ఎవరేమి నేర్చుకోనున్నారు? | Senior Journalist Tankasala Ashok Write on Latest World Developments | Sakshi
Sakshi News home page

ఎవరేమి నేర్చుకోనున్నారు?

Nov 11 2026 6:31 PM | Updated on Nov 11 2026 6:48 PM

Senior Journalist Tankasala Ashok Write on Latest World Developments

ఫ్రాన్స్‌లో నిరసన ప్రదర్శన

అభిప్రాయం

ఇపుడు వీస్తున్న గాలులు గతంకన్న భిన్నమైనవి. అవి అందరికీ పాఠాలు చెప్తు న్నాయి. పరాజితులకు, విజేతలకు కూడా. దాన్నుంచి ఎవరేమి నేర్చుకోగలరన్న దానిపై ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇటీవలి కాలానికి వస్తే 1991లో సోవియెట్‌ పతనం నుంచి ఒక గాలి మొదలైంది. ఇక పాశ్చాత్య దేశాల ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాలకు శాశ్వతంగా ఎదురు లేదని నమ్మారు. ఎండ్‌ ఆఫ్‌ ఐడియాలజీ, ఎండ్‌ ఆఫ్‌ హిస్టరీ (ఇక భిన్న సిద్ధాంతాలనేవి ముగిసిపోయాయి, అవి ముగిసినందున చరిత్ర ఇక ఇదే విధంగా స్థిరపడిపోతుంది) అంటూ రాశారు. కానీ 2008 నాటి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల సంక్షోభంతో 17 సంవత్సరాలు తిరిగేసరికి భిన్న సిద్ధాంతాలు, చరిత్రల గాలి తిరిగి మొదలైంది. మరొక 17 ఏళ్లు గడిచి ఈ 2026 వచ్చే నాటికి ఆ కొత్త గాలులు బలం పుంజుకుంటున్నట్లు చూస్తూనే ఉన్నాము. చరిత్ర నుంచి, వర్తమానం నుంచి కూడా పరాజితులతోపాటు విజేతలు సైతం పాఠాలు నేర్చుకోకపోవటం ఇందుకు కారణమవుతున్నది.

వీళ్లంతా పరాజితులే!
హంగరీ, సెర్బియా నియంతలు పరాజితులు. అమెరికా, ఇజ్రాయెల్‌ల యుద్ధోన్మాదులు, జాతివాద మతవాద దురహంకారులు, సామ్రాజ్యవాదులు పరాజితులు. తమ సమర్థతను, స్వతంత్ర ధోరణులను, సామాజిక దృష్టిని కోల్పోయిన యూరోపియన్‌ పాలకులు పరాజితులు. జపాన్, అరబ్‌ రాజ్యాలు, లాటిన్‌ అమెరికన్‌ నియంతలు, తమ స్వీయ స్వతంత్రతలను కోల్పోయి అమెరికా శిబిరానికి బందీలైనవారు పరాజితులు. భారత పాలకుల వంటి అధికార పిపాసులు, మతతత్వవాదులు పరాజితులు. విస్తృత ప్రజానీకపు మేలుతో, ప్రజాస్వామ్యంతో నిమిత్తం లేకుండా, చరిత్రను, ఐడియా లజీని తమ అధికారం, తమ ఆర్థిక ప్రయోజనాల చుట్టూ తిప్ప జూసిన వీరంతా పరాజితులు. ఇపుడు వీస్తున్న గాలులు వీరందరినీ ఓడించాయి. కొందరిని ప్రత్యక్షంగా, కొందరిని పరోక్షంగా. ఈ సమస్త ధోరణులను ప్రతిఘటిస్తున్న వారంతా విజేతలు.

ప్రపంచం సాధారణంగా కళ్లకు ఎదురుగా, భూమి ఉపరితలంపైన జరిగే పరిణామాలకు పరిమితమై అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంది. తీర్పులు చెప్తుంది. కానీ, కళ్లకు కనిపించక భూమి అడుగు పొరలలో జరిగే పరిణామాలు, వాటి ప్రభావాలను గుర్తించదు. ఒక మేధావి సోషల్‌ ఆరిజన్స్‌ ఆఫ్‌ డిక్టేటర్‌షిప్‌ అండ్‌ డెమోక్రసీ అంటూ రాశాడు. మరొక ఇద్దరు ఎకనమిక్‌ ఆరిజిన్స్‌ ఆఫ్‌ డిక్టేటర్‌షిప్‌ అండ్‌ డెమోక్రసీ అంటూ రాశారు. ఇందులో ఆరిజిన్స్‌ అనే మాట కీలక మైనది. మన కళ్ల ఎదుట ఏమి జరిగినా జరగకపోయినా దాని మూలాలు ఎక్కడో చిన్నగా మొదలై క్రమంగా పరస్పరబద్ధత ఏర్పడి, మన పంచేంద్రియాలు గుర్తించేలోగా బద్దలు కావడమన్నమాట. అదెట్లా జరుగుతుందనే అద్భుతమైన చిత్రణ ఫ్రెంచ్‌ విప్లవం గురించి రాసిన ‘ఎ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌’ నవలలో కనిపిస్తుంది. అవన్నీ ఆరిజిన్స్‌ గురించినవే.

వదులుకోవాల్సిన ధోరణులు
1991లో సంబరపడి ఎండ్‌ ఆఫ్‌ అదీ, ఎండ్‌ ఆఫ్‌ ఇదీ అంటూ మేధో ఉత్సవాలను జరుపుకొన్నవారు, ఇక ప్రపంచాధిపత్యం శాశ్వ తంగా తమదేనని నిశ్చితాభిప్రాయానికి వచ్చినవారు, భూమి పొరల కింద ఏవేవి ఆరిజిన్‌ అవుతున్నాయో గుర్తించలేక 2008లో ఉలికిపాటుకు గురయ్యారు. అప్పటికీ గుర్తించక, అదంతా తాత్కాలికం మాత్రమేనని భ్రమపడి, అవే ఆరిజిన్స్‌ పరస్పరబద్ధమవుతూ మరొక 17 సంవత్సరాలకు ఇపుడు బద్దలవుతుండటంతో దిగ్భ్రమలకు గురవుతున్నారు. చిన్న గాలులు పెద్ద గాలులుగా మారి ఇపుడు తుఫానులవుతున్నాయి.

చేయవలసిందేమిటో, జరగవలసిందేమిటో వీరికి తెలియక కాదు. ప్రతికూలతలను ఉపేక్షించటం, అణచివేయటం ఈ ఎదురు గాలులకు పరిష్కారమనే ధోరణులను మానుకోవటం, విధానాలకు పైపై మెరుగులు దిద్దటం గాక వాటిని మౌలికంగానే మార్చుకోవటం మినహా వారికి మార్గాంతరం లేదని ఈ కొత్త గాలులు స్పష్టం చేస్తున్నాయి. సూటిగా చెప్పుకోవాలంటే, అమెరికా నాయకత్వాన గల పాశ్చాత్య కూటమి, వారి అనుయాయులంతా సామ్రాజ్య వాదాన్ని, విచ్చలవిడి పెట్టుబడిదారీ విధానాలను సైనిక బలంతో ఎవరినైనా లొందీసుకోగలమనే అహంభావాన్ని, చిన్న దేశాలను చిన్నచూపు చూసే అసంబద్ధతను వదులుకోక తప్పదు.

విజేతలకూ స్పష్టత అవసరం
ఇరాన్‌ యుద్ధం, పాలస్తీనాపై దురాక్రమణ, ఉక్రెయిన్‌ను ఎగ దోయటం, వెనిజులాలో దుర్మార్గం, ఆర్థిక విధానాల అస్తవ్యస్తత, సైనిక బలంతో ఏమైనా చేయగలమనే ప్రేలాపనల వంటివన్నీ కలిసి ఈ ఎదురుగాలులను సృష్టించటం కనిపిస్తూనే ఉంది. పాలస్తీనా స్వతంత్ర దేశం కావటం, డాలర్‌ ఆధిపత్యాన్ని వదలుకొని, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను స్వతంత్రం చేయటం, ప్రపంచవ్యాప్తంగా గల వందలాది సైనిక స్థావరాల రద్దు వంటివి జరిగితే తప్ప ఈ ప్రభావాలతో ఎదురుగాలులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీస్తూనే ఉంటాయి. చరిత్ర ఎప్పటికీ ముగిసేది కాదు, సిద్ధాంతాలు వేర్వేరు రూపాలలో ఎదురు తిరుగుతూనే ఉంటాయి. ఆరిజిన్స్‌ ఆగవు, తిరుగుబాట్లు ఆగవు. 2008, 2026 వలె భంగపాట్లు తప్పవు. భంగపాట్ల దశ నౌకాభంగంగానూ మారగలదు.

ఇదీ చ‌ద‌వండి: వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

ఈ ఆరిజిన్స్, తమకు తెలిసిన విజయాలు, తెలియని ప్రేరేపణలూ విజేతలకు చెప్పే పాఠాలు కూడా ఉంటాయి. వారు కూడా విధానాలపరంగా, కార్యాచరణలపరంగా తమ స్పష్టాస్పష్టతల నుంచి బయట పడటం అవసరం. స్పష్టతలు ఏవైనా కావచ్చు. కానీ స్పష్టతలు అవసరం. చెడుపట్ల వ్యతిరేకతలు, వీధి పోరాటాలు, విజేతల మధ్య వైరుధ్యాలు, ఉద్రేకాలే సర్వస్వం కావటం, ప్రత్యర్థిని ప్రతిఘటించటంతోనే పరిష్కారాలు జరిగిపోతాయనుకోవటం, ముందు దారి తెలియక పోవటం అనే స్థితిలోనే మిగిలిపోయే గాలులు వీచివీచి బలహీనపడి దిక్కుతోచనివవుతాయి. కనీసం తాత్కాలికంగా బంగ్లాదేశ్, నేపాల్‌ వలె. సెర్బియాలో జరుగుతున్న కొత్తతరహా ప్రయోగాలు, ఫ్రాన్స్‌ వంటి దేశాలలో వినవస్తున్న నిర్మాణాత్మకతలు గమనించవలసినవవుతున్నాయి. 

ఇండియాలో కాక్రోచ్‌ల ద్పక్పథాలు ఆశలను కల్పిస్తున్నాయి. ఆరిజిన్స్‌ అనబడే దాని ప్రభావాలు ఇటువంటి సందర్భాలలో సానుకూలంగా గమనించవచ్చు. రెండువైపుల నుంచి ఇది ఒక సుదీర్ఘమైన స్పర్థగా రూపుతీసుకోగలదా? ఈ గాలుల ప్రభావం ఆధిపత్యవాదులను ఎంతవరకు సంస్కరించగలదు? అనేవి గమనించవలసిన ప్రశ్నలవుతున్నాయి. జవాబులు ఆశావహంగా లేనపుడు ఆరిజిన్స్‌ స్థాయిలో వేగం, వేడి పెరుగుతాయి, మరింత మరింతగా.

- టంక‌శాల అశోక్‌
సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement