ప్రధానీ.. దిగిపో! | Albania protests continue for demanding Prime Minister resignation | Sakshi
Sakshi News home page

ప్రధానీ.. దిగిపో!

Oct 22 2026 6:06 AM | Updated on Oct 22 2026 6:06 AM

Albania protests continue for demanding Prime Minister resignation

అల్బేనియాలో నిరసనల వెల్లువ 

పోలీసులపైకి రాళ్లు, బాణసంచా 

నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌ 

కుయుక్తులను సాగనివ్వం: రామా 

తిరానా (అల్బేనియా): యూరోపియన్‌ దేశమైన అల్బేనియాలో ఆందోళనలు నానాటికీ మిన్నంటుతున్నాయి. వయోజనులు మొదలు యువత, విద్యార్థుల దాకా అన్ని వర్గాల వారూ డిమాండ్ల సాధనకు భారీ సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంలో ప్రధాని ఎడీ రామా ఘోరంగా విఫలమయ్యారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. బుధవారం 8వ రోజు జనాగ్రహ జ్వాలలు మిన్నంటాయి. 

ప్రధాని తక్షణ రాజీనామా డిమాండ్‌ చేస్తూ కొద్ది రోజులుగా సాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంతో క్రమంగా నిరసనకారులు కూడా గొంతు కలుపుతూ ఊరూవాడా హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ప్రదర్శనలు సంబంధిత హింసాకాండతో బుధవారం దేశ రాజధాని తిరానా అట్టుడికిపోయింది. పోలీసులపైకి ఫీజుల తగ్గింపు డిమాండ్‌తో స్కూలు మొదలుకుని యూనివర్సిటీ స్థాయి దాకా విద్యార్థులు కూడా పెద్దపెట్టున నిరసనలకు దిగి గళం కలిపారు. 

ఇతర నిరసనకారులతో కలిసి పోలీసులపైకి రాళ్లు రువ్వడమే గాక బాణసంచా తదితరాలు కూడా ప్రయోగించారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్, వాటర్‌ క్యానన్లతో పాటు లాఠీలకు కూడా పని చెప్పాల్సి వచ్చింది. నిరసనకారుల హింసాకాండను ప్రధాని రామా తీవ్రంగా ఆక్షేపించారు. ఇవన్నీ కొన్ని స్వార్థపర శక్తుల సారథ్యంలో సాగుతున్న కృత్రిమ ఆందోళనలేనంటూ దుయ్యబట్టారు. హింస ద్వారా సర్కారును గద్దె దింపాలన్న కుయుక్తులను సాగనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నగరంలో భయోత్పాత వాతావరణం సృష్టించడం క్షమించరాని విషయమన్నారు. 

‘ఫ్లెమింగో’తో మొదలై... 
చుక్కలనంటున్న చమురు, నిత్యావసరాల ధరలను తాళలేక యూరప్‌వ్యాప్తంగా పలు దేశాల్లో కొద్ది రోజులుగా నిరసన జ్వాలలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. వాటిలో అల్బేనియా ముందు వరుసలో ఉంది. దేశ దక్షిణ తీరంలో భారీ స్థాయిలో తలపెట్టిన విలాసవంతమైన టూరిజం డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కొద్ది నెలల క్రితం మొదలైన ఫ్లెమింగో ఉద్యమం కూడా నానాటికీ పరాకాష్టకు చేరుతూ రామా సర్కారులో గుబులు రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జరేద్‌ కుష్నర్‌ తాలూకు సంస్థదేనంటూ వస్తున్న వార్తలు అల్బేనియావాసుల్లో ఆగ్రహావేశాలను మరింతగా పెంచుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement