బాల్యాన్ని మింగేస్తున్న స్క్రీన్‌! | Mobile Screen Time Effects On Children | Sakshi
Sakshi News home page

బాల్యాన్ని మింగేస్తున్న స్క్రీన్‌!

Nov 28 2026 8:28 AM | Updated on Nov 28 2026 8:28 AM

Mobile Screen Time Effects On Children

ఇన్‌ బాక్స్‌

మనం నేడు జీవిస్తున్న కాలం అద్భుతమైన సాంకేతిక విప్లవాల పరంపర. అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ప్రపంచాన్నే చుట్టిరాగల సౌలభ్యం నేడు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకొచ్చింది. ఈ సౌలభ్యం వెనుకే ముప్పూ ఉంది; పసిప్రాయంలోనే పిల్లలు మొబైల్‌ స్క్రీన్‌ లకు అలవాటుపడిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ (ఏఏపీ) మార్గదర్శకాల ప్రకారం, రెండేళ్లలోపు పిల్లలు స్క్రీన్‌ చూడటం ఆరోగ్యకరం కాదు. పిల్లల శారీరక, మానసిక, భాషా అభివృద్ధికి ప్రత్యక్ష మానవ సంబంధాలూ, ఆటపాటలూ, నిద్రా విశ్రాంతులూ చాలా ముఖ్యం.

ఒకప్పుడు పిల్లల ఆటవిడుపు అంటే తోటి పిల్లలతో కలిసి ఆడే ఆటలూ, ప్రకృతి ఒడిలో సాగే కబుర్లూ, పెద్దలు చెప్పే కథలే. కానీ నేడు, పిల్లలకు గోరుముద్దలు తినిపించడానికీ, ఏడుపు ఆపడానికీ తల్లిదండ్రులే మొబైల్‌ ఫోన్‌లను పిల్లల చేతికందిస్తున్నారు. దీనివల్ల ఆందోళన కలిగిస్తున్న మరో అంశం పిల్లల్లో భాషాభివృద్ధి మందగించడం.

రంగురంగుల స్క్రీన్‌ లను చూస్తూ గంటల తరబడి గడిపే పిల్లలకు తమ చుట్టూ ఉన్నవారితో మాట్లాడే, ప్రశ్నలడిగే, తమ భావాలను పంచు కునే అవకాశాలు సైతం తగ్గిపోతున్నాయి. ‘జమ పీడియాట్రిక్స్‌’లో పబ్లిష్‌ అయిన 2020 మెటా–విశ్లేషణలోనూ ఎక్కువ స్క్రీన్‌ చూడటానికీ పిల్లల భాషా నైపుణ్యాలకూ మధ్య ప్రతికూల సంబంధమున్నట్లు వెల్లడైంది.

మరోవైపు, కౌమార దశలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు సోషల్‌ మీడియా వలయాల్లో చిక్కుకుని సైబర్‌ బెదిరింపులకూ, ఆన్‌లైన్‌ మోసా లకూ బలవుతున్నారు. లైక్‌లూ, వ్యూస్‌ల కృత్రిమ ప్రపంచంలో తమ ఆత్మగౌరవాన్ని వెతుక్కుంటూ ఎంతోమంది తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకీ, కుంగుబాటుకూ గురవుతున్నారు. దురదృష్టవశాత్తు, లాభాపేక్షే పరమా వధిగా పనిచేసే కొన్ని టెక్నాలజీ సంస్థలు కస్టమర్లను తమ వేదికలపై ఎక్కువసేపు గడిపేలా అల్గారిథమ్‌లను రూపొందిస్తున్నాయి. ఆటోప్లే, నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు లాంటి సదుపాయాలు పిల్లల మేలు కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి.

ఈ ప్రమాదకర ధోరణికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం ప్రభుత్వ నిబంధనలొక్కటే సరిపోవు; ఇదొక సామాజిక ఉద్యమంగా మారాల్సిందే. తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపడానికి సమయాన్ని కేటాయించడంతోపాటు డిజిటల్‌ గ్యాడ్జెట్‌లకు బదులుగా పుస్తక పఠనానికీ, క్రీడలకీ, సృజ నాత్మక కార్యకలాపాలవైపుకీ వారిని మళ్లించాలి. నేడు మనం కాపాడు కోవాల్సింది కేవలం పిల్లల బాల్యాన్నే కాదు, రేపటి సమాజ ఆలోచనా శక్తినీ, సృజనాత్మకతను కూడా.
– ఎన్‌. రామకృష్ణ, బ్యాంకు ఉద్యోగి, సంగారెడ్డి

ఇదీ చదవండి: ఇది విన్నావా... షనయా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement