ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ పుంజుకునేంత వరకు వృద్ధికి బాసటనిచ్చేలా ప్రభుత్వమే పెట్టుబడుల ప్రక్రియ కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మూలధన పెట్టుబడుల రూపంలో ఇటు ఖర్చు చేస్తూనే అటు వృద్ధికి కూడా ఊతమిచ్చే క్రమంలో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తుందని, రెండింటి మధ్య సమతూకం పాటిస్తుందని ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.
ఈ వ్యూహం గత నాలుగైదేళ్లుగా మంచి ఫలితాలనే ఇస్తోందని, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తోందని వివరించారు. ఎకానమీ ఏడు శాతం పైగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో దేశ భవిష్యత్తుపై అందరూ ధీమా కలిగి ఉండాలని, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలని ఆమె చెప్పారు. నిస్పృహ తగ్గించుకుని, భారత భవిష్యత్తుపై ఆశావహ భావం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు.
ఎకానమీకి టాటాలు కీలకం..
టాటా సన్స్, టాటా ట్రస్ట్‌లు తమ మధ్య నెలకొన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్మలా సీతారామన్ సూచించారు. దేశ ఎకానమీలో టాటాలు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం ప్రజల్లో చర్చకు దారి తీయకూడదని ఆమె పేర్కొన్నారు. నాయకత్వ స్థానంలో ఉన్న వారు విభేదాలను పరిష్కరించుకుని, సాధారణ పరిస్థితులు తిరిగొచ్చేలా తగు ప్రయత్నాలు చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలకు సంబంధించి రిటైల్ ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాల్లో నెలకొన్న ఆందోళనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సీతారామన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?


