డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ పండుకి మంచి గిరాకీ ఉంది. చాలామంది రైతులు ఈ పంటను వేసేందుకే మొగ్గు చూపుతున్నారు, పైగా లాభలు గడిస్తున్నారు కూడా. అయితే ఈ చదువుకున్న రైతు మాత్రం పంటనే వ్యాపారంగా మార్చుకుని ఏకంగా కోట్లలో ఆదాయం ఆర్జించి స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే మహారాష్ట్రకు చెందిన మహేష్ అసబే. అతడు రైతు కుటుంబానికి చెందినవాడు. ఆ నేపథ్యంలోనే అగ్రీకల్చర్ ఇంజనీరింగ్‌లో బిటెక్ పూర్తిచేసి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. అతడి కుటుంబం సంప్రదాయ పంటలనే పండించేది. 2013-14 ఆ సమయంలో మహేష్ తండ్రి డ్రాగన్ ఫ్రూట్ సాగును గురించి తెలుసుకుని అది సాగు చేసేందుకు రెడి అయ్యాడు.
దీనికి తక్కువ నీరు, పొడి ప్రాంతాలు అనువైనవని తెలుసుకుని డ్రాగన్‌ఫ్రూట్‌ని సాగు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా సుమారు 9 వేల మొక్కలను తెప్పిచుకుంది మహేష్ కుటుంబం. అందుకోసం ప్రారంభ పెట్టుబడి సుమారు రూ. 9.9 లక్షలు ఖర్చు అయ్యింది. అలా డ్రాగన్ ఫ్రూట్‌ని పండించిన తొలి రైతు కుటుంబాలలో ఒకటిగా మహేష్ ఫ్యామిలీ నిలిచింది 2015-16 టైంలో తొలి డ్రాగన్ పంటను కోయగా, మూడు ఎకరాల పొలానికి సుమారు ఐదు టన్నుల దిగుబడి రావడం విశేషం.
ఆ పంటను విక్రయించడం ద్వారా సుమారు రూ. 5 లక్షలు దాక సంపాదించారు. అప్పుడు కిలో రూ. 33 అమ్మకం ధర. అది కాస్తా 2017 నాటికల్లా కిలోకు సుమారు రూ. 150 నుంచి రూ. 250 వరకు విక్రయించడం మొదలైంది. ఆ టైంలోనే మహేష్ తన చదువులో భాగంగా 45 రోజుల శిక్షణ కార్యక్రమం కోసం ఇజ్రాయల్ వెళ్లాడు. అక్కడ నీటి నిర్వహణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంట ఉత్పత్తిని పెంచేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై తర్ఫీదు తీసుకున్నాడు.
అంతేగాదు డ్రాగన్ ఫ్రూట్ సాగు పద్ధతులను అధ్యయనం చేసేందుకు 2018లో వియత్నాం కూడా వెళ్లొచ్చాడు. అలా తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ..ఒక్కో ఎకరం విస్తీర్ణంలో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత బిందు సేద్యం, చెరువుల ద్వారా సాగు క్షేత్రాలను ఏర్పాటు చేశాడు. కలుపు తీయడడం, వంటి కార్యకలాపాలను యంత్రాల సాయం తీసుకుని ఆ డ్రాగన్ పంటను కాస్తా మహేష్ రుక్మిణి ఫార్మ్స్ పేరుతో వ్యాపారంగా మార్చాడు.
అలా దానిమ్మ, సీతాఫలం, జామపండ్లు వంటి ఇతర పండ్లను కూడా పండించడం ప్రారంభించాడు. అలా మూడు ఎకరాలతో ప్రారంభించి వ్యవసాయం కాస్తా.. ఇవాళ ఏకంగా 60 ఎకరాలకు విస్తరించాడు. ఏడాదికి 200 టన్నుల డ్రాగన్ ఫ్రూట్ సాగుతోటే కోటికి పైగా ఆర్జించగా, ఇతర పండ్లతో కలిపి సుమారు రూ. 2 కోట్లు పైనే ఆర్జించడం విశేషం. వ్యసాయానికి సాంకేతికతను, ఆధునిక పద్ధతులను జోడిస్తే..కోట్లు గడించొచ్చని చెబుతోంది ఈ రైతు మహేష్ అసబే స్టోరీ.
ఇదీ చదవండి: ఇంద్రధనస్సు, పచ్చదనం మెరుపుల్..! నీతా అంబానీ, రాధికా మర్చంట్‌ల ట్రెడిషనల్ లుక్!


