ఓహియో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓహియోలోని చిల్లికోథేలో జరిగిన ర్యాలీలో నిరసనకారుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా దివంగత లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై ప్రస్తావన రావడంతో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎప్‌స్టీన్‌ను తానే గతంలో తన పామ్ బీచ్ క్లబ్ నుంచి బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. నిరసనకారులను వామపక్ష తీవ్రవాద రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు.
చిల్లికోథేలోని షూమేకర్ సెంటర్‌లో బుధవారం జరిగిన కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ నిరసనకారుడిని అక్కడి నుంచి బయటకు పంపించారు. అనంతరం ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఆ వ్యక్తి తీవ్ర వామపక్ష రాజకీయ వ్యూహాలను అనుసరిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అతను ఎప్‌స్టీన్ పేరును ప్రస్తావించాడని పేర్కొంటూ తన గత చర్యలను సమర్థించుకున్నారు.
‘నేను జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను మార్ ఎ లాగో నుంచి బయటకు గెంటేశాను. నేను చేసిన గొప్ప పని అది’ అని ట్రంప్ అన్నారు. ఎప్‌స్టీన్ డెమోక్రాట్ అని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో తనకు పూర్తిగా క్లీన్‌చిట్ లభించిందని కూడా వ్యాఖ్యానించారు. నిరసనకారులకు డబ్బులు చెల్లిస్తున్నారని, వారంతా వృత్తిపరమైన నిరసనకారులని ఆరోపించారు.
ట్రంప్ ర్యాలీల్లో ఇటీవలి వారాల్లో నిరసనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిల్లికోథేలో జరిగిన కార్యక్రమం చిన్న వేదికపై నిర్వహించడంతో నిరసనకారుల అడ్డంకులు స్పష్టంగా కనిపించాయి. సాధారణంగా తన సభల్లో నిరసనకారులపై ట్రంప్ హాస్యంగా స్పందిస్తుంటారు. అయితే ఈసారి ఎప్‌స్టీన్ ప్రస్తావన రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఒబామా ప్రచారం చేయడం మంచిదే
మరోవైపు, అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డెమోక్రాట్ల తరఫున ప్రచారం చేయడంపై ట్రంప్ స్పందించారు. ఒబామా ప్రచారం తనకు ఆందోళన కలిగించడం లేదని, అది మంచిదేనని వ్యాఖ్యానించారు. గతంలో హిల్లరీ క్లింటన్, కమలా హారిస్‌లకు ఒబామా మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ వారు ఓడిపోయారని ట్రంప్ పేర్కొన్నారు.
ఒహియోలోని చిల్లికోథేలో మాట్లాడుతూ.. ఒబామా గతంలో హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా ప్రచారం చేశారని, ఆ తర్వాత కమలా హారిస్‌కు మద్దతు తెలిపారని ట్రంప్ గుర్తుచేశారు. అయితే ఆ ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్యానించారు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఒబామా ప్రచారంలో పాల్గొననున్నట్లు తనకు సమాచారం అందిందని, దానిపై తాను సానుకూలంగానే స్పందించానని తెలిపారు.
ఇదీ చదవండి: మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి షాక్!


