అర్ధరాత్రి వాంగ్‌చుక్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు! | Sonam Wangchuk Removed from Protest Site | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి వాంగ్‌చుక్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు!

Nov 12 2026 8:47 AM | Updated on Nov 12 2026 8:52 AM

Sonam Wangchuk Removed from Protest Site

లడఖ్‌: లడఖ్‌లో ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బుధవారం అర్ధరాత్రి నిరసన స్థలం నుంచి తొలగించి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లోనే ఉండాలని సూచించారు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌ఏహెచ్‌డీసీ) ఎన్నికల నిర్వహణపై వాంగ్‌చుక్‌తో పాటు స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో రాజకీయ నిరసనలు, ధర్నాలు, ర్యాలీలపై అధికారులు నిషేధం విధించారు.

డిసెంబర్ 4న హిల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని వాంగ్‌చుక్, లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ) నేతలు వ్యతిరేకిస్తున్నారు. లడఖ్‌లో ప్రస్తుతం తీవ్రమైన చలి నెలకొన్నదని, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే లడఖ్ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని, విద్యార్థులు కూడా వివిధ నగరాల్లో చదువుకుంటున్నారని పేర్కొంటున్నారు.

పోలీసుల చర్యపై గురువారం తెల్లవారుజామున అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో లడఖ్ ప్రధాన ఎన్నికల అధికారి, లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ నిషేధాజ్ఞలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా శాంతికి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే వాంగ్‌చుక్‌ను నిరసన స్థలం నుంచి తొలగించి ఇంటికి పంపినట్లు వెల్లడించారు. నిషేధాజ్ఞలను ప్రజలంతా పాటించాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, ఎన్నికల నిర్వహణపై వాంగ్‌చుక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో లడఖ్‌లో మంచు కురిసే అవకాశాలున్నాయని, తీవ్రమైన చలిలో ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలని లడఖ్ నాయకులు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.

లేహ్, కార్గిల్ మున్సిపాలిటీలు, పంచాయతీలకు నవంబర్ 21న పోలింగ్ జరగనుంది. ఇక లడఖ్ స్వయంప్రతిపత్తి హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్లకు డిసెంబర్ 4న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో నిరసనలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, స్వేచ్ఛాయుత ఎన్నికలకు ఆటంకం కలగవచ్చని పరిపాలన వర్గాలు చెబుతున్నాయి. దీంతో లడఖ్‌లో ఎన్నికల నిర్వహణపై వివాదం మరింత ముదురుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement