ఈ మధ్య సినీ తారలు తమ కొత్త సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి పాడ్‌కాస్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఇందులో తమ బాల్యం నాటి కష్టాలతో పాటు కెరీర్ స్టార్టింగ్‌లో పడిన ఇబ్బందులను, వ్యక్తిగత విషయాల గురించి వివరిస్తున్నారు. అయితే బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ మాత్రం పాడ్‌కాస్ట్ అంటేనే నచ్చదని..బాల్యం గురించి తలుచుకుంటనే అసహ్యం వేస్తుందని అంటున్నారు. తాజాగా ‘ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ ఫెస్టివల్’లో పాల్గొన్న మనోజ్.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
(చదవండి: ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
‘ఇకపై నేను పాడ్‌కాస్ట్‌లో పాల్గొనను. చిన్ననాటి కష్టాలను చెప్పి చెప్పి విసిగిపోయాను. ఒకనొక దశలో నా బాల్యంపై నాకే ఆసహ్యం కలిగింది. అసలు నేనెందుకు పల్లెటూరిలో పుట్టాను? అనిపిస్తుంది. నా జర్నీ అందరికీ స్పూర్తిదాయకం అంటున్నారు. కానీ నాకు అది నరకంతో సమానం. నేనేమీ ఎవరికీ జ్ఞానోదయం చేయట్లేదు. పల్లెటూరిలో కాకుండా ఢిల్లీలో పుట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలా అయితే ముంబై చేరుకోవడం ఈజీ అయ్యేది. ఊర్లో పుట్టడం వల్ల ఎన్నో బస్సులు మారుతూ ముంబై చేరుకోవాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వలేకుండా ఐదు రోజులు గడిపితే జీవితం ఏంటో తెలుస్తుంది’ అంటూ మనోజ్ బాజ్‌పాయ్ ఎమోషనల్ అయ్యారు.
ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను
మనోజ్ తాజా చిత్రం ‘గజబ్ రాత్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే . తొలుత ఈ చిత్రానికి ‘ఘూస్ ఖోర్ పండత్’ అని పేరు పెట్టారు. టైటిల్‌పై విమర్శలు వచ్చాయి. ట్రోలర్లు ఏకంగా మనోజ్ కుటుంబ సభ్యుల ఫొటోలు పెట్టి అసభ్యకరంగా కామెంట్లు చేశారు.
దీనిపై మనోజ్ మాట్లాడుతూ.. ‘నేను నటుడిని కాబట్టి నన్ను విమర్శించండి. దాన్ని భరించే ధైర్యం నాకుంది. కానీ నా వాళ్లను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం సహించను. నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను ఎవరితోనైనా పోరాడుతాను’ అని హెచ్చరించారు. గజమ్ రాత్ మూవీ విషయానికొస్తే.. ఇందులో నుష్రత్ భరుచా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్య దత్తా, కికు శర్దా, శ్రద్ధా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.


