వ్యూ పాయింట్
పాడ్‌కాస్ట్: రిధిమా పాఠక్ పాడ్‌కాస్ట్
అతిథి: తుకారాం ముండే
ఐఏఎస్, ఎఫ్.డి.ఎ. కమిషనర్, మహారాష్ట్ర
హోస్ట్: రిధిమా పాఠక్
టీవీ యాంకర్
సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే తరచూ బదిలీలు, కఠినమైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎన్ని సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. తన 21 ఏళ్ల సర్వీసులోని బదిలీల వెనుక ఉన్న నిజాలు, వ్యవస్థ పనితీరు, ప్రజాసేవలో అధికారుల బాధ్యత వంటి ఎన్నో అంశాలపై ఆయన ముచ్చటించారు.
బదిలీలు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం
నా దృష్టిలో 21 ఏళ్లలో 25 బదిలీలు అంటే కేవలం వార్తల్లో వచ్చే హెడ్‌లైన్స్ మాత్రమే కాదు, చిరునామా మారడం అంతకంటే కాదు. మన వ్యవస్థలు, సమాజం ఎలా పనిచేస్తున్నాయో తెలిపే నిజమైన డేటా అది. నేను మహారాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు గడ్చిరోలి నుండి ముంబై వరకు అందరికీ తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం అందేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ‘కట్ ప్రాక్టీస్’ (కమీషన్ల కోసం రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపడం)ను నిషేధించాను. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను సరైన కారణం లేకుండా డాక్టర్ల కుటుంబ సభ్యులు నడిపే ప్రైవేట్ క్లినిక్‌లకు పంపకూడదని ఆదేశించాను. సరిగ్గా 59వ రోజున నన్ను అక్కడి నుండి బదిలీ చేశారు.
నా చుట్టూ ఉన్నవారే నా బలం
ఒక ప్రభుత్వ అధికారి కేవలం రాజకీయ అండదండలతోనే నిలబడగలడని ప్రజలు తరచుగా అనుకుంటారు. అందుకే నా వెనుక ఎవరున్నారని నన్ను అడుగుతుంటారు. కానీ నిజం ఏమిటంటే, నా చుట్టూ ఉన్న వాతావరణమే (ఎకోసిస్టమ్) అంటే నా కుటుంబం, నా సన్నిహిత మిత్రులే నాకు అతిపెద్ద బలం. ఈరోజు నా ఇంట్లో ఏం జరుగుతుందో అని నేను అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేకుండా నా భార్య, నా సోదరులు, నా కుటుంబం మొత్తం ప్రతి విషయాన్ని ఎంతో సమర్థవంతంగా చూసుకుంటున్నారు. ఈ మద్దతుతో పాటు, నేను ఈ కుర్చీలో ఎందుకు ఉన్నాను, నేను పోషించాల్సిన పాత్ర ఏమిటి అనే విషయాలపై నాకు పూర్తి స్పష్టత ఉంది.
ఉన్నది ఉద్యోగం చేయడానికి కాదు
నేను ఎక్కడికి బదిలీ అయినా, అక్కడి నా తోటి అధికారులకు నేను మొదట చెప్పే మాట ఒక్కటే– ‘మనం ఉన్నది కేవలం ఉద్యోగం చేయటానికి కాదు. మహారాష్ట్ర వ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా ప్రజలు తాము తీసుకునే ప్రతి ఆహారం లేదా మందు తమకు హాని కలిగించకుండా ఆరోగ్యాన్ని ఇస్తుందని మనపై నమ్మకంతో ఉన్నారు. నకిలీ అయిన, నాణ్యత లేని, లేదా తప్పుడు లేబుల్ ఉన్న మందుల వల్ల తమ సొంత కుటుంబ సభ్యులే ఆసుపత్రి పాలైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి.’ మహాభారతంలో, ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఆపడానికి భీష్ముడు, ద్రోణాచార్యు లకు సభలో పూర్తి అధికారం ఉన్నా వారు మౌనంగా ఉండిపోయారు. చూస్తూ ఉండిపోయే ఆ మౌనం తాలూకు విషాదం ఇలియడ్ కావ్యంలోనూ, నేటి మన కార్యాలయాల్లోనూ ప్రతిధ్వనిస్తోంది.
అక్రమార్కుల ధైర్యానికి ఓ లెక్కుంది
చట్టాల అమలు కఠినంగా ఉన్నప్పటికీ అక్రమార్కులకు చట్టాన్ని ఉల్లంఘించేంత ధైర్యం ఎలా వస్తుందని ప్రజలు నన్ను అడుగుతుంటారు. ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు ఇద్దరూ ఇదే సమాజం నుండి వస్తారు. నిబంధనలను పాటించడానికి అయ్యే ఖర్చు కంటే, వాటిని ఉల్లంఘించడం వల్ల పడే శిక్ష లేదా జరిమానా చాలా తక్కువని వ్యాపారులు లెక్కలు వేసుకోవడం వల్లే ఆ ధైర్యం వస్తోంది. ఒక నియంత్రణ అధికారిగా, ఆ సమీకరణాన్ని తలకిందులు చేయడమే నా పని. అంటే నిబంధనలను పాటించడం కంటే, వాటిని ఉల్లంఘించడం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా మారాలి. సరిగ్గా అందుకే, ఎంతోమంది ఆహార వ్యాపార నిర్వాహకులు నాపై ఆరోపణలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
- ఎడిటోరియల్ టీమ్


