సైనిక కేంద్రంపై హౌతీల దాడి | Houthi attack on Yemen army camp kills 53 Yemeni soldiers | Sakshi
Sakshi News home page

సైనిక కేంద్రంపై హౌతీల దాడి 

Oct 20 2026 6:00 AM | Updated on Oct 20 2026 6:00 AM

Houthi attack on Yemen army camp kills 53 Yemeni soldiers

53 మంది మృతి, మరో 200 మందికి గాయాలు 

యెమెన్‌లోని షాబ్వా ప్రావిన్స్‌లో ఘటన

కైరో: ఇరాన్‌ దన్ను కలిగిన యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ప్రభుత్వ సైనిక శిబిరంపై విరుచుకుపడి, కనీసం 53 మంది సైనికులను చంపేశారు. ఇటీవలి కాలంలో హౌతీలు, ప్రభుత్వ బలగాలకు మధ్య మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని పరిశీలకులు అంటున్నారు. షాబ్వా ప్రావిన్స్‌లోని అల్‌–అలమ్‌ మిలటరీ క్యాంపుపైకి రెబెల్స్‌ మూడు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించారని యెమెన్‌ మిలటరీ అధికారులు చెప్పారు. 

శిక్షణలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడుల్లో 53 మంది జవాన్లు చనిపోగా, మరో 200 మంది వరకు గాయపడ్డారన్నారు. బాధితులందరూ ఇటీవల ఆర్మీలో చేరిన వారేనని అధికార ప్రెసిడెన్షియల్‌ లీడర్‌షిప్‌ కౌన్సిల్‌ అధిపతి రషద్‌ అల్‌ అలిమి చెప్పారు. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మాత్రమే విడుదల చేస్తున్నామని బాధితుల సంఖ్య మరింతగా పెరగొచ్చని ఆయన అన్నారు. 

కాగా, తమ దాడిలో డజన్ల కొద్దీ మరణించడం, గాయపడటం జరిగిందని హౌతీల సబా న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు. ప్రావిన్స్‌ రాజధాని అటఖ్‌కు దక్షిణంగా జర్దాన్‌ జిల్లాలో ఈ మిలటరీ క్యాంపు ఉంది. గతంలో దీనిని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అండదండలున్న మిలిటెంట్లు వాడుకున్నారు. 

ప్రభుత్వ అ«దీనంలోని మరిబ్‌ ప్రావిన్స్‌కు, ప్రభుత్వ బలగాల రవాణాకు కీలకమైన రహదారిలో ఈ క్యాంపు ఉంది. ఈ ప్రాంతం భద్రత కోసం ఇటీవల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాపిడ్‌ ఇంటర్వెన్షన్‌ ఫోర్స్‌ కోసం మిలటరీ క్యాంపులో శిక్షణలో ఉండగా దాడి జరిగిందని అధికారులు చెప్పారు. గగనతల రక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను త్వరితగతిన సమకూర్చాలని యెమెన్‌ అధ్యక్షుడిని, సౌదీ నేతృత్వంలోని కూటమిని షాబ్వా ప్రొవెన్షియల్‌ ప్రభుత్వం కోరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement