ఎన్నికలపై ‘జామియా’ హామీ.. స్పష్టత కోసం విద్యార్థుల పట్టు! | Jamia Promises Union Polls After Constitution Nod Students Refuse To Call Off Protest | Sakshi
Sakshi News home page

ఎన్నికలపై ‘జామియా’ హామీ.. స్పష్టత కోసం విద్యార్థుల పట్టు!

Oct 26 2026 12:51 PM | Updated on Oct 26 2026 1:04 PM

Jamia Promises Union Polls After Constitution Nod Students Refuse To Call Off Protest

న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, స్పష్టమైన హామీలు లేవంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తేదీని ప్రకటించాలని, తమ డిమాండ్లపై లిఖితపూర్వక హామీలు ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు.

విద్యార్థి సంఘాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జామియా విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎండీ మెహతాబ్ ఆలం రిజ్వీ క్యాంపస్‌కు చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. అనంతరం అక్టోబర్ 26 తేదీతో జారీ చేసిన అధికారిక ఉత్తర్వులను విద్యార్థులకు అందజేసి, ఆందోళన విరమించాలని కోరినట్లు జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్ఏ) వెల్లడించింది.

విద్యార్థి సంఘం రాజ్యాంగానికి ఆమోదం లభించిన 15 రోజుల తర్వాత జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, రాజ్యాంగానికి ఎప్పటిలోగా ఆమోదం తెలుపుతారనే విషయంపై స్పష్టత లేదని విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు నిర్దిష్ట గడువు ప్రకటించకుండా కేవలం హామీలు ఇవ్వడం తమ డిమాండ్ల పరిష్కారం కాదని వారు స్పష్టం చేశారు.

ఆందోళన సందర్భంగా విద్యార్థులపై జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు, వివరణ కోరుతూ ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అలాగే, నిరసనల సమయంలో విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయాలతో కొన్ని సమస్యలకు పరిష్కారం లభించినప్పటికీ, తమ ప్రధాన డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు పోరాటాన్ని విరమించబోమని విద్యార్థులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Delhi: పార్లమెంట్‌ సమీపంలో అగ్నిప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement