వ్యూ పాయింట్
పాడ్‌కాస్ట్: బిగ్ టెక్నాలజీ
అతిథి: సుందర్ పిచాయ్
గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో
హోస్ట్: అలెక్స్ కాంట్రోవిడ్జ్
ఇండిపెండెంట్ జర్నలిస్ట్
‘బిగ్ టెక్నాలజీ’ ఫౌండర్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ పాడ్‌కాస్ట్‌లో ఏఐ భవిష్యత్తు, దాని వెనుక ఉన్న సవాళ్ల గురించి వివరించారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌లు కనుమరుగై ‘ఏఐ ఏజెంట్లు’ మన దైనందిన జీవితంలో ఎంత సహజంగా మమేకం అవుతాయో తెలిపారు. ముఖ్యాంశాలు:
ఏఐ విప్లవం వెనుక ఏళ్ల కృషి ‘‘ఈ రోజు మన డేటా సెంటర్లు, మనం సొంతంగా తయారుచేసిన ప్రాసెసర్లు... ఇవన్నీ కూడా మనం ఏళ్ల క్రితమే చేసుకున్న ఒప్పందాల వల్ల సాధ్యమైనవే. ఏఐ కోసం వనరులను సిద్ధం చేయడం అనేది షాప్‌కి వెళ్లి రెడీమేడ్ సర్వర్లు కొనుక్కొచ్చినంత సులువు కాదు. ఒక డేటా సెంటర్ పని ప్రారంభించడానికి చాలా ముందే ఎన్నో విషయాలను ప్లాన్ చేసుకోవాలి. మెమరీ సప్లై, విద్యుత్ సౌకర్యం, భూమి సేకరణ, వేలాది విడిభాగాలు, నైపుణ్యం ఉన్న శ్రామికులు ఇలా ప్రతి ఒక్కటీ ముందే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పనులకు చాలా సమయం పడుతుంది. అందుకే, ఎవరైనా పెద్ద క్లౌడ్ కస్టమర్ (కంప్యూటింగ్ శక్తిని, డేటా స్టోరేజ్‌ని అద్దెకు తీసుకునేవారు) వచ్చి 2027 లేదా 2028 నాటికి తమకు భారీ స్థాయిలో కంప్యూటింగ్ వనరులు కావాలని అడిగితే, దాన్ని నెర వేర్చడం చాలా కష్టం.

బుడగ కాదు... బలమైన వ్యూహం
‘‘ఏఐ పరిశ్రమ పరిమితికి మించి పెట్టుబడులు పెడుతోందనీ, ఈ బుడగ పగలిపోతుందనీ అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ నేను ఈ మూలధన వ్యయాన్ని సుదూర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చూస్తున్నాను. గతంలో టెలికామ్ విప్లవం వచ్చినప్పుడు నేల కింద వేలాది మైళ్ల ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు వేశారు. అవి చాలాకాలం పాటు ఎలాంటి వాడకం లేకుండా పడి ఉన్నాయి. వాటిని ప్రజలు ‘డార్క్ ఫైబర్’ అని పిలిచేవారు. కానీ మనం ఈ రోజు నిర్మిస్తున్నది దానికి పూర్తిగా భిన్నమైనది. మనం తయారుచేసే ప్రతి సర్వర్, గ్రాఫిక్ కార్డ్, ప్రాసెసర్ వెంటనే ఉపయోగంలోకి వస్తున్నాయి. అవి మరుసటి తరం ఏఐ మోడల్స్‌ను ట్రైన్ చేయడానికి, ప్రతిరోజూ కోట్లాది మంది వినియో గదారులకు సేవలు అందించడానికి నిరంతరం పని చేస్తున్నాయి. వీటికోసం పెట్టే భారీ పెట్టుబడులు అత్యంత సహేతుకమైనవి.
అగ్రస్థానం కోసం ‘డీప్‌మైండ్’
‘‘ఒక సీఈవోగా నేను చేసే అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకటి... మన దగ్గర ఉన్న కంప్యూటింగ్ శక్తిని ఎక్కడ ఉపయోగించాలి అని తేల్చడం. మన దగ్గర ఉన్న అదనపు కంప్యూటింగ్ శక్తిని గూగుల్ క్లౌడ్ కస్టమర్లకు అమ్మేసి, తక్షణమే స్వల్పకాలిక ఆదాయాన్ని పెంచుకోవడం చాలా తేలికైన పని. కానీ, ఏఐలో సరికొత్త ఆవిష్కరణలు చేయడమే భవిష్యత్తులో మనకు అగ్రస్థానం ఇస్తుంది. అందుకే వ్యాపారం లాభాలు తగ్గినా పర్వాలేదని భావించి, ‘గూగుల్ డీప్‌మైండ్’ వంటి మన ప్రధాన పరిశోధనా బృందాలకు అత్యంత భారీ, శక్తిమంతమైన కంప్యూటింగ్ క్లస్టర్లను అంది స్తున్నాం. మన పరిశోధకులకు ఎలాంటి హద్దులు లేని సాధనాలను, వనరులను అందించినప్పుడే సరికొత్త సాంకేతిక పురోగతి సాధ్యమవుతుంది. ఆ పురోగతే మనం భవిష్యత్తులో తయారుచేసే ప్రతి ప్రొడక్ట్‌కి పునాదిగా మారుతుంది.
ఇదీ చదవండి: ప్రపంచానికి ప్రాచీన వెలుగు
ముందే ఊహించే ఏఐ ఏజెంట్లు!
‘‘గతంలో సాఫ్ట్‌వేర్ మనల్ని (మనుషులను) టెక్నాలజీకి తగినట్లుగా మార్చుకునేలా చేసింది. మనం సంక్లిష్టమైన మెనూలు, ప్రత్యేకమైన సెర్చ్ పద్ధతులు, కఠినమైన యాప్ డిజైన్‌లను నేర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఏఐ యుగంలో ఈ పద్ధతి పూర్తిగా తలకిందులు అవుతుంది. టెక్నాలజీయే మనుషుల సహజ జీవన విధానానికీ, వారి దైనందిన జీవితానికీ తగ్గట్టుగా సులభంగా మారు తుంది. ఇకపై మీరు వేర్వేరు యాప్‌లను లేదా కష్టమైన డ్యాష్‌బోర్డ్‌లను వాడాల్సిన అవసరం ఉండదు. దానికి బదులుగా, ఏఐ ఏజెంట్లు మీ వెనుక నిశ్శబ్దంగా పనిచేస్తూ, మీ అవసరాలను ముందే ఊహించి, కేవలం అవసరమైనప్పుడు మాత్రమే మీతో సహజమైన మాటల్లో లేదా టెక్స్›్ట ద్వారా మాట్లాడతాయి. ఒక గొప్ప సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అంతిమ లక్ష్యం ఏమిటంటే... మధ్యలో ఎలాంటి ఇబ్బందికరమైన ఇంటర్‌ఫేస్ అడ్డు లేకుండా పనులు జరిగిపోవడమే.
- ఎడిటోరియల్ టీమ్


