్ రెండవవారం (8–10)లో ఉత్తర ఇథియోపియాలోని తిగ్రే ప్రాంతంలోనికి ఎరిట్రియా సైనికదళాలు చొచ్చు కొని వచ్చా యని ఇథియోపియా ఆరోపిస్తున్నది. ఇథియోపియన్ సైనికులే ఎరిట్రియా లోనికి చొరబడ్డారని ఎరిట్రియా ఆరోపిస్తున్నది. తిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టి.పి.ఎల్.ఎఫ్.) తిరుగుబాటు దారులు ఇథియో పియా నుండి వేరుపడటానికి సాయుధ పోరాటం కొన సాగిస్తున్నారు. విచిత్రమయిన విషయం ఏమిటంటే 2020–2022 తిగ్రే యుద్ధంలో ఎరిట్రియా సైన్యం ఇథియోపియన్ దళాలతో కలిసి తిగ్రే తిరుగుబాటు దారులను ఎదుర్కొన్నది.
కానీ, 2022 నవంబర్లో ప్రెటోరియా ఒప్పందం ద్వారా ఇథియోపియా దళాలు సంధి కుదుర్చుకున్నాయి. కానీ, ఈ ఒప్పందంలో ఎరిట్రియాను భాగ స్వామిని చేయకపోవడంతో కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు ఎరిట్రియా తిగ్రే సాయుధ తిరుగుబాటు దార్లకు మద్దతునిస్తోంది. సరిహద్దు లోని ఆదిగ్రాత్ వద్ద ఎరిట్రియా డ్రోన్లతో దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎరిట్రియా, ఇథియో పియాలు ఇరుదేశాలలో పరస్పరం తమ రాయబార కార్యాలయా లను మూసివేశాయి. సమస్య ను భద్రతామండలికి తీసుకువెళ్లాయి.
ఆఫ్రికాలో ‘న్యూ ఆలమిన్’ అలజడి
సహజంగానే తిగ్రేలో ఘర్షణలు ఇతర ప్రాంతీయ ఆఫ్రికన్ దేశాలను అప్రమత్తం చేశాయి. 2026 అక్టోబర్ 4న న్యూ ఆలమిన్ (ఈజిప్టు)లో ఈజిప్టు, సూడాన్, సోమాలియా, ఎరిట్రియా దేశాధి నేతల శిఖరాగ్ర సమావేశం జరిగింది. సమావేశపు ఉమ్మడి ప్రకటన లో సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, పరస్పర సహకారం, జోక్యం, ఎర్రసముద్ర భద్రత, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గుండా నౌకాయానం అంశాలను నేరుగా ప్రస్తావించారు. బ్లూనైల్ నదిపై ఇథియోపియా నిర్మిస్తున్న గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డామ్ను ఈజిప్టు వ్యతి రేకిస్తోంది. దీనివలన నైలునది జలాలు తగ్గిపోతాయని ఈజిప్టు ఆందోళన చెందుతోంది.
సోమాలియాలోని సోమాలీలాండ్ ప్రాంతం, తనంత తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. దీనికి యునైటెడ్ నేషన్స్ గుర్తింపులేదు. 2024లో ఇథియోపియా సోమాలీ లాండ్తో ఒప్పందం కుదుర్చుకోవటాన్ని సోమాలియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సోమాలీలాండ్ ద్వారా ఇథియోపియా సముద్రానికి ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నది. 2024 అంకారా ఒప్పందం ప్రకారం సోమాలీలాండ్లోని రేవు పట్టణాలకు ఎరిట్రియాకు వాణి జ్య ప్రవేశాన్ని కల్పించినప్పటికీ, న్యూ అలమిన్ శిఖరాగ్ర సమావేశంలో సోమాలియా పాల్గొనటం ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
గల్ఫ్దేశాలు, తుర్కియా ఎర్ర సముద్రంలో చాలా పెట్టుబడు లను పెట్టాయి. వ్యూహాత్మకంగా వారికి ఎర్ర సముద్రం కీలకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఎరిట్రియాకు బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి. అసాబ్ పోర్టును ఇదివరకు యు.ఎ.ఇ. వాడుకున్నది. సౌదీ అరేబియాకు బాబ్ అల్ మెండబ్ జలసంధి, ఎర్ర సముద్రమే కీలకం. తుర్కియే, సోమాలియాలకు ఆర్థిక, సైనిక సంబంధా లున్నాయి. అందువలన ఎరిట్రియా– ఇథియోపియా ఘర్షణల విషయంలో గల్ఫ్దేశాలు తుర్కియే నిరాసక్తంగా ఉండలేవు.
ఎరిట్రియాపై ట్రంప్ ఆంక్షల తొలగింపు?!
ఇప్పటికే హవుతీ దాడులతో ఎర్రసముద్ర రవాణాకు ముప్పు ఏర్పడింది. ఎరిట్రియా– ఇథియోపియా ఘర్షణలు నేరుగా ఎర్ర సముద్రానికి చేరకపోయినప్పటికీ, ఎర్ర సముద్రం నౌకల బీమా చార్జీలు ఇప్పటికే పెరిగాయి. మరోవైపు, హవుతీ దాడుల నేపథ్యంలో, బాబ్ అల్ మెండబ్ జలసంధిలో ఎరిట్రియా తీరం ద్వారా ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాన్ని తెరవటానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బహుశా ఇదే లక్ష్యంతో ఎరిట్రియాపై అమెరికా ఆంక్షలను తొలగిస్తున్నట్లుగా కనపడుతున్నది.ఎరిట్రియా–ఇథియోపియా ఘర్షణలు ఆఫ్రికాలో ప్రాంతీయ యుద్ధానికి దారితీయకుండా చూడాల్సిన ప్రధాన బాధ్యత ఆఫ్రికన్ యూనియన్పై ఉన్నది. దౌత్య సంభాషణలు, మానవ సహాయం నిర్ధారణ (వెరిఫికేషన్) వంటి అంశాలలో ఐక్య రాజ్యసమితి కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.
తిగ్రే ప్రాంతంలో తిరుగుబాటుదారులకు ఎరిట్రియా మద్దతు ఇస్తోందని ఇథియోపియా, తన ఆధీనంలోని ఎర్ర సముద్రపు రేవు పట్టణాలను చేరుకోవటానికి ఇథియోపియా ప్రయత్నిస్తోందని ఎరిట్రియా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు
- గురజాల శ్రీనివాసరావు


