జెరూసలేం: ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ కనిపించకపోయినప్పటికీ.. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇరాన్ ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఇది చారిత్రక అవకాశమని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ప్రకటించారు.
ఎన్నికల అనంతరం జెరూసలెంలోని లికుడ్ పార్టీ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో మద్దతుదారులను ఉద్దేశించి నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్‌కు బలమైన, జాతీయవాద ప్రభుత్వమే అవసరమని స్పష్టం చేశారు. అరబ్ పార్టీల మద్దతుపై ఆధారపడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దేశ భద్రతకు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కొన్ని అరబ్ పార్టీలు హమాస్‌కు మద్దతు ఇస్తున్నాయని, ఇజ్రాయెల్ సైనికులను యుద్ధ నేరగాళ్లుగా అభివర్ణిస్తున్నాయని ఆరోపించారు. అందువల్ల అలాంటి పార్టీలపై ఆధారపడకూడదని పేర్కొన్నారు.
మరోవైపు, ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మాత్రం హోరాహోరీ పోటీని సూచిస్తున్నాయి. పోల్స్టర్ డైరెక్ట్ పోల్స్ అంచనాల ప్రకారం.. నెతన్యాహు కూటమికి 55 స్థానాలు, గడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 49 స్థానాలు, అరబ్ పార్టీలకు 16 స్థానాలు లభించే అవకాశముంది. దీంతో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ దక్కనట్లుగా కనిపిస్తోంది. అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో రాత్రి 10 గంటల సమయానికి 77.7 శాతం పోలింగ్ నమోదైంది. హమాస్ నేతృత్వంలో 2023 అక్టోబర్ 7న గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఇరాన్‌తో యుద్ధ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలకంగా మారాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య నెతన్యాహు తదుపరి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: Israel: హంగ్ దిశగా ‘ఫలితాలు’.. నెతన్యాహుకు షాక్!


