ఉపనిషత్సారం 'దేశభక్తి' గేయం | Tomorrow is the death anniversary of Gurajada Apparao | Sakshi
Sakshi News home page

ఉపనిషత్సారం 'దేశభక్తి' గేయం

Nov 29 2026 2:22 AM | Updated on Nov 29 2026 2:25 AM

Tomorrow is the death anniversary of Gurajada Apparao

అభిప్రాయం

‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అంటూ 1910లో గురజాడ అప్పారావు రాసిన ‘దేశభక్తి’ గేయం తెలుగు జాతికే కాక ప్రపంచానికి ఒక నైతిక ప్రణాళికలాంటిది. ఈ గేయంలో ఉపనిషత్‌ వాక్యాలు నేరుగా కనిపించవు. కానీ కొన్ని భావాలు ఉపనిషత్తులలో చెప్పిన విషయాలకి చాలా దగ్గరగా కనిపిస్తాయి. 

‘దేశమును ప్రేమించుమన్నా/ మంచి అన్నది పెంచు మన్నా/ వట్టి మాటలు కట్టిపెట్టోయ్‌/ గట్టి మేల్‌ తలపెట్ట వోయ్‌!’ గేయం ప్రారంభ చరణం చేతలకు పిలుపు. మాటలు కాదు, పని చేయమని గురజాడ చెబుతున్నాడు. కర్మకు ఇంతే ప్రాధాన్యం ఇచ్చే భావం ఈశావాస్యోపనిషత్తు మంత్రంలో కనిపిస్తుంది: ‘కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః’ ‘ఇక్కడే కర్మలు చేస్తూ వంద సంవత్సరాలు జీవించాలని కోరుకో; ఇలా చేస్తే కర్మ మనిషికి అంటదు’ అని ఇది చెబుతుంది. ఉపనిషత్తు స్వార్థం లేకుండా చేసే కర్మ మనిషినిబంధించదని చెబుతుంది. గురజాడ దాన్ని వట్టి మాటలకు బదులుగా చేయమంటాడు. రెండింటిలోనూ జీవితానికికేంద్రం పని. గురజాడ కూడా ఆ పనిని ఈ లోకంలోనే, దేశం కోసం చేయమంటాడు.

‘పాడిపంటలు పొంగిపొర్లే/ దారిలో నువు పాటుపడ వోయ్‌/ తిండి కలిగితె కండ కలదోయ్‌/ కండ కలవాడేను మనిషోయ్‌!’ ఛాందోగ్యోపనిషత్తులో బలం విజ్ఞానం కంటే గొప్పదని, అన్నం బలం కంటే గొప్పదని ఉంది (7.8.1).
‘కండ కలవాడేను మనిషోయ్‌’ అనే పంక్తి ‘స యదా బలీ భవత్యథోత్థాతా భవతి’ (బలవంతుడైనప్పుడే లేచి నిలబడ తాడు) అనే భావానికి దగ్గరగా కనిపిస్తుంది. తైత్తిరీయోపని షత్తు భృగువల్లి ‘అన్నం బహు కుర్వీత’ (అన్నాన్ని సమృద్ధిగా సమకూర్చుకోవాలి) అని వ్రతంగా ప్రకటిస్తుంది. ‘అన్నం బహు కుర్వీత’ అనే వ్రతానికీ, ‘పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటుపడవోయ్‌’ అనే పిలుపుకీ దిశ ఒకటే.
రెండూ ఆహార సమృద్ధిని ఒక కర్తవ్యంగా చూస్తాయి.

‘ఈసురోమని మనుషులుంటే/ దేశ మేగతి బాగుపడు నోయ్‌/ డబ్బు తేలేనట్టి నరులకు/ కీర్తి సంపద లబ్బవోయ్‌!’ నీరసించి, నిస్సత్తువగా ఉండే మనుషులతో దేశం బాగుపడ దని గురజాడ అంటాడు. ముండకోపనిషత్తు కూడా ‘నాయ మాత్మా బలహీనేన లభ్యః’ అని బలహీనతను నిరసిస్తుంది. అలాగే సంపాదించలేనివారికి కీర్తి దక్కదని గురజాడ నిర్మొహ మాటంగా చెబుతాడు. తైత్తిరీయోపనిషత్తు స్నాతకోప దేశంలో ‘భూత్యై న ప్రమదితవ్యమ్‌’ (ఐశ్వర్యం సంపాదించడంలో అలక్ష్యం వద్దు) అని గురువు బోధిస్తాడు. గురజాడ మాట ఇదే దిశలో ఉంది; సంపద ఒక బాధ్యత.

‘మందగించక ముందు అడుగేయ్‌/ వెనుక పడితే వెనకేనోయ్‌/ పూను స్పర్థను విద్యలందే/... వ్యర్థ కలహం
పెంచబోకోయ్‌/ కత్తి వైరం కాల్చవోయ్‌!’ ‘మందగించక ముందు అడుగేయ్‌’ అనే పిలుపు వింటే కఠోపనిషత్తులోని ప్రసిద్ధ మేలు కొలుపు ‘ఉత్తిష్ఠత జాగ్రత’ (1.3.14) గుర్తుకు వస్తుంది. రెండూ జడత్వాన్ని వదిలి కదలమని పిలుస్తాయి. గురజాడ స్పర్థను నిర్మాణాత్మక రంగాలకు మళ్లించమంటాడు. తైత్తిరీయోప నిషత్తు శాంతిపాఠం ‘ఓం సహ నావవతు... మా విద్విషావహై’ అని ప్రార్థిస్తుంది. ‘మా విద్విషావహై’ అనే భావమే ‘వ్యర్థ కలహం పెంచబోకోయ్‌’ పంక్తిలో ఉంది.

‘ఓర్వలేమి పిశాచి దేశం/ మూలుగులు పీల్చేసె నోయ్‌/ ఒరుల మేలుకు సంతసిస్తూ/ ఐకమత్యం నేర్చవోయ్‌’ దేశభక్తి గేయానికి గుండెకాయ ఐకమత్యం. గురజాడ ఓర్వలేమిని ఒక పిశాచిగా చిత్రిస్తాడు. ఇతరుల మేలును తన మేలుగా భావించే వాడికి మేలు కొల్లలు. ఈశావాస్యోపనిషత్తు ‘తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యస్విద్ధనమ్‌’ (త్యాగంతో అనుభవించు) అని చెబుతుంది. ‘ఒకరి మేల్‌ తన మేలనెంచే’ అనే భావం ఈశావాస్యంలోని ‘యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి’కి దగ్గర (అన్ని ప్రాణుల్లోనూ తనను చూడడం).

తన లాభంలో కొంత వదులుకుని పొరుగువాడికి సాయం చేయమని గురజాడ చెబుతాడు. దానం ఎలా ఉండాలో తైత్తిరీయోపనిషత్తు స్నాతకోపదేశం ‘శ్రద్ధయా దేయమ్‌’ అని చెబుతుంది. దేశస్థులంతా కలిసి నడవాలని గురజాడ కోరుకుంటాడు. ఋగ్వేదం సంజ్ఞాన సూక్తం ‘సం గచ్ఛధ్వం సంవ దధ్వం’ అనీ, ‘సమానమస్తు వో మనః’ అనీ ఐక్యతను బోధిస్తుంది. ఋగ్వేదం ‘ఏకం సద్విప్రా బహుధా వదంతి’ అన్నట్లే, మతాలు వేరైనా మనసులు ఒకటైతే ఐక్యత సాధ్యమని గురజాడ చెబుతాడు.

గురజాడ ‘దేశభక్తి’ గేయంలో ఉపనిషత్తుల ఛాయలు భావ స్థాయిలో స్పష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు. అన్నం, బలం, సంపద, త్యాగం, కర్మ, దానం, ద్వేషరాహిత్యం, ఐకమత్యం వంటి విషయాల్లో గేయంలోని నీతి ముఖ్యంగా ఛాందోగ్యం, తైత్తిరీయం, ఈశావాస్యాలతో గమనించదగినంతగా సరిపోలు తుంది. ఉపనిషత్‌ సారాన్ని గురజాడ మానవ నడవడిని తీర్చి దిద్దే సూత్రాలుగా దేశభక్తి గేయంలో పొందుపరిచాడు. దేశభక్తి గేయం గురజాడ గాఢమైన తాత్త్విక చింతనకు తార్కాణం.


-వ్యాసకర్త కేన్సర్‌ ఔషధాల రూపకల్పన శాస్త్రవేత్త, అమెరికా (రేపు గురజాడ అప్పారావు వర్ధంతి)
-డా‘‘ కొవ్వలి గోపాలకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement