వాషింగ్టన్: అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఒహియో గవర్నర్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అమీ ఆక్టన్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రస్తుత గవర్నర్ మైక్ డివైన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై ఆసక్తి పెరిగింది. ఈ పోరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రభావానికి, రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యానికి, డెమోక్రాట్ల పునరాగమన అవకాశాలకు పరీక్షగా మారింది.
ఒహియో గవర్నర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనల ఖర్చులు, ఖర్చు చేస్తామన్న హామీలు అక్టోబర్ చివరి నాటికి సుమారు 248.2 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ఖరీదైన గవర్నర్ ఎన్నికగా నిలిచే అవకాశముంది. ఇందులో వివేక్ రామస్వామికి అనుకూలంగా సుమారు 204.2 మిలియన్ డాలర్లు, అమీ ఆక్టన్‌కు మద్దతుగా దాదాపు 44 మిలియన్ డాలర్ల ప్రకటనల వ్యయం నమోదైనట్లు ఎన్బీసీ4, అడ్ఇంపాక్ట్ పొలిటిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో విడుదలైన కొన్ని సర్వేల్లో ఆక్టన్ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, మరికొన్ని సర్వేలు రామస్వామికి అనుకూలంగా ఉన్నాయి.
2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీ సమయంలో వివేక్ రామస్వామి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వ్యాపారవేత్తగా ఆయనకున్న అనుభవం, సంప్రదాయవాద విధానాలు, ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు రిపబ్లికన్ వర్గాల్లో ఆయనకు మద్దతును పెంచాయి. ప్రభుత్వ సంస్కరణలు, నియంత్రణల తగ్గింపు, సంప్రదాయవాద విధానాల అమలు వంటి అంశాలను ఆయన ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. వైద్యురాలైన అమీ ఆక్టన్ గతంలో ఒహియో ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు.
ఇదీ చదవండి: ట్రంప్‌తో కలిసి రంగంలోకి దిగుతా: నెతన్యాహు


