గోధుమకు ‘వేడి’ సెగ | Warming climate may change protein composition of wheat | Sakshi
Sakshi News home page

గోధుమకు ‘వేడి’ సెగ

Oct 20 2026 6:26 AM | Updated on Oct 20 2026 6:26 AM

Warming climate may change protein composition of wheat

నానాటికీ పెరుగుతున్న సీఓటూ 

ప్రొటీన్‌ కూర్పుపై ప్రభావం? 

నానా రోగాలకు దారి తీయొచ్చు! 

తాజా అధ్యయనం హెచ్చరిక

న్యూఢిల్లీ: మూలిగే నక్కపై తాటిపండు పడనుందా? ఇప్పటికే భూగోళమంతటినీ శరవేగంగా వినాశనం వైపు నెడుతున్న గ్లోబల్‌ వారి్మంగ్‌ అతి త్వరలో ప్రపంచ ఆహార భద్రతను కూడా మరింతగా దెబ్బతీయబోతోందా? వాతావరణంలో నానాటికీ పెరిగిపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ (సీఓటూ)తో అత్యధిక దేశాల్లో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమ దిగుబడితో పాటు నాణ్యత కూడా బాగా తగ్గనుందా? అలాంటి ప్రమాదం నిజంగానే పొంచి ఉందని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి! 

అదే గనక జరిగితే ప్రపంచ ఆహార భద్రత కాస్తా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి...!  ఎల్‌ నినో దెబ్బకు అసలే ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. ఆహారోత్పత్తి గణనీయంగా పడిపోయి అన్ని దేశాలనూ అమితంగా కలవరపెడుతోంది. యూరప్‌వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఊపందుకుంటున్న జనాందోళనలకు తిండి గింజల కొరత కూడా ఓ ప్రధాన కారణంగా మారింది. 

ఇలాంటి పరిస్థితుల్లో మ్యూనిక్‌ (జర్మనీ)లోని లెబి్నజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ టెక్నికల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం మరో బాంబు పేల్చింది. వాతావరణంలో నానాటికీ పెరిగిపోతున్న సీఓటూ గోధుమల్లోని ప్రొటీన్‌ కూర్పును నేరుగా దెబ్బ తీయనుందని అది జరిపిన తాజా అధ్యయనం తేల్చింది! ‘‘దాంతో ఈ కారణంగా గోధుమల నాణ్యత విపరీతంగా తగ్గవచ్చు. ఫలితంగా బ్రెడ్‌తో పాటు గోధుమలతో తయారయ్యే అన్ని ఆహార పదార్థాల్లో పోషకాల స్థాయిలు కూడా బాగా పడిపోతాయి’’అని అధ్యయన బృంద సారథి సబ్రీనా గెస్లిట్జ్‌ ఆందోళన వెలిబుచ్చారు.

 ‘‘ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సీఓటూ సాంద్రత ఇప్పటికే ప్రమాదకర వేగంతో పెరిగిపోతోంది. 1980ల్లో 340 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉన్నది కాస్తా 2024 నాటికి 425 పీపీఎంకు పెరిగింది. కాలుష్యం, గ్లోబల్‌ వారి్మంగ్‌ ఇలాగే కొనసాగితే 2050 కల్లా అది ఏకంగా 600 పీపీఎంకు చేరినా ఆశ్చర్యం లేదు. పెరుగుతున్న సీఓటూ స్థాయిలతో గోధుమపై పడే ప్రభావాన్ని మా బృందం లోతుగా అధ్యయనం చేసింది. ఎంచుకున్న పది గోధుమ రకాల్లో కొన్నింటిని బయటి వాతావరణంలో పండించాం. మరికొన్నింటిని కృత్రిమ పరిస్థితుల్లో 546 పీపీఎం సీఓటూ స్థాయిల్లో పండించి చూశాం.

 అలా పండిన గోధుమల్లో ప్రొటీన్‌ కూర్పు గణనీయంగా మార్పులకు లోనైంది. ఆరోగ్యానికి హానికరమైన అమైలేజ్, ట్రిప్సిన్‌ ఇన్హిబిటర్స్‌ తదితరాల స్థాయి పెరిగింది. ప్యూరోఇండోలైన్స్‌ వంటి ఆరోగ్యకరమైన గ్లూటెన్‌ ప్రొటీన్ల స్థాయి మాత్రం తగ్గింది’’అని ఆమె వివరించారు. ‘‘దీనివల్ల గోధుమను ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దాంతో దీర్ఘకాలంలో వారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడవచ్చు’’అని లెబి్నజ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఫుడ్‌ బయోపాలిమర్‌ కెమిస్ట్రీ రీసెర్చ్‌ గ్రూప్‌ సారథి క్యాథరినా షెర్ఫ్‌ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రఖ్యాత ‘జర్నల్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ’లో ప్రచురితమయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement