వచ్చే పదేళ్లలో ఇండియాకు కొత్త సవాళ్లు! | Sakshi
Sakshi News home page

వచ్చే పదేళ్లలో ఇండియాకు కొత్త సవాళ్లు!

Published Fri, Mar 24 2017 10:37 PM

వచ్చే పదేళ్లలో ఇండియాకు కొత్త సవాళ్లు!

గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్ట్‌–2017
బరువు పెరగడం చాలా సులభం. కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం. ఇది ఎంతోమంది విషయంలో రుజువైంది. ఇలాంటి విచిత్ర పరిస్థితినే వచ్చే పదేళ్లలో మనదేశం ఎదుర్కొనబోతోందట. అందుకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఇంతకీ ఆ విచిత్ర పరిస్థితేంటో మరే చదవండి...

డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, ఆకర్షణీయ నగరాలు,  మెట్రో రైళ్లు వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది. ఫలితంగా వచ్చే పదేళ్లలో దేశ పట్టణ జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఇలా పెరిగే పట్టణ జనాభాతో దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొనుందట. ‘గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్ట్‌–2017’ పేరుతో ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన నివేదిక ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలంతా పట్టణాలకు వలస రావడంతో ఇక గ్రామాల్లో ఉండేవారి పరిస్థితి దయనీయంగా మారుతుందని, వారికి కనీసస్థాయి పోషకాహరం కూడా అందని దుస్థితి నెలకొంటుందని తెలిపింది.

ఇక పట్టణాల్లోకి వచ్చేవారిలో 17 శాతం మంది మురికివాడల్లోనే నివసించాల్సి వస్తుందని, ఇటువంటి వారికి కూడా సరిపడ స్థాయిలో పోషకాహారం అందే పరిస్థితి ఉండదని తెలిపింది. దాదాపు 78 శాతం మంది అవ్యవస్థీకృత రంగంలోనే పనిచేస్తారని, చాలీచాలని జీతం, అధిక పనిగంటలు, విశ్రాంతి కూడా తీసుకోని పరిస్థితులు, కాలుష్యపూరిత వాతావరణంలో నివసించడం వంటివి పట్టణ జనాభాలో 78 శాతం మందిని తీవ్ర ఇబ్బందులపాలు చేస్తాయని నివేదిక పేర్కొంది. ప్రభుత్వాలు అమలు చేసే ఉపాధి కూలీ, మధ్యాహ్న భోజనం, రేషన్‌ బియ్యంతోనే నెట్టుకొచ్చే కుటుంబాల సంఖ్య  పెరుగుతుందని హెచ్చరించింది.

ఇందుకు భిన్నంగా...
ఒకవైపు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పనిలేని పరిస్థితులుంటే మరోవైపు అధిక పోషకాహారం కారణంగా అనారోగ్యం పాలవుతున్నవారి సంఖ్య కూడా భారత్‌లో పెరుగుతోందని గ్లోబల్‌ సర్వే వెల్లడించింది. ఇప్పటికే  ఐదేళ్లలోపు చిన్నారుల్లో 38.5 మంది అవసరమైన దానికంటే ఎక్కువ బరువున్నారని, రానున్న పదేళ్లలో వీరిసంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని తెలిపింది. మధుమేహం, ఊబకాయం, అధిక బరువు, జీవనశైలిలో శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో అనారోగ్యంబారిన పడేవారి సంఖ్య కూడా పెరుగుతుందని వెల్లడించింది.

రెండూ సమస్యలే...
ఆహార కొరతను అధిగమించేందుకు అవకాశమున్నప్పటికీ నివాస సదుపాయాలు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది ఇబ్బంది పడక తప్పదని, ఇది దేశానికి తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని హెచ్చరించింది. మరోవైపు అవసరానికి మించి పోషకాహారం, సుఖమైన జీవన విధానం కారణంగా అనారోగ్య సమస్యలనెదుర్కొనేవారి సంఖ్య కూడా దేశానికి ఇబ్బందికరంగానే మారే పరిస్థితి ఉందని హెచ్చరించింది. ఈ రెండింటిని పరిష్కరించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయాల్సిన అవసరముందని సర్వే సంస్థ అభిప్రాయపడింది.
– సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement
Advertisement