నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
వీరిలో 19 మంది పరిస్థితి విషమం
ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందన్న అధికారులు
అల్బెర్టా: కెనడాలోని ఆల్బెర్టాలో ఉన్న సైనిక స్థావరంలో శనివారం అనూహ్యంగా మంటలు చెలరేగి నలుగురు సైనికులు చనిపోగా 39 మంది గాయపడ్డారు. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వైన్‌రైట్‌లోని కెనడియన్ ఫోర్సెస్ బేస్ (సీఎఫ్‌బీ)లో సాయంత్రం 4 గంటల సమయంలో వేగంగా చుట్టుముట్టిన మంటలు లైవ్ ఫైర్ యుద్ధ తంత్ర శిక్షణలో పాల్గొంటున్న సైనికులను కబళించి వేశాయి.
వీరిలో కొందరు కోలుకునేందుకు వారాలు, నెలలు కూడా పట్టొచ్చని అధికారులు చెప్పారు. మిలటరీ బేస్‌కు కిలోమీటర్ దూరంలో గడ్డికి మంటలు అంటుకున్న విషయం తమకు ముందుగానే తెలుసునని మేజర్ జనరల్ వేడ్ రుట్లాండ్ చెప్పారు. అయితే, ఆ మంటలను తేలిగ్గా అదుపు చేయవచ్చనే అంచనాతో యుద్ధ శిక్షణను కొనసాగించామన్నారు. అనూహ్యంగా అత్యంత వేగంతో వీచిన గాలులతో మంటలు కన్నుమూసి తెరిచే లోగా శిక్షణ జరుగుతున్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, అనుకోని ఈ ఘటనలో సైనికులు చిక్కుబడిపోయారని అన్నారు.
అగ్ని కీలలు కేవలం 36 సెకన్లలోనే కిలోమీటర్ దూరం ప్రయాణించడం తామెవరం ఊహించని పరిణామమని రుట్లాండ్ వివరించారు. ఘటనకు నిమిషం ముందు కూడా మంటల వ్యాప్తిపై తమ కమాండర్ నుంచి వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. ప్రమాద ఘటన సమయంలో అక్కడ 84 మంది సైనికులు ఉన్నారు. వీరంతా ప్రిన్సెస్ పాట్రిసియా కెనడియన్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెదిన 3వ బెటాలియన్ చార్లీ కంపెనీకి చెందిన వారు. వీరిని త్వరలోనే లాట్వియాలో మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’అని రుట్లాండ్ చెప్పారు.
స్థానిక వైన్‌రైట్ పట్టణంలో చిన్న ఆస్పత్రి మాత్రమే ఉండటంతో బాధితులను 22 అంబులెన్సులు, ఆరు విమానాలు, రెండు హెలికాప్టర్లలో ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. శనివారం రాత్రి పలు ఆస్పత్రుల్లో కోడ్ ఆరెంజ్ ఎమర్జెన్సీ పరిస్థితిని అమలు చేసినట్లు తెలిపారు. మంటల వ్యాప్తికి గల కారణాలను అంచనా వేయలేకపోతున్నామని చెప్పారు. దీని వెనుక ఉగ్ర కోణం ఉన్నట్లుగా భావించడం లేదని స్పష్టం చేశారు. ఆల్బెరా్టలో సాధారణంగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వీచే గాలులు శనివారం సాయంత్రం వంద కిలోమీటర్ల వేగంతో వీచాయని, తీవ్రతకు చెట్లు నేల కూలాయని అధికారులు చెప్పారు. వైన్‌రైట్‌లోని కెనడియన్ ఫోర్సెస్ బేస్(సీఎఫ్‌బీ) దేశంలోని అత్యంత రద్దీగా ఉండే సైనిక శిక్షణ కేంద్రం. సుమారు 609 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ బేస్‌లో 25 ఆయుధ రేంజ్‌లున్నాయి.


