జర్మనీలోని స్పాంగ్‌డహ్లెమ్ అమెరికా, నాటో వైమానిక స్థావరం సమీపంలో మంగళవారం అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్పాంగ్‌డహ్లెమ్ అమెరికా వైమానిక స్థావరం తెలిపింది.
రైన్‌లాండ్-పాలటినేట్ రాష్ట్రంలోని ఐఫెల్ ప్రాంతంలో ఉన్న అమెరికా, నాటో స్థావరానికి విమానం చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థావర ప్రతినిధి న్యూయార్క్ పోస్ట్‌కు తెలిపారు. శిక్షణ విన్యాసాల్లో మొత్తం నాలుగు యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. వాటిలో స్పాంగ్‌డహ్లెమ్‌కు తిరిగి వస్తున్న రెండు విమానాల్లో ఒకటి ఉదయం 8.30 గంటల ఈస్టర్న్ టైమ్ సమయంలో కూలిపోయినట్లు జర్మన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌డబ్ల్యూఆర్‌కు తెలిపింది. మిగిలిన మూడు విమానాలను సమీపంలోని రామ్‌స్టెయిన్ వైమానిక స్థావరానికి మళ్లించారు.
ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానిక మేయర్ బిర్తె థామ్సెన్ మాట్లాడుతూ.. విమానం ‘‘వేగంగా కిందకు దిగడం, ఆ వెంటనే పెద్ద ఎత్తున నల్లటి పొగ రావడం’’ చూశానని ఎస్‌డబ్ల్యూఆర్‌కు తెలిపారు. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహా అత్యవసర సేవల బృందాలను పంపించారు. సమీపంలోని గోల్ఫ్ కోర్సుకు ఆనుకుని ఉన్న రన్‌వే ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగాయి. అక్కడ భారీగా సైరన్ల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాటర్ క్యానన్లు, కాలిపోయిన ఇనుప ముక్కల కుప్పలా కనిపించిన శకలాలు కూడా అక్కడ ఉన్నట్లు వారు చెప్పారు.ప్రమాదానికి కారణం, ఇతర వివరాలపై ప్రస్తుతానికి సమాచారం ఇవ్వలేమని ఐఫెల్ జిల్లా ప్రతినిధి తెలిపారు.
స్పాంగ్‌డహ్లెమ్‌లో 52వ ఫైటర్ వింగ్
స్పాంగ్‌డహ్లెమ్ స్థావరంలో అమెరికా వైమానిక దళానికి చెందిన 52వ ఫైటర్ వింగ్ ఉంది. ఇది యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అమెరికా, నాటో వైమానిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. లక్సెంబర్గ్‌తో జర్మనీ సరిహద్దుకు సుమారు 15 మైళ్ల దూరంలో ఉన్న ఈ స్థావరంలో సైనిక, పౌర సిబ్బంది, వారి కుటుంబాలు కలిపి సుమారు 5,000 మంది, మరో 700 నుంచి 800 మంది జర్మన్ ఉద్యోగులు ఉన్నారు. అక్కడ దాదాపు 20 ఎఫ్-16 విమానాలు ఉన్నాయి.
మంగళవారం ప్రమాదానికి గురైన విమానం విలువ 60 మిలియన్ నుంచి 80 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ ఘటనకు వారం కూడా గడవకముందే అమెరికాలోని మిషిగన్‌లో మరో ఎఫ్-16 కూలింది. ఆ ప్రమాదంలో టెక్సాస్ నేషనల్ గార్డ్‌కు చెందిన పైలట్ బయటకు దూకి, స్థిరమైన స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అది సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విమానమని టెక్సాస్ మిలిటరీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ఆ ప్రమాదంలో నేలపై ఎవరికీ గాయాలు కాలేదు.
A U.S. Air Force F-16 Fighting Falcon assigned to the 52nd Fighter Wing crashed at Spangdahlem Air Base in Germany earlier today after its pilot safely ejected; the pilot remains hospitalized for medical treatment, the wing said. pic.twitter.com/JjI9SvtQSE
— AZ Intel (@AZ_Intel_) September 22, 2026


