కూల్ డ్రింక్స్, బీర్ లవర్స్‌కి గుడ్ న్యూస్! | Govt Extends Beverage Can Quality Deadline to 2027 | Sakshi
Sakshi News home page

కూల్ డ్రింక్స్, బీర్ లవర్స్‌కి గుడ్ న్యూస్!

Oct 24 2026 12:36 PM | Updated on Oct 24 2026 12:57 PM

Govt Extends Beverage Can Quality Deadline to 2027

అల్యూమినియం బెవరేజ్ క్యాన్ల నాణ్యత ప్రామాణీకరణ (మ్యాండేటరీ క్వాలిటీ సర్టిఫికేషన్) అమలు గడువును కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. రాబోయే అక్టోబర్ 31 నాటికి పూర్తికావాల్సిన ఈ గడువును 2027 ఏప్రిల్ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరఫరా సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న డైట్ కోక్, ప్రముఖ బీర్ బ్రాండ్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.

కేంద్ర వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, వివిధ కేటగిరీల తయారీదారులకు వేర్వేరు గడువులను ప్రకటించారు. భారీ పరిశ్రమలకు 2027 ఏప్రిల్ 1 వరకు, చిన్న తరహా (స్మాల్) పరిశ్రమలకు 2027 జులై 1 వరకు, అతి చిన్న (మైక్రో) పరిశ్రమలకు 2027 అక్టోబర్ 1 వరకు గడువు ఇచ్చారు.

మిడిల్ ఈస్ట్ సంక్షోభ ప్రభావం

భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం బీర్, శీతల పానీయాల్లో దాదాపు పావు వంతు (25% కంటే ఎక్కువ) అల్యూమినియం క్యాన్లలోనే విక్రయమవుతున్నాయి. వినియోగదారుల అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల గడిచిన రెండేళ్లలోనే వీటి మార్కెట్ వాటా రెట్టింపైంది. అయితే, ఊహించని స్థాయిలో పెరిగిన ఈ డిమాండ్‌కు అనుగుణంగా దేశీయ క్యాన్ తయారీదారులు సరఫరా అందించలేకపోతున్నారు. దీనికి తోడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం గ్లోబల్ సప్లై చైన్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.

దేశీయంగా అదనంగా 600 మిలియన్ క్యాన్లను ఉత్పత్తి చేయాలని భావించినప్పటికీ సరఫరా అడ్డంకుల వల్ల కేవలం 300 మిలియన్ క్యాన్లను మాత్రమే ఉత్పత్తి చేయగలిగామని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి వెల్లడించారు. బీఐఎస్ గుర్తింపు పొందిన విదేశీ తయారీదారులు సైతం భారత మార్కెట్ అవసరాలను తీర్చలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బీఐఎస్ నాణ్యతా ప్రమాణాలు ఎందుకు?

పానీయాల భద్రత, తాజాదనం, పునర్వినియోగాన్ని (రైసైక్లింగ్) మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) గత ఏడాది ఏప్రిల్‌లో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్‌ను తీసుకొచ్చింది. అల్యూమినియం మెటీరియల్, క్యాన్ పరిమాణం, సీలింగ్, ప్రెజర్ నిరోధకత, లీకేజీ, ప్రొటెక్టివ్ కోటింగ్స్ వంటి సాంకేతిక విషయాల్లో కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే, విదేశీ ప్లాంట్లను పరిశీలించి బీఐఎస్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో కొత్త సరఫరాదారుల నమోదు ఆలస్యమవుతోంది.

ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement