మ్యూనిక్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతుండగా రెండు సార్లు తగ్గిన విమాన వేగం
నేలను తాకిన తోక భాగం
సాంకేతిక లోపాలతో రెండు గంటలపాటు గాల్లో చక్కర్లు
ఫ్యూయల్ అయిపోయాక సురక్షితంగా ల్యాండింగ్
మ్యూనిక్: జర్మనీలో వియత్నాం ఎయిర్‌లైన్స్ విమానం లోపల ఉన్న ప్రయాణికులను, జర్మనీ విమానాశ్రయ సిబ్బందిని రెండు గంటలపాటు ఉత్కంఠతకు గురి చేసింది. మ్యూ నిక్ నుంచి హనోయికి వెళ్తున్న బోయింగ్ 787–9 విమానం ఆగష్టు 15న మధ్యాహ్నం 1:45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మ్యూనిక్ నుండి బయలుదేరింది. టేకాఫ్ కోసం విమానం పైకి లేస్తున్న సమయంలోనే దాని వేగం అసాధారణంగా తగ్గింది.
రన్‌వేలో దాదాపు సగం దూరం వెళ్ళినప్పుడు, విమానం వేగం పెరగడం సుమారు రెండు సెకన్ల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వేగాన్ని పుంజుకుంది. కొద్దిసేపటి తర్వాత మరోసారి వేగం తగ్గింది. టేకాఫ్‌ను సురక్షితంగా రద్దు చేయడానికి తగినంత రన్‌వే లేదని నిర్ధారించుకున్న పైలట్లు టేకాఫ్‌ను కొనసాగించారు. కేవలం 91 మీటర్ల రన్‌వే మాత్రమే మిగిలి ఉండగా టేకాఫ్ చేశారు. అంతేకాదు, విమానం ఎనిమిది ప్రధాన ల్యాండింగ్–గేర్ టైర్లలో నాలుగు పగిలిపోయాయి.
టేకాఫ్ సమయంలో తోక రన్‌వేను ఢీకొట్టింది. గాలిలోకి లేచిన కొద్దిసేపటికే విమానం తోక నేలను తాకే అవకాశం ఉందని, టైర్లలో గాలి ఒత్తిడి తక్కువగా ఉందని హెచ్చరికలు వచ్చాయి. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియజేసిన సిబ్బంది, విమానం మ్యూనిక్‌కు తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, తిరిగి రావాల్సి ఉంటుందని కెపె్టన్ ప్రకటించిన తర్వాత, క్యాబిన్‌లోని వాతావరణం మారిపోయింది.
ఆందోళన ఉన్నప్పటికీ, ప్రయాణికులు ప్రశాంతంగానే ఉన్నారు. మ్యూనిక్‌కు తిరిగి వెళ్ళేందుకు విమానం బరువును తగ్గించడానికి సిబ్బంది ఇంధనాన్ని ఖాళీ చేయడం ప్రారంభించే ముందు, అది సుమారు 9,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ప్రయాణికులు రెండు రెక్కల నుండి ఇంధనాన్ని ఖాళీ చేయడాన్ని చూస్తుండగా, ఆ విమానం గంటకు పైగా విమానాశ్రయం సమీపంలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత విమానం విమానాశ్రయం చుట్టూ తక్కువ ఎత్తులో రెండుసార్లు ప్రదక్షిణ చేసింది.
దీనివల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు దాని ల్యాండింగ్ గేర్‌ను ప్రత్యక్షంగా తనిఖీ చేయగలిగారు. బయలుదేరిన సుమారు రెండు గంటల తర్వాత, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:57 గంటలకు ఆ విమానం చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. అందుకు గుర్తుగా విమానం వెనుక భాగం కింద నిలువుగా ఉన్న గీతలు, విమానం బయటి పొర చిరిగిపోయిన అనేక ప్రాంతాలను కూడా తనిఖీ అధికారులు కనుగొన్నారు.
గ్రౌండ్ సిబ్బందికి మంటలు లేదా పొగ జాడలు ఏవీ కనిపించలేదు. ఆ సమయంలో విమానంలో మొత్తం 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులకు ఇతర విమానయాన సంస్థల విమానాల్లో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. అలాగే, ప్రత్యామ్నాయ విమానాల కోసం ఎదురుచూస్తున్న వారికి వసతి, భోజనం మరియు స్థానిక రవాణా సౌకర్యాలను కూడా కల్పించింది.
డ్యూటీలో ఉన్న నలుగురు వియత్నాం పైలట్లకు మొత్తం 63,938 గంటల విమానయాన అనుభవం ఉంది. అందులో 19,675 గంటలు బోయింగ్ 787 విమానంలో గడిపినవారున్నారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారని వియత్నాం సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఆగస్టు 15న జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో కార్యకలాపాలకు కూడా అంతరాయం కలిగించింది. జర్మనీ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ బీఎఫ్‌యూ దీనిని దర్యాప్తుచేస్తోంది.


