డీగ్: రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బడేస్రా గ్రామంలో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో 13 ఏళ్ల కవల పిల్లలను సొంత తల్లే ప్రియుడితో కలిసి పొట్టనపెట్టుకున్న దారుణ ఘటన వెలుగు చూసింది. వినయ్ చౌదరి, విష్ణు చౌదరి అనే 13 ఏళ్ల కవల సోదరులు హత్యకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన నిరంజన్ సింగ్‌తో ప్రీతికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి నలుగురు పిల్లలు (18 ఏళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు, 13 ఏళ్ల కవలలు) జన్మించారు. కొన్నేళ్ల క్రితం భర్త మరణించడంతో ప్రీతి తన పిల్లలతో కలిసి పుట్టింటి గ్రామమైన బడేస్రాకు వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రీతి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధాన్ని 13 ఏళ్ల కవల పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించగా, 16 ఏళ్ల పెద్ద కుమారుడు మాత్రం తల్లికి మద్దతుగా నిలిచాడు.
తమ ప్రేమకు కవల పిల్లలు అడ్డుగా మారుతున్నారని భావించిన ప్రీతి, వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే తన ప్రియుడిని ఇంటికి పిలిపించి, ప్రియుడు, ఆమె 16 ఏళ్ల పెద్ద కుమారుడితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నింది. వారిద్దరి చేత కవల పిల్లల గొంతులు కోయించి దారుణంగా హత్య చేయించింది. మృతుల శరీరాలపై కత్తిపోట్ల గుర్తులు ఉన్నాయి.
మంగళవారం తెల్లవారుజామున బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకీ రాకపోవడంతో వారి మేనత్త గాలించగా, ఇంటి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీగ్ జిల్లా ఎస్పీ కాంబ్లే శరణ్ గోపీనాథ్ వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈ కేసులో కవల పిల్లల తల్లి ప్రీతితో పాటు ఆమె ప్రియుడిని, 16 ఏళ్ల పెద్ద కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: నిరాధార ఆరోపణలపై ఐరాసలో గళమెత్తిన భారత్!


