సముద్ర గర్భంలో రష్యా భారీ విధ్వంసకర ప్లాన్.. నాటో తిప్పికొట్టి.. | Russia's Secret Undersea Weapon NATO Tracks | Sakshi
Sakshi News home page

సముద్ర గర్భంలో రష్యా భారీ విధ్వంసకర ప్లాన్.. నాటో తిప్పికొట్టి..

Sep 12 2026 5:47 PM | Updated on Sep 12 2026 5:59 PM

Russia's Secret Undersea Weapon NATO Tracks

ఆర్కిటిక్ సముద్ర జలాల్లో కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేసేందుకు రష్యా చేపట్టిన రహస్య ప్రయత్నాన్ని నాటో దేశాలు అడ్డుకున్నాయి. కొన్ని నెలల క్రితం స్వాల్‌బార్డ్ దీవుల సమీపంలో రష్యా జలాంతర్గాములు ఓ రహస్య ఆయుధాన్ని ప్రయోగించేందుకు శిక్షణ తీసుకుంటుండగా బ్రిటన్, నార్వే, అమెరికా సంయుక్తంగా వాటిని గుర్తించి అడ్డుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది.

ఈ రహస్య ఆపరేషన్‌ను రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నిర్వహించినట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. లోతైన సముద్రంలో ప్రయాణించగల చిన్న జలాంతర్గాములను ఉపయోగించి అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలో రష్యా సిబ్బంది పరీక్షించినట్లు చెప్పారు.

బ్రిటన్, నార్వే, అమెరికా కలిసి రష్యా నౌకలను సముద్రంలో గుర్తించి ఎదుర్కొన్నాయి. దీంతో రష్యా తన శిక్షణను పూర్తి చేయలేకపోయింది. అనంతరం ఆ నౌకలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాయి. ఈ ఘటనలో ఎలాంటి సముద్రగర్భ కేబుల్‌ దెబ్బతినలేదు. నాటోతో ఘర్షణ ఏర్పడితే ఆ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో పరీక్షించడమే ఈ శిక్షణ ఉద్దేశమని అధికారులు తెలిపారు.

స్వాల్‌బార్డ్ దీవులను నార్వే ప్రధాన భూభాగంతో కలిపే 2 సముద్రగర్భ ఫైబర్‌ ఆప్టిక్ కేబుళ్లు సుమారు 1,400 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి 2,700 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహ భూ కేంద్రంగా ఉన్న స్వాల్‌సాట్ నుంచి భారీ మొత్తంలో ఉపగ్రహ సమాచారాన్ని ఈ కేబుళ్లు ప్రసారం చేస్తాయి.

విధ్వంసక చర్యలను పెంచుతున్న రష్యా 
ఈ ఘటనతో రష్యా యూరప్‌లో విధ్వంసక చర్యలను పెంచుతోందన్న పాశ్చాత్య దేశాల ఆందోళనలు మరింత పెరిగాయి. కొంతమంది అమెరికా నిఘా అధికారులు రష్యా నాటో పరస్పర రక్షణ ఒప్పందంలోని ఆర్టికల్‌ 5ను పరీక్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటోలోని ఓ సభ్యదేశంపై తీవ్రమైన దాడి జరిగితే ఇతర సభ్యదేశాలు దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే నిబంధనే ఆర్టికల్‌ 5.

రష్యా తన చర్యలతో కేబుళ్లకు ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. బ్రిటన్, నార్వే అధికారులు తమ వద్ద కొత్త సాంకేతికతపై సమాచారం ఉందని మాస్కోకు తెలియజేసినట్లు చెప్పారు. రష్యా దాన్ని ఉపయోగించకుండా వెనక్కి తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.

‘‘మా సంయుక్త చర్య ద్వారా రష్యాకు స్పష్టమైన సందేశం పంపాం. వారు రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించలేరు’’ అని నార్వే రక్షణ మంత్రి టోరె శాండ్‌విక్ తెలిపారు. కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా గుర్తించి తగిన పరిణామాలు ఎదుర్కొనేలా చేస్తామని రష్యా అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.

బ్రిటన్, నార్వే ఏప్రిల్‌లోనే ఆందోళన 
రష్యా సముద్రగర్భ కార్యకలాపాలపై బ్రిటన్, నార్వే ఏప్రిల్‌లోనే ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నార్వే, బ్రిటన్ జలాల్లో రహస్య కార్యకలాపాలకు ప్రయత్నించినట్లు అప్పట్లో వెల్లడించాయి. ఈ విభాగంపై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు విధించాయి. 2022లో జర్మనీకి రష్యా నుంచి సహజ వాయువును సరఫరా చేసే నార్డ్‌ స్ట్రీమ్‌ సముద్రగర్భ పైప్‌లైన్లలో 4లో 3 ధ్వంసమైన తర్వాత నాటో దేశాలు సముద్రగర్భ మౌలిక వసతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. 

ఈ ఘటనలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని ఆ దేశం ఖండించింది. 2023 నుంచి సముద్రగర్భ పైప్‌లైన్లు, విద్యుత్‌ కేబుళ్లు, సమాచార కేబుళ్లకు సమీపంలో కొన్ని నౌకలు నెమ్మదిగా ప్రయాణిస్తూ వాటి స్థానాలను గుర్తిస్తున్నట్లు భద్రతా నిపుణులు గుర్తించారు. దీనిని ‘డ్రిఫ్టింగ్‌’గా పిలుస్తారు.

గత ఏడాది ఉత్తర సముద్రంలో ఇలాంటి నౌకల సంఖ్య 52 శాతం పెరిగి 13,079కు చేరింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఈ కార్యకలాపాలు 88 శాతం పెరిగి 18,401 నౌకలకు చేరినట్లు సముద్ర భద్రతా విశ్లేషణ సంస్థ విండ్‌వార్డ్ తెలిపింది. సముద్రగర్భ మౌలిక వసతులపై విస్తృతంగా సమాచారాన్ని సేకరించడం చట్టవిరుద్ధం కాకపోయినా, ఇంత భారీ స్థాయిలో ప్రాంతాలను గుర్తించడం భవిష్యత్తులో విధ్వంసక చర్యలకు సిద్ధమవుతున్న సంకేతంగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు.

ఈ కార్యకలాపాలు, కొన్ని కేబుళ్లపై అనుమానాస్పద జోక్యాల నేపథ్యంలో నాటో గత ఏడాది జనవరిలో బాల్టిక్‌ సెంట్రీ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది. బ్రిటన్ నేతృత్వంలో నార్డిక్‌ వార్డెన్‌ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కీలక మౌలిక వసతులపై నిఘా, గస్తీని పెంచడం ఈ కార్యక్రమాల ఉద్దేశం.

విద్యుత్‌, సమాచార ప్రసార కేబుళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఆధారపడటం పెరుగుతున్నందున సముద్రగర్భ మౌలిక వసతుల ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. కృత్రిమ మేధ కారణంగా సమాచారంతో పాటు విద్యుత్‌ అవసరం పెరుగుతుండటంతో ఈ కేబుళ్ల సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే యూరప్‌ ఇప్పటికీ ఈ మౌలిక వసతులపై ముప్పును ఎదుర్కొనే స్థితిలోనే ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రూకింగ్స్‌ సంస్థకు చెందిన సీనియర్‌ పరిశోధకుడు బ్రూస్‌ జోన్స్‌ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో యూరప్‌ సముద్రగర్భ మౌలిక వసతులపై ఆధారపడటాన్ని భారీగా పెంచుకున్నా, వాటిని రక్షించే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుందని అన్నారు. పెరుగుతున్న రష్యా ముప్పు నేపథ్యంలో ఇప్పుడు ఆ రక్షణ సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement