breaking news
Global Food Policy Report-2017
-
గోధుమకు ‘వేడి’ సెగ
న్యూఢిల్లీ: మూలిగే నక్కపై తాటిపండు పడనుందా? ఇప్పటికే భూగోళమంతటినీ శరవేగంగా వినాశనం వైపు నెడుతున్న గ్లోబల్ వారి్మంగ్ అతి త్వరలో ప్రపంచ ఆహార భద్రతను కూడా మరింతగా దెబ్బతీయబోతోందా? వాతావరణంలో నానాటికీ పెరిగిపోతున్న కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ)తో అత్యధిక దేశాల్లో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమ దిగుబడితో పాటు నాణ్యత కూడా బాగా తగ్గనుందా? అలాంటి ప్రమాదం నిజంగానే పొంచి ఉందని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి! అదే గనక జరిగితే ప్రపంచ ఆహార భద్రత కాస్తా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారడం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి...! ఎల్ నినో దెబ్బకు అసలే ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. ఆహారోత్పత్తి గణనీయంగా పడిపోయి అన్ని దేశాలనూ అమితంగా కలవరపెడుతోంది. యూరప్‌వ్యాప్తంగా కొద్ది రోజులుగా ఊపందుకుంటున్న జనాందోళనలకు తిండి గింజల కొరత కూడా ఓ ప్రధాన కారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యూనిక్ (జర్మనీ)లోని లెబి్నజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం మరో బాంబు పేల్చింది. వాతావరణంలో నానాటికీ పెరిగిపోతున్న సీఓటూ గోధుమల్లోని ప్రొటీన్ కూర్పును నేరుగా దెబ్బ తీయనుందని అది జరిపిన తాజా అధ్యయనం తేల్చింది! ‘‘దాంతో ఈ కారణంగా గోధుమల నాణ్యత విపరీతంగా తగ్గవచ్చు. ఫలితంగా బ్రెడ్‌తో పాటు గోధుమలతో తయారయ్యే అన్ని ఆహార పదార్థాల్లో పోషకాల స్థాయిలు కూడా బాగా పడిపోతాయి’’అని అధ్యయన బృంద సారథి సబ్రీనా గెస్లిట్జ్ ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సీఓటూ సాంద్రత ఇప్పటికే ప్రమాదకర వేగంతో పెరిగిపోతోంది. 1980ల్లో 340 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నది కాస్తా 2024 నాటికి 425 పీపీఎంకు పెరిగింది. కాలుష్యం, గ్లోబల్ వారి్మంగ్ ఇలాగే కొనసాగితే 2050 కల్లా అది ఏకంగా 600 పీపీఎంకు చేరినా ఆశ్చర్యం లేదు. పెరుగుతున్న సీఓటూ స్థాయిలతో గోధుమపై పడే ప్రభావాన్ని మా బృందం లోతుగా అధ్యయనం చేసింది. ఎంచుకున్న పది గోధుమ రకాల్లో కొన్నింటిని బయటి వాతావరణంలో పండించాం. మరికొన్నింటిని కృత్రిమ పరిస్థితుల్లో 546 పీపీఎం సీఓటూ స్థాయిల్లో పండించి చూశాం. అలా పండిన గోధుమల్లో ప్రొటీన్ కూర్పు గణనీయంగా మార్పులకు లోనైంది. ఆరోగ్యానికి హానికరమైన అమైలేజ్, ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ తదితరాల స్థాయి పెరిగింది. ప్యూరోఇండోలైన్స్ వంటి ఆరోగ్యకరమైన గ్లూటెన్ ప్రొటీన్ల స్థాయి మాత్రం తగ్గింది’’అని ఆమె వివరించారు. ‘‘దీనివల్ల గోధుమను ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దాంతో దీర్ఘకాలంలో వారు నానా రకాల ఆరోగ్య సమస్యల బారిన పడవచ్చు’’అని లెబి్నజ్ ఇన్స్టిట్యూట్లో ఫుడ్ బయోపాలిమర్ కెమిస్ట్రీ రీసెర్చ్ గ్రూప్ సారథి క్యాథరినా షెర్ఫ్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రఖ్యాత ‘జర్నల్ ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురితమయ్యాయి. -
వచ్చే పదేళ్లలో ఇండియాకు కొత్త సవాళ్లు!
గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్–2017 బరువు పెరగడం చాలా సులభం. కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇలాంటి విచిత్ర పరిస్థితినే వచ్చే పదేళ్లలో మనదేశం ఎదుర్కొనబోతోందట. అందుకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఇంతకీ ఆ విచిత్ర పరిస్థితేంటో మరే చదవండి... డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆకర్షణీయ నగరాలు, మెట్రో రైళ్లు వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. ఫలితంగా వచ్చే పదేళ్లలో దేశ పట్టణ జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇలా పెరిగే పట్టణ జనాభాతో దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొనుందట. ‘గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్ట్–2017’ పేరుతో ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా పట్టణాలకు వలస రావడంతో ఇక గ్రామాల్లో ఉండేవారి పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారికి కనీసస్థాయి పోషకాహరం కూడా అందని దుస్థితి నెలకొంటుందని తెలిపింది. ఇక పట్టణాల్లోకి వచ్చేవారిలో 17 శాతం మంది మురికివాడల్లోనే నివసించాల్సి వస్తుందని, ఇటువంటి వారికి కూడా సరిపడ స్థాయిలో పోషకాహారం అందే పరిస్థితి ఉండదని తెలిపింది. దాదాపు 78 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలోనే పనిచేస్తారని, చాలీచాలని జీతం, అధిక పనిగంటలు, విశ్రాంతి కూడా తీసుకోని పరిస్థితులు, కాలుష్యపూరిత వాతావరణంలో నివసించడం వంటివి పట్టణ జనాభాలో 78 శాతం మందిని తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వాలు అమలు చేసే ఉపాధి కూలీ, మధ్యాహ్న భోజనం, రేషన్ బియ్యంతోనే నెట్టుకొచ్చే కుటుంబాల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది. ఇందుకు భిన్నంగా... ఒకవైపు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పనిలేని పరిస్థితులుంటే మరోవైపు అధిక పోషకాహారం కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య కూడా భారత్‌లో పెరుగుతోందని గ్లోబల్ సర్వే వెల్లడించింది. ఇప్పటికే ఐదేళ్లలోపు చిన్నారుల్లో 38.5 మంది అవసరమైన దానికంటే ఎక్కువ బరువున్నారని, రానున్న పదేళ్లలో వీరిసంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిపింది. మధుమేహం, ఊబకాయం, అధిక బరువు, జీవనశైలిలో శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో అనారోగ్యంబారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతుందని వెల్లడించింది. రెండూ సమస్యలే... ఆహార కొరతను అధిగమించేందుకు అవకాశమున్నప్పటికీ నివాస సదుపాయాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది ఇబ్బంది పడక తప్పదని, ఇది దేశానికి తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని హెచ్చరించింది. మరోవైపు అవసరానికి మించి పోషకాహారం, సుఖమైన జీవన విధానం కారణంగా అనారోగ్య సమస్యలనెదుర్కొనేవారి సంఖ్య కూడా దేశానికి ఇబ్బందికరంగానే మారే పరిస్థితి ఉందని హెచ్చరించింది. ఈ రెండింటిని పరిష్కరించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరముందని సర్వే సంస్థ అభిప్రాయపడింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్


