లక్షలాదిగా రోడ్డెక్కిన జనం ∙చెదురుమదురుగా హింస
పారిస్: ఫ్రాన్స్‌లో నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు క్రమంగా తీవ్రస్థాయికి చేరుతున్నాయి. హెచ్చు వేతనాల డిమాండ్‌తో పాటు హైసూ్కల్ నిరసనోద్యమానికి మద్దతుగా కార్మిక సంఘాల సభ్యులు గురువారం లక్షలాదిగా రోడ్డెక్కారు. రాజధాని పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. కార్మిక సంఘ జెండాలు చేబూని నినాదాలిస్తూ సాగారు. లియాన్, మార్సెలీ తదితర నగరాల్లోనూ నిరసనల తీవ్రత కొనసాగింది. పారిస్, శివార్లలో జరిగిన 180కి పైగా నిరసనల్లో 6 లక్షల మందికి పైచిలుకు పాల్గొన్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు పేర్కొన్నారు.
లియాన్, పౌ, ఆర్లీన్స్, రెన్స్ వంటిచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా చాలావరకు శాంతియుతంగానే సాగాయి. గురువారం విద్యార్థులు కూడా తాజాగా ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల టీచర్లు కూడా వాటిలో పాల్గొన్నారు. దాంతో దేశవ్యాప్తంగా కనీసం మూడో వంతుకు పైగా పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌ను కూడా మూసేశారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. పలుచోట్ల నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో పలువురికి గాయాలైనట్టు సమాచారం. దేశం క్రమంగా ఆర్థిక మాంద్యం గుప్పెట్లోకి వెళ్తోందని ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే.


