జాబితాలో కోకకోలా కంపెనీ
కార్ల్‌స్‌బర్గ్, పెర్నార్డ్ రికా సైతం
వివిధ దశలలో ఐపీవో సన్నాహాలు
దేశీయంగా కదంతొక్కుతున్న ప్రైమరీ మార్కెట్ అంతర్జాతీయంగా పానీయాలు విక్రయిస్తున్న దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది. దీంతో దేశీ బిజినెస్‌లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్ చేయాలని భావిస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సన్నాహాలు సైతం ప్రారంభించాయి. వీటిలో రెండు ఆల్కహాలిక్ పానీయాల (ఆల్కోబెవ్) దిగ్గజాలు కాగా.. మరొకటి కోకకోలా కంపెనీ.
ప్రధానంగా మూడు అంతర్జాతీయ పానీయ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాటలో సాగనున్నాయి. దేశీ బిజినెస్‌ల లిస్టింగ్‌కు కార్ల్‌స్‌బర్గ్, పెర్నార్డ్ రికా, కోకకోలా కంపెనీ సన్నాహాలు ప్రారంభించాయి. అయితే ఇవి వివిధ దశలలో ఉన్నాయి. వెరసి ఇప్పటికే దేశీయంగా భారీ ఐపీవోలు చేపట్టిన కంపెనీల సరసన పానీయ దిగ్గజాలు సైతం చేరనున్నాయి. అట్లాంటా (యూఎస్) దిగ్గజం కోకకోలాకు భారత్ ఐదో పెద్ద మార్కెట్‌కాగా.. పెర్నార్డ్ రికాకు రెండో పెద్ద మార్కెట్‌కావడం గమనార్హం! అంతేకాకుండా దేశీయంగా రూ. 27,446 కోట్ల టర్నోవర్(2025)తో అతిపెద్ద ఆల్కోబెవ్ కంపెనీగానూ నిలుస్తోంది. ట్యుబర్గ్, కార్ల్‌స్‌బర్గ్ ఎలిఫెంట్, క్రోన్‌బర్గ్ బ్రాండ్లతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్ల్‌స్‌బర్గ్ 2026లో రూ. 8,709 కోట్ల ఆదాయం సాధించింది.
అప్‌డేటెడ్ ఫైలింగ్
ఐపీవో చేపట్టేందుకు వీలుగా డానిష్ బ్రూవరీ దిగ్గజం కార్ల్‌స్‌బర్గ్.. క్యాపిటిల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా సవరించిన(అప్‌డేటెడ్) ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అక్టోబర్ 28న సెబీకి అప్‌డేటెడ్ ముసాయిదా పత్రాలను అందించినట్లు కంపెనీ సీఎఫ్‌వో ఉల్‌రికా ఫెర్న్ బెవరేజెస్ వెల్లడించారు. కార్ల్‌స్‌బర్గ్ ఇండియా లిస్టింగ్‌పై ఆసక్తిగల ఇన్వెస్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్ పేర్కొన్నారు. నియంత్రణా సంబంధ అంశాల నేపథ్యంలో దేశీ బిజినెస్ వివరాలు, ప్రత్యర్ధి కంపెనీలతో పోలి్చన ఫలితాలు తదితరాలను వెల్లడించలేమన్నారు. మరోవైపు ఇదే కారణంతో ఐపీవో చేపట్టే సమయం, పరిమాణం తదితర అంశాలను తెలియజేసేందుకు ఫెర్న్ నిరాకరించారు.
షివాస్ రీగల్ దిగ్గజం
దేశీ బిజినెస్ ఐపీవో చేపట్టేందుకు వీలుగా చర్చలు చేపట్టినట్లు ఫ్రెంచ్ స్పిరిట్స్ తయారీ దిగ్గజం పెర్నార్డ్ రికా తాజాగా వెల్లడించింది. అబ్‌సొల్యూట్, షివాస్ రీగల్, జేమీసన్ తదితర సుప్రసిద్ధ బ్రాండ్ల కంపెనీ ఇందుకు బోర్డు అనుమతి కోసం చూస్తున్నట్లు పేర్కొంది. తొలి త్రైమాసికం(జూలై–సెపె్టంబర్)లో అమ్మకాలు 19 శాతం ఎగసినట్లు వెల్లడించిన కంపెనీ ఈ సందర్భంగా లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది.
బాట్లింగ్ బిజినెస్ లిస్టింగ్
ప్రపంచంలోనే పానీయాల తయారీకి అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న కోకకోలా దేశీ బాట్లింగ్ కార్యకలాపాలను లిస్ట్ చేయాలని చూస్తోంది. హిందుస్తాన్ కోక కోలా హోల్డింగ్స్ ద్వారా హిందుస్తాన్ కోకకోలా బెవరేజెస్(హెచ్‌సీసీహెచ్)ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఐపీవో చేపట్టేందుకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో జాన్ మర్ఫీ వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులు, అనుమతులు తదితరాలపై తగిన సమయంలో మిగిలిన వివరాలను తెలియజేయనున్నట్లు తాజాగా పేర్కొన్నారు. నిజానికి ఈ ఏడాది జూన్‌లోనే దేశీ బాట్లింగ్ బిజినెస్ ఐపీవో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు కోక కోలా ప్రకటించింది.
ఐపీవోకు సదరన్ కోల్‌ఫీల్డ్స్ రెడీ
సెబీకి కోల్ ఇండియా దరఖాస్తు
ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ విభాగం సదరన్ కోల్‌ఫీల్డ్స్(ఎస్‌ఈసీఎల్) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా ప్రమోటర్ కోల్ ఇండియా 66.81 కోట్ల షేర్లు విక్రయించనుంది. వెరసి ఇష్యూ నిధులు ఎస్‌ఈసీఎల్‌కుకాకుండా కోల్ ఇండియా అందుకోనుంది. 1985లో ప్రారంభమైన కంపెనీ గతేడాది(2025–26) 176.29 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఇది 17 శాతం వాటాకాగా.. బిలాస్‌పూర్(చత్తీస్‌గఢ్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ దేశీయంగా అతిపెద్ద బొగ్గు ఉత్పాదక కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది.
ఫస్టాఫ్‌లో రూ.84,400 కోట్లు!
రికార్డు స్థాయిలో 71 ఐపీఓలు..
దేశీ స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఆఫర్లు దుమ్మురేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2026–27, ఏప్రిల్–సపె్టంబర్)లో రికార్డు స్థాయిలో 71 కంపెనీలు రూ.84,400 కోట్ల నిధులను కంపెనీలు సమీకరించాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే సమీకరణ మొత్తం 30 శాతం జంప్ చేసింది. కాగా, ఇందులో 94 శాతం నిధులను జూలై–సెప్టెంబర్ మూడు నెలల కాలంలోనే దక్కించుకోవడం విశేషం. గ్రాంట్ థార్న్‌టన్ భారత్ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం పస్టాఫ్‌లో 55 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ. 64,900 కోట్లు రాబట్టాయి. సగటున లిస్టింగ్ లాభాలు కూడా క్రితం ఏడాదితో పోలిస్తే 10 శాతం నుంచి 18 శాతానికి పెరగడం గమనార్హం.
ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?


